హాస్యనటుడిగా తెలుగు చిత్రసీమలో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణభగవాన్ చూపు దర్శకత్వం వైపు మళ్లినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హాస్యనటుల్లో ఇప్పటికే ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ డైరెక్టర్లుగా మారారు. వంశీ రూపొందించిన ‘ఏప్రిల్ 1 విడుదల’లో రౌడీ గోపిగా నెగటివ్ పాత్రని చేసి మెప్పించిన కృష్ణభగవాన్ ఆ తర్వాత కాలంలో హాస్య పాత్రలు చేసి, నటుడిగా నిలదొక్కుకున్నాడు. వంశీ రూపొందించిన పలు చిత్రాల స్క్రిప్టుల్లో పాలు పంచుకున్నాడు. కాగా ఇప్పుడు ఆయన హీరోగానూ మారిన సంగతి తెలిసిందే. మొదట ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంలో శివాజీతో బాటు ఒక కథానాయకునిగా నటించిన ఆయన దర్శకుడు వెంకట్ కూచిపూడి రూపొందిస్తున్న ‘జాన్ అప్పారావ్ 40+’లో సోలో హీరోగా తొలిసారి చేస్తున్నాడు. దాని తర్వాత వంశీ డైరెక్షన్లో ‘కొండబాబు ఐడియా.. మీ జీవితాన్నే మార్చేస్తుంది’ చిత్రంలో హీరోగా నటించనున్నాడు. ఆపైన దర్శకత్వం వహించే ఉద్దేశంలో ఆయనున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టుని కూడా ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం. ఇది వాస్తవరూపం ధరిస్తుందో, లేదో చూడాలి.