Kantri

Rating: 2.25/5

Critic Rating: (2.25/5)

బోర్ ‘భజంత్రి’

కన్నడంలో రెండు సినిమాలు డైరెక్ట్ చేసి విజయం సాధించిన మెహర్ రమేష్ తెలుగులో తొలిసారి డైరెక్ట్ చేస్తున్నాడంటే, అదీ ఎన్టీఆర్ వంటి క్రేజీ హీరోని అంటే.. తప్పకుండా అది చూడచక్కగా ఉంటుందనే అభిప్రాయం కలిగింది. పైగా అతడు పూరీ జగన్నాథ్‌కి ప్రియ శిష్యుడాయె. 33 యేళ్ల క్రితం మహానటుడు దివంగత ఎన్టీ రామారావు సినిమా ‘ఎదురులేని మనిషి’ని నిర్మించడం ద్వారా నిర్మాతగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన చలసాని అశ్వనీదత్ ఇప్పుడు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్‌తోనూ సినిమా తీయడం విశేషమే. ఇంతకాలం నిర్మాతగా సినీ రంగంలో.. అదీ అగ్రశ్రేణి నిర్మాతగా కొనసాగడం చిన్న విషయం కాదు. అయితే సీనియర్ ఎన్టీఆర్‌తో నిర్మించిన తొలి సినిమాతో విజయాన్ని సాధించిన ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో నిర్మించిన తొలి సినిమా ‘కంత్రి’తోనూ అలాంటి విజయాన్ని సాధించనున్నారా? వాస్తవ స్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తుండటం కాస్త విచారకరమే. మెహర్ రమేష్ ఎంచుకున్న కథ, ఆ కథకి అతనిచ్చిన ట్రీట్‌మెంట్ ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే 9న ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కంత్రి’ కథ, కథనాల విశ్లేషణలోకి వెళితే..

కథ:

క్రాంతి (ఎన్టీఆర్) అనాథ కుర్రాడు. చాలామందికి అతని పేరు ‘కంత్రి’లా వినిపిస్తుంటుంది. దొంగనోట్ల వ్యాపారంతో వెయ్యి కోట్లను ఆర్జించిన పిఆర్ (ప్రకాష్‌రాజ్) ముఠాలో చేరతాడు. పిఆర్ హాంగ్‌కాంగ్ నుంచే తన కార్య కలాపాలు సాగిస్తుంటే అతని పార్ట్‌నర్ శేషు (ఆశిష్ విద్యార్థి) హైదరాబాద్ వ్యవహారాలు చూస్తుంటాడు. వాళ్లకి ప్రత్యర్థి దాసు (సాయాజీ షిండే). చెప్పిన పనినే గాక, చెప్పని పని కూడా చేసే క్రాంతి దుడుకుతనం పిఆర్‌కి నచ్చుతుంది. ఒక కారణంతో పిఆర్ ముఠానుంచి బయటకొచ్చి సొంతంగా ముఠాని పెడతాడు క్రాంతి. పిఆర్‌ని చంపడానికి దాసు నుంచి కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాడు. ఈ సంగతి నేరుగా పిఆర్‌కే చెబుతాడు. ఈ మధ్యలో వరలక్ష్మి (హన్సిక) అనే చక్కని చుక్క ప్రేమలో పడతాడు. పిఆర్ హాంకాంగ్ నుంచి వస్తాడు. అనాథ శరణాలయం ‘ప్రేమాలయం’ వద్ద పిఆర్, క్రాంతి ఒకరిపై ఒకరు రివాల్వర్లు గురిపెట్టుకుంటే అనాథాశ్రమ నిర్వాహకుడైన ఫాదర్ దేవసహాయం (కోట) ఆ ఇద్దరూ తండ్రీకొడుకులనే రహస్యాన్ని బయటపెడతాడు. దానికి సాక్ష్యాలు చూపిస్తాడు. క్రాంతి తండ్రిని అసహ్యించుకుంటాడు. తల్లి చావుకి కారణమైన అతడి చావును కోరుకుంటున్నానని చెబుతాడు. కానీ పిఆర్‌లో పుత్రప్రేమ కలుగుతుంది. ఈ సంగతి తెలిసి పిఆర్‌ని చంపడానికి యత్నిస్తాడు దాసు. తండ్రిని కాపాడతాడు క్రాంతి. తండ్రీకొడుకులు ఒకటవుతారు. ఆ సమయంలోనే న్యూయార్క్‌లో ఉండే శేషు కూతురు ప్రియ (తనీషా) తల్లితో కలిసి తండ్రి వద్దకు వస్తుంది. క్రాంతి, ప్రియల పెళ్లిచేసి వియ్యంకులు కావాలనుకుంటారు పిఆర్, శేషు. కానీ తనకి వరలక్ష్మే కావాలంటాడు క్రాంతి. పిఆర్, శేషు మధ్య గొడవ జరిగి ఇద్దరూ విడిపోతారు. దాసు, శేషు ఒక్కటవుతారు. పిఆర్ ఒంటరి అవుతాడు. ఆ సమయంలో పిఆర్‌కి విభ్రాంతికరమైన నిజం తెలుస్తుంది. ఏమిటా నిజం? అసలు క్రాంతి లక్ష్యం ఏమిటి? అతని జీవితంలోని విషాదమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:

కథలోనే తేడా ఉందనుకుంటే, దర్శకుడు దానికిచ్చిన ట్రీట్‌మెంట్ మరింత తేడాగా ఉంది. కథని ఎలా నడపాలనే విషయంలో మెహర్ రమేష్‌లోని దర్శకుడు పూర్తి గందరగోళానికి గురయ్యాడు. ఎన్టీఆర్, హాన్సిక జంటగా నటించిన సినిమా చాలామంది దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రేక్షకుల్ని తృప్తి పరచడానికి తగినన్ని ఆకర్షణలు సినిమాలో లేవు. అలా అని ఆ జంట ఆకర్షణీయంగా లేకపోలేదు. ఎన్టీఆర్ చక్కగా నటించాడు. అయితే అతని నటన రాణించడానికి తగ్గ కథ ‘కంత్రి’లో లేదు. అతని పాత్రదీ అదే స్థితి. కథ మొత్తం అసహజమైన సన్నివేశాలతో, అసందర్భమైన మలుపులతో నిండి, ప్రేక్షకుల తలల్ని మండిస్తుంది. ఈ సినిమా కథకి కీలకం ప్రకాష్‌రాజ్ పోషించిన పిఆర్ పాత్ర. పిఆర్ అంటే పోతురాజు. సినిమా ఎత్తుగడలోనే పోతురాజు ఎంతటి దుర్మార్గుడో దర్శకుడు చూపించాడు. నమ్మక ద్రోహంతో కోటి రూపాయల కోసం తనకు ఆశ్రయమిచ్చిన కుటుంబాన్ని నాశనం చేసి, హాంకాంగ్‌కు పోయి పిఆర్‌గా అవతారమెత్తాడు పోతురాజు. అంటే ప్రేక్షకుల్లో అతడి మీద చివరిదాకా వుండాల్సింది ద్వేషభావమే. కానీ దర్శకుడేం చేశాడు? చిన్నతనంలోనే విడిపోయిన తండ్రీకొడుకులు ఏకమయినట్లు చూపించాడు. పిఆర్‌లో పుత్రప్రేమని రగిలించాడు. అతడి తలకి దెబ్బ తగిలినట్లు, ఉద్రేకపడినప్పుడల్లా స్పృహ తప్పిపోతున్నట్లూ చూపించాడు. కొడుకే అతడికి ప్రధానమైనట్లు చిత్రించాడు. దాంతో అతడిమీద అప్పటిదాకా ప్రేక్షకుడికున్న ద్వేషభావం స్థానంలో సానుభూతి మొదలయ్యింది. ఆ సానుభూతి కొనసాగుతున్నంతలో కథలో అనుకోని ట్విస్ట్. ఆ మలుపు చాలా కీలకమైంది. ఆ మలుపుతో ప్రేక్షకుడిలో మళ్లీ పిఆర్ మీద ద్వేష భావం కలుగుతుంది. ఇది ట్రీట్‌మెంట్ పరంగా దర్శకుడు చేసిన అతిపెద్ద తప్పు. ప్రేక్షకుల భావోద్వేగాలతోటే అతడు ఆడుకోవాలనుకున్నాడు. పైగా టాప్ హీరోల సినిమాలకు ఎండ్ సస్పెన్స్ అనేది ఆత్మహత్యాసదృశం. అంతదాకా తాము చూసింది వాస్తవం కాదు, హీరో ఆడిన నాటకం.. అనే సంగతి చివరిలో తెలియడం ప్రేక్షకుల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. "ఇంతదాకా నువ్వు చూసిందంతా మాయ. ‘ప్రేమాలయం’ (అనాథాశ్రమం) మాయ. ఈ అనాథలు మాయ. అమ్మ సమాధి మాయ. నీ తలలో రక్తం గడ్డ కట్టడం మాయ" అని ఎన్టీఆర్ కథలో భాగంగా చెప్పినప్పటికీ ఆ డైలాగులు ప్రేక్షకులకి బాగా వర్తిస్తాయి. క్రాంతి పాత్ర కేవలం పిఆర్‌ని మాత్రమే కాదు.. ప్రేక్షకుల్నీ మోసం చేసింది. అంతదాకా తాము చూసిందంతా ‘ఉత్త బుస’ అని తెలిశాక ప్రేక్షకుడు ‘కంత్రి’ని ఎట్లా ప్రేమించగలడు? అతడి పగని తమ పగగా ఎట్లా సొంతం చేసుకోగలరు? అందుకే క్రాంతి ప్రేక్షకుల మద్దతుని పొందలేకపోయాడు. ‘పోకిరి’ ఎక్కడ సఫలమయ్యాడో, ‘కంత్రి’ అక్కడ విఫలమయ్యాడు. అందులో ‘అండర్ కవర్’లో వున్న పోలీసాఫీసర్ కృష్ణమనోహర్ (మహేష్‌బాబు) ఎవరో ఇంటర్వెల్ సమయానికి రివీలై, సస్పెన్స్ విడిపోతుంది. అక్కడినుంచి మాఫియా డాన్ అలీభాయ్ (ప్రకాష్‌రాజ్)ని కృష్ణమనోహర్ ఎలా నేరుగా ఎదుర్కొని, అంతంచేశాడనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠతని కలిగించింది. ‘పోకిరి’ సినిమానంతా నిలబెట్టింది ఆ ఇంటర్వెల్ మలుపే. ‘కంత్రి’లో వచ్చిన మొదటి మలుపు పిఆర్, క్రాంతి తండ్రీకొడుకులన్నది. అది ఇంటర్వెల్ బ్యాంగ్‌గా పెట్టుకున్నాడు దర్శకుడు. కానీ అక్కడి నుంచి చివరిలో వచ్చే మరో మలుపు దాకా నడించిన కథ, సన్నివేశాలు ఉత్త హంబగ్ అని స్వయంగా కథానాయకుడి చేతే చెప్పించి దర్శకుడు తన సినిమాని తనే చంపేసుకున్నాడు. ఈ సినిమాని కాస్తయినా ఆకర్షవంతం చేయాలంటే దర్శకుడు మధ్యలోనే అసలు నిజాన్ని ప్రేక్షకులకి తెలిసేట్లు చేసి, కథానాయకుడు తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడో చూపించాల్సింది. అప్పుడు హీరో, విలన్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగడానికి ఆస్కారం ఉండేది. అది మానేసి ఒకరికి నలుగురు విలన్లని తయారుచేసి, ఎండ్ సస్పెన్స్ పెట్టి కథని ఇష్టంవచ్చినట్లు నడపడంతో అది అడ్డదిడ్డంగా పడుతూ, లేస్తూ, కుంటుతూ సాగింది. రమేష్‌కి కొన్ని విషయాల్లో ఏమాత్రం అవగాహన లేదనిపిస్తుంది. దొంగనోట్లని వందలాది అట్టపెట్టెల్లో ప్యాక్‌చేసి, పబ్లిక్‌గా ట్రాలీలో ట్రాన్స్‌పోర్ట్ చేయడం ఈ సినిమాలోనే చూడగలం.  

పాత్రధారుల అభినయం:

పాత్ర తీరుతెన్నుల్ని పక్కనపెడితే క్రాంతిగా ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. సన్నటి రూపం, చక్కని వాచకంతో మెప్పించాడు. పాటల్లో డాన్సులతో చెలరేగిపోయాడు. అతని స్టెప్పులు అభిమానుల్ని సంతృప్తి పరుస్తాయి. ఫైట్లలోనూ వీరోచిత నటనతో అలరించాడు. అయితే అవి మరీ సుదీర్ఘంగా సాగి కాస్త ఇబ్బందిపెట్టాయి. ఇంట్రడక్షన్ సీన్‌లో ‘సైకిలు’ మీద వచ్చి సైకిలు గురించి గొప్పలు చెప్పడం, ‘ఈ దేశంలో బంధుత్వం లేకపోయినా అన్న అని పిలుపించుకున్నది ఒక్కరే. ఆయన పైకెళ్లిపోయారు. మళ్లీ ఇంతదాకా అలా పిలిపించుకోగలిగిన వాళ్లు పుట్టలేదు’ అనే డైలాగూ ఉద్దేశపూర్వకమైనవే. అలాంటి సన్నివేశాలు కేవలం అతని అభిమానుల్ని ఆనంద పరుస్తాయేమోగానీ, సగటు సినీ ప్రేమికుణ్ణి మెప్పించలేవు. ఎన్టీఆర్ చేయాల్సిందల్లా నేలవిడిచి సాము చేసే కథలు కాకుండా, నేలమీద సంచరించే మనుషుల కథల్ని ఎంచుకోవడం. వరలక్ష్మి పాత్రలో హన్సిక చేయగలిగింది ఏమీలేకపోయింది. ప్రధాన కథకి ఆమె పాత్ర ఉపకరించింది బహు స్వల్పం. కేవలం ‘అందాల బొమ్మ’గా మాత్రమే ఆమె కనిపించింది. కథని నడిపించిన పిఆర్ పాత్రలో ప్రకాష్‌రాజ్ నటన గురించి చెప్పడానికేముంటుంది? అయితే అలాంటి నటుణ్ణి కూడా ఎలా బఫూన్‌గా మార్చవచ్చో దర్శకుడు చేసి చూపించాడు. ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, మురళీశర్మ విలన్లుగా పరిధుల మేరకు చేశారు. కాకపోతే షిండే సొంతగొంతు ఈ సినిమాలో కాస్త ఇరిటేట్ చేస్తుంది. సుబ్బరాజు మెప్పించాడు. ప్రియగా సెకండ్ హీరోయిన్ పాత్రలో తనీషా అందాలు ఆరబోసింది. రజనీ హాసన్‌గా సునీల్, లీ పాత్రలో అలీ నవ్వించారు. 

టెక్నీషియన్ల పనితనం:

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేలతో బాటు మాటల బాధ్యతని కూడా దర్శకుడు మెహర్ రమేష్ తీసుకున్నాడు. అక్కడక్కడా తప్ప సంభాషణల్లో మెరుపులు కనిపించింది తక్కువ. లొకేషన్లూ, సెట్టింగులూ బాగున్నాయి. మణిశర్మ సంగీతం, రీ రికార్డింగ్ బాగున్నాయి. పాటలను చిత్రీకరించిన తీరు బాగుంది. సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ కొన్ని సందర్భాల్లో చాలా బాగున్నట్లు కనిపించింది. కొన్నిచోట్ల సన్నివేశానికి తగ్గట్లు లైటింగ్ మ్యాచ్ కాలేదు. సెకండాఫ్‌లో ఎడిటింగ్ ఏమాత్రం సమతూకంగా లేదు. అనేకచోట్ల ‘జెర్కులు’ ఉన్నాయి. స్టన్ శివ కూర్చిన ఫైట్లు మాస్ ప్రేక్షకుల్ని తృప్తి పరుస్తాయి. కానీ అతి అయితే వెగటు కొడుతుందన్నట్లు ఫైట్ల సంఖ్య మితిమీరడం చికాకు వ్యవహారం.

బలాలు, లోపాలు:

ఎన్టీఆర్ నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ, కొద్దిపాటి హాస్యం బలాలు. పాత కథ, చికాకు పుట్టించే కథనం, ఆకట్టుకోని మలుపులు, ప్రధానమైన ఎన్టీఆర్, ప్రకాష్‌రాజ్ పాత్రల చిత్రణలో దొర్లిన లోపాలు, క్రిస్ప్‌గా లేని ఎడిటింగ్ లోపాలు. ప్రథమార్ధం ఓ మోస్తరుగా ఉన్నా, ద్వితీయార్ధం దారీ తెన్నూ లేకుండా సాగిన కథ కారణంగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు బహు స్వల్పం. ‘యమదొంగ’తో అందర్నీ వినోదపరిచిన ఎన్టీఆర్ ఈ సినిమాతో బాగా నిరాశపరిచాడు. 

…యజ్ఞమూర్తి

Give your rating:

We would like to hear your comments below: