Krishna

Rating: 3.50/5

Critic Rating: (3.50/5)

అలరించే కృష్ణుడు

వి.వి. వినాయక్, రవితేజ కాంబినేషన్ లో సినిమా అనగానే కృష్ణ పై అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు, మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కలిసి తొలిసారి పని చేయడంతో ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌కి మంచి ట్రీట్ కాగలదు అని అనుకున్నారు. అయితే మాస్ ని అలరించడంలో  వినాయక్‌ది ఒక స్టైల్, రవితేజది మరొక స్టైల్ కావడంతో ఈ చిత్రంలో ఎవరి డామినేషన్ ఉండనుంది అనే చిన్న ఆసక్తి నెలకొంది. కానీ వినాయక్ తన శైలిని కాస్త మార్చుకుని రవితేజకు అనుగుణంగా పూర్తి స్థాయి వినోద భరిత చిత్రంగా దీనిని మలిచాడు. జనవరి 12న విడుదల అయిన కృష్ణ వివరాలు ఇవి.

కథ:

షిండే (సయాజి షిండే) చెల్లెలు సంధ్యని (త్రిష) పెళ్లి చేసుకోవాలని పంతం పడతాడు జక్కా (ముకుల్ దేవ్) అనే గూండా. జైలులో ఉన్నా కూడా సంధ్యను తన మనుషులతో వెంబడిస్తూ ఉంటాడు. ఆమెను షిండే అనుక్షణం కాపాడుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా విజయవాడలో సంధ్యను చూసి ఆమెను ప్రేమించిన కృష్ణ (రవితేజ) ఆమె కోసం హైదరాబాద్ వచ్చేస్తాడు. అక్కడ షిండే ద్వారా జక్కా గురించి తెలుస్తుంది కృష్ణకి. ఇక అక్కడినుంచి జక్కాను కృష్ణ ఎలా ఆటాడించాడు, చివరకు సంధ్యను ఎలా దక్కించుకున్నాడు అన్నది వెండి తెర మీద చూడాల్సిందే.

కథనం:

సింపుల్ స్టోరీని తీసుకుని దర్శక, రచయితలు దానికి అలరించే కథనం జత చేశారు. విలన్ హీరోయిన్‌పై మనసు పడడం, అతడిని బఫూన్‌ని చేసి హీరో హీరోయిన్ ని గెలుచుకోవడం అనే పాయింట్ ఇప్పటికీ ఎన్నో సార్లు వచ్చింది. అయినా కూడా వినాయక్ దీనిని మరోసారి చూసేలా చేయడంలో విజయం సాధించాడు. ఢీ..దిల్, రణం తరహా వినోదంతో సాగే ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులని అలరిస్తూ సాఫీగా సాగిపోతుంది. సినిమాలో ఒక్క బోరింగ్ మోమెంట్ కూడా లేకపోవడం చూస్తేనే కథనం పై చేసిన కసరత్తు తెలుస్తుంది. చిత్రాన్ని స్టార్ట్ చేయడమే కామెడీ పంచులతో మొదలు పెట్టిన దర్శకుడు ఆ ఫ్లో చివరి వరకు కొనసాగిస్తూ పోయాడు. సెపరేట్ కామెడీ ట్రాక్స్ లేకుండా కథలోనే కామెడీ జత చేసి చిత్రీకరించిన విధానం బాగుంది. మధ్య మధ్యలో వినాయక్ మార్కు యాక్షన్ దృశ్ల్యాలు ఉండనే ఉన్నాయి. సుమోలు, స్కార్పియోలతో వినాయక్ తనదయిన శైలిలో మాస్ ఎలిమెంట్స్ పండించాడు. గాల్లోకి సుమోలు లేచిపోవడం పాతదయిపోయినా మరోసారి ప్రతిభావంతంగా దానిని మెప్పించేలా చిత్రీకరించాడు. చిన్న వాహనాలతో సరిపెట్టకుండా ఈసారి లారీలు కూడా గాల్లోకి లేపాడు. మొత్తంమీద అనవసరమయిన సన్నివేశాలు లేకుండా, కథ ఎక్కడా డ్రాగ్ కాకుండా చూసుకుని పండగ సీజన్లో పర్‌ఫెక్ట్ సినిమాగా కృష్ణను మలిచారు.

పాత్రధారుల అభినయం:

రవితేజ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. రవితేజ కోసం తైలార్ మెడ్ అన్నట్టు సాగిన కృష్ణ పాత్రలో అతను విశేషంగా రాణించాడు. మంచి టైమింగ్‌తో డైలాగ్స్ చెప్తూ అతను చేసిన కామెడీ చాలా బాగుంది. రవితేజ తర్వాత ఈ చిత్రానికి హీరో బ్రహ్మానందం అని చెప్పాలి. బాబీ పాత్రలో బ్రహ్మానందం అభినయం, హాస్యం పండించిన తీరు ఆయన కామెడీ కింగ్ ఎందుకు అయ్యారో మరో సారి చాటాయి. రవితేజ, బ్రహ్మానందం మధ్య సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. త్రిష ఈ చిత్రంలో ఫోకల్ పాయింట్. ఆమె చుట్టూ అన్ని పాత్రలూ పరిభ్రమిస్తాయి. అవకాశమున్న చోట బాగా నటించింది. పాటల్లో గ్లామరస్‌గా కనిపించి మురిపించింది. కొత్త విలన్ ముకుల్ దేవ్ పర్వాలేదనిపించాడు. అతని అనుచరుడిగా జయ ప్రకాష్ రెడ్డి ఆకట్టుకున్నారు. వేణు మాధవ్, సునీల్ తమ పాత్రల పరిధిలో వినోదం పండించారు. ఢీచిత్రంలో చేసిన పాత్రను పోలిన పాత్ర చంద్రమోహన్ పోషించారు. ఆయన నటన కూడా బాగుంది. సయాజి షిండే పాత్ర ఓకే అనిపిస్తుంది.

సాంకేతిక నిపుణుల పనితనం:
చోటా కె. నాయుడు ఫోటోగ్రఫీ చిత్రానికి వన్నె తెచ్చింది. తరత్తా ఎత్తుకుపోతా, నీ సోకు మాడా పాటల్లో కెమెరా డిపార్ట్‌మెంట్ బాగా స్కోర్ చేసింది. చక్రి పాటలు ఏమంత బాలేదు కానీ ఓకే అనిపించాయి. మరింత మంచి పాటలు ఉండి ఉంటే సినిమా రేంజ్ పెరిగేది. అదర కొట్టు… పాటను తమిళ గిల్లీ లోని అపోడి పోడి పోడి నుంచి డైరెక్ట్ లిఫ్ట్ చేశారు. ఆకుల శివ సంభాషణలు చిన్న చిన్న చమక్కులతో నవ్వులు పూయించాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది. ఫైట్స్ లో రోప్ వర్క్ ఎక్కువే ఉన్నా కూడా ఆకట్టుకున్నాయి.

బలాలు, బలహీనతలు:

కథలో కొంచెం కూడా కొత్తదనం లేకపోవడం, సంగీతం ప్రధాన బలహీనతలు. అయితే కామెడీ, సాఫీగా సాగిపోయే స్క్రీన్‌ప్లే పెద్ద బలాలు. ఈ బలాలు బలహీనతలను కూడా కవర్ చేసేశాయి. సంక్రాంతి సమయంలో మంచి వినోదభరిత చిత్రం చూడాలని కోరుకునే వారికి చక్కని చాయిస్ కృష్ణ. టాక్ ఇప్పటికే పాజిటివ్‌గా వినిపిస్తోంది కనుక ఈ ఏడాదికి తొలి విజయంగా ఇది నిలిచే అవకాశాలు బాగా ఉన్నాయి.

 

-శ్రీనిధి

 

Give your rating:

We would like to hear your comments below: