Krishnarjuna Telugu Review

Rating: 2.50/5

Critic Rating: (2.50/5)

‘కృష్ణార్జున’ కుంగిపోయారు!

విష్ణు హీరోగా ‘చంద్రముఖి’ దర్శకుడు పి. వాసు రూపొందించిన సినిమాలో నాగార్జున కూడా నటించాడంటే ఆ సినిమా సాధారణ ప్రేక్షకుల్లో కుతూహలాన్ని రేకెత్తించడం సహజం. ‘కృష్ణార్జున’ విషయంలో జరిగింది అదే. ‘ఢీ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విష్ణు కథానాయకుడిగా నటించడం, నాగార్జున దేవుడి పాత్రను చేయడం ఈ సినిమాకి ముందస్తు ఆకర్షణని తీసుకొచ్చాయి. ‘యమదొంగ’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మమతా మోహన్‌దాస్ నాయికగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదలయ్యింది. జిమ్ క్యారీ నటించగా హిట్టయిన హాలీవుడ్ హిట్ సినిమా ‘బ్రూస్ ఆల్మైటీ’ స్ఫూర్తితో ఈ సినిమా తీశారని ప్రచారం జరిగినా.. ఆ కథకీ, ‘కృష్ణార్జున’ కథకీ పోలికే లేదు.

కథ:

‘కృష్ణార్జున’ చాలా సాధారణ కథ. దేవుడి పాత్ర మినహాయిస్తే చాలా పాత కథ. అమ్మమ్మ (మనోరమ) తప్ప లోకంలో ఇంకెవరూ లేని అర్జున్ (విష్ణు) అనే పాతికేళ్ల అమాయక యువకుడు కోదండం (నాజర్) కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి అక్కడివారందిరికీ సేవ చేస్తుంటాడు. కోదండం చెల్లెలు సత్య (మమతా మోహన్‌దాస్) పొగరుబోతు పిల్ల. ఆమెకి రత్నాల వ్యాపారి నాగరాజు (తనికెళ్ల) కొడుకు ప్రేమ్ (దేవ్ గిల్లి)తో పెళ్లి జరిపించాలని కోదండం నిర్ణయిస్తాడు. అయితే ఆమెకి తాళి కట్టిన మొదటి భర్త ఎక్కువ రోజులు బతకడని నీలకంఠ శాస్త్రి (నెపోలియన్) అనే జ్యోతిష్కుడు చెబుతాడు. దాంతో అమాయకుడైన అర్జున్‌ని బలిపశువు చేయాలని అతనితో సత్యకి తాళి కట్టిస్తాడు కోదండం. అర్జున్ చనిపోయాక ప్రేమ్‌నీ, సత్యనీ ఒకటి చేయాలనేది అతని ఆలోచన. దీనికి సత్య కూడా సరేనంటుంది. ఆ సంగతి తెలిశాక అర్జున్ ఏం చేశాడు? అతనికి దేవుడు (నాగార్జున) ఎలా సహాయపడ్డాడు? అర్జున్‌కి సత్య చేరువయ్యిందా? నీలకంఠ శాస్త్రి మాట నిజమయ్యిందా? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:

కథాబలం లేని సినిమాలకు కథనమే ప్రాణం. అదికూడా బలహీనంగా వుండడంతో ‘కృష్ణార్జున’ అనాకర్షకంగా తయారయ్యింది. హీరో పాత్ర, కొంచెంగా దేవుని పాత్ర మినహాయిస్తే మిగతా పాత్రలేవీ ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాలోని ప్రధాన లోపం. కథ ఎత్తుగడనుంచే సినిమాలో ఒకదానివెంట ఒకటిగా తప్పులు దొర్లుతూ వచ్చాయి. హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాపాయ స్థితిలో వున్న విష్ణు మొహాన్నీ, మూసివున్న గుడి తలుపుల్నీ చూపించడంతో సినిమా మొదలవుతుంది. కానీ ఆ సీనే తప్పు. గుడి తలుపులు తెరుచుకున్నాకే అతడికి ఆస్థితి దాపురించింది. డైరెక్టర్, ఎడిటర్ ఆ సంగతి విస్మరించారు. కథ మొత్తం ఫాష్‌బ్యాక్‌లోనే సాగుతుంది. పిచ్చిదైన విష్ణు తల్లి పిచ్చాసుపత్రినుంచి తప్పించుకుని పరుగెత్తుకుంటూ వచ్చి గర్భగుడిలో బిడ్డని కని చనిపోతుంది. ఎవరైనా అప్పుడు ఆ పుట్టింది దేవుని బిడ్డగానే పరిగణిస్తారు. కానీ వూరి జనం మాత్రం గుడి మైల పడిందంటూ గుడిని మూసేయడం కృతకంగా వుంది. విష్ణు తల్లి పిచ్చిదెందుకయ్యిందనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రథమార్థంలో చెప్పుకోడానికి కథంటూ లేదు. నాజర్ కుటుంబాన్ని విష్ణు అమితంగా ప్రేమించడానికి గట్టి కారణం కనిపించదు. ఆ కుటుంబంలోనివారితో విష్ణు అనుబంధాన్ని దర్శకుడు బలంగా చిత్రించలేదు. నాజర్ గానీ, మమత గానీ విష్ణుని కనీస గౌరవంతో చూడరు. ‘చంటి’ సినిమాలో మీనా పాత్ర కూడా బలమైంది కావడంవల్ల వెంకటేష్ పాత్రకి మరింత బలం చేకూరింది. ‘కృష్ణార్జున’లోని లోపం అదే. ఇందులో మమతది నీచ పాత్ర. ఈ రెండు సినిమాల కథకుడు ఒక్కరే. ఆయన దర్శకుడు వాసు. మమత పాత్ర ప్రవర్తించే తీరు, ఆమె కాస్ట్యూమ్స్ ఏవగింపుని కలిగిస్తాయి. దేవుడి సాయంతో బలం తెచ్చుకున్న విష్ణు కాలేజీకి వెళ్లి అక్కడి బ్యాడ్ స్టూడెంట్ గ్యాంగుని తనే కల్పించుకుని మరీ తన్నడం ఆకట్టుకునే సన్నివేశం కాదు. అసలు కారు నడపడం రాని విష్ణుని మమత కాలేజీకి ఎందుకు రోజూ తీసుకుపోతుందో అర్ధం కాని సంగతి.

మొదట్నించీ విష్ణుని చిన్నచూపు చూస్తూ, తన జాతకంలోని దోషాన్ని తొలగించుకోవడానికి అతడితో తాళి కట్టించుకుని అతడి చావుని కోరుకున్న మమతకి అతడిపై అనురాగం కలిగే సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా వున్నాయి. అవి ఏమాత్రం కన్విన్సింగ్ సీన్లు కావు. నాగార్జున పోషించిన దేవుడి పాత్ర సినిమాని మరీ అనాసక్తంగా మార్చకుండా కాపాడింది. నాగార్జున, విష్ణు మధ్య సన్నివేశాలు ఒకింత బాగా వచ్చాయి. తిరిగి క్లైమాక్స్ చతికిలపడింది. జాతకాలు చూపించుకోకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే చాలామంది చనిపోతున్నారని జ్యోతిష్కుడైన నెపోలియన్ వ్యాఖ్యానించడం మూఢత్వానికి పరాకాష్ఠ. బ్రహ్మానందం భార్యగా నటించిన భువనేశ్వరి కనిపించినప్పుడల్లా విష్ణు ఆమెమీద పడి దొర్లడం అభ్యంతరకరం. బ్రహ్మానందం, సునీల్, ఎమ్మెస్ నారాయణ వంటి ఉద్ధండులు వున్నప్పటికీ కామెడీని పండించడంలో వాసు అసంతృప్తి కలిగించాడు.  

పాత్రధారుల అభినయం:

అర్జున్ పాత్రని విష్ణు సమర్ధవంతంగా పోషించాడు. అతని నటనలో, డైలాగ్ మాడ్యులేషన్‌లో ఎంతో పరిణతి కనిపించింది. రూపంలో గ్లామర్ తక్కువైనా అభినయంతో దాన్ని అధిగమించాడు. ఆ పాత్ర విషయంలో దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకునివుంటే విష్ణు పడిన కష్టానికి ఫలితం వుండేది. దేవుడు లేదా కృష్ణునిగా నాగార్జున చాలా చార్మింగ్‌గా కనిపించారు. అందంగా నవ్వుతూ విష్ణుకి సాయపడే పాత్రలో ఇమిడిపోయారు. సత్య పాత్ర చిత్రణ, ఆ పాత్రలో మమత నటన విస్మరించదగ్గవి. నీచ పాత్ర కావడంవల్ల ఆమె పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడం సహజమే. ఆమె అభినయం కూడా అందుకు తగ్గట్లు వుండడమే శోచనీయం. సంప్రదాయ కుటుంబపు అమ్మాయి తొడలు కనిపించేలా కురుచ దుస్తులు ధరించి కాలేజీకి వెళుతుండడం ఆక్షేపణీయం. పాటల్లోనూ అందాలు ఆరబోసినప్పటికీ అవి ఆస్వాదించే రీతిలో లేవు. నాజర్, తనికెళ్ల భరణి పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రేమ్‌గా నటించిన నూతన నటుడు దేవ్ గిల్లి ఆ పాత్రకి సరిపోలేదు. మనోరమ, ప్రేమ (నాజర్ భార్య) చక్కగా నటించారు. కమెడియన్లు నవ్వించేందుకు కష్టపడ్డారు. బాబాగా మోహన్‌బాబు కూడా ఇందులో కొద్ది నిమిషాలు కనిపించారు.

టెక్నీషియన్ల పనితనం:

కథకుడు, స్క్రీన్‌ప్లే రచయిత కూడా దర్శకుడు వాసే. వీటిలో ఒక్కదానికీ ఆయన న్యాయం చేయలేకపోయాడు. మరుధూరి రాజా సంభాషణలు చాలా సందర్భాల్లో పేలవంగా ఉన్నాయి. సన్నివేశాల తీరుకి తగ్గట్లే అవి వినిపించాయి. కీరవాణి సంగీతం సైతం సినిమాకి బలాన్ని చేకూర్చక పోవడం గమనార్హం. పాటల్లో ఒకటి రెండు మాత్రమే ఫర్వాలేదనిపించాయి. రీ రికార్డింగ్ సోసోగా వుంది. ఓంప్రకాష్ సినిమాటోగ్రఫీ మెచ్చదగ్గది. సన్నివేశాల్లో గాఢత లేకపోయినా వాటిని బాగా తీయడానికి కృషిచేశాడు. స్టన్ శివ కూర్చిన స్టంట్లు మాస్‌ని ఆకట్టుకుంటాయి. కళా దర్శకుడిగా అశోక్ మంచి పనితనం కనపర్చాడు.

బలాలు, లోపాలు:

విష్ణు, నాగార్జునల నటన, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాలు బలాలు. విష్ణు, నాగార్జున మినహా మిగాతా వాళ్ల పాత్రలేవీ ఆకట్టుకోలేక పోవడం, కథనం అనాసక్తంగా వుండడం, కథలో దొర్లిన పొరబాట్లు, అతి సాధారణంగా వున్న సన్నివేశాలు, ఆకట్టుకునే రీతిలో లేని పాటలు లోపాలు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా నిలదొక్కుకునే అవకాశాలు బహు స్వల్పం.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: