అగ్రశ్రేణి నటుడు నాగార్జునకు ‘కృష్ణార్జున’ మంచి పాఠమే నేర్పినట్లు తెలుస్తోంది. ఇకనుంచీ తన ఇమేజ్‌కి తగని ప్రత్యేక పాత్రలు చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ‘కృష్ణార్జున’లో ఆయన హీరో విష్ణుకి సాయపడే దేవుని పాత్రను చేశారు. పైకి అది చక్కని పాత్రగా కనిపించినా సినిమాలో ఆయన పాత్ర నవ్వుతూ డైలాగులకి మాత్రమే పరిమితమైంది. పైగా ఆయన ఒకసారి చీపురు పట్టుకుని స్వీపర్‌గా, మరోసారి భుజం మీద జోలె వేలాడేసుకుని బిచ్చగాడిగా కనిపించడం ఆయన అభిమానులకి ఏమాత్రం రుచించలేదు. తమ హీరో కనిపించిన తీరుకి వారు చాలాచోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. కాకినాడలోని ఒక థియేటర్ ఫర్నిచర్‌ని వారు ధ్వంసం చేయడం అందులో భాగమే. అంతకుముందు ‘డాన్’ సినిమా విషయంలోనూ అభిమానులు అసంతృప్తి చెందారు. ఆ చిత్రంలో ఆయనకంటే రాఘవ లారెన్స్ పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా వుందనే అభిప్రాయం వ్యక్తం కావడం దానికి కారణం. ఈ రెండు సినిమాలు వెంటవెంటనే రావడం అభిమానులకి పుండుమీద కారం చల్లినట్లు అయింది. వారి ఆగ్రహాన్ని చూశాక నాగార్జున ఆలోచనలో పడ్డారని తెలిసింది. ‘కృష్ణార్జున’ విడుదలయ్యాక తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు వరుసగా వస్తాయని చెప్పిన ఆయన మాటలు ఆ సినిమా ఘోర వైఫల్యంతో విలువలేనివిగా మారిపోయాయి. అందుకే ఇకనుంచీ మొహమాటాలకు పోయి ప్రత్యేక పాత్రలు చేయకూడదని ఆయన దృఢ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.