Kalidasu

Rating: 2.25/5

Critic Rating: (2.25/5)

దారి తప్పిన ‘కాళిదాసు’

ఏఎన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు సుశాంత్ ‘కాళిదాసు’గా ఏర్పిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాధారణంగా తొలి సినిమాకు హీరోలంతా ప్రేమకథను ఎంచుకుంటారు. అందుకు భిన్నంగా సుశాంత్ ఒక మాస్ మసాలా, ప్రతీకార కథను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుశాంత్ సరసన ‘హ్యాపీడేస్’తో యువతరాన్ని ఆకట్టుకున్న తమన్నా హీరోయిన్‌గా నటించింది. ప్రియదర్శన్ వద్దా, సూపర్‌గుడ్ ఫిలిమ్స్‌లోనూ పనిచేసిన జి. రవిచరణ్‌రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేలను నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు అందించారు. మాస్ సినిమాకు అవసరమైన అన్నిరకాల అంశాలూ ఇందులో వున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ వుంది. సెంటిమెంట్ వుంది. ఫైట్స్ వున్నాయి. డాన్సులున్నాయి. ప్రేమ వుంది. స్నేహానుబంధం వుంది. ప్రతీకారం కూడా వుంది. అయినా సమ్‌థింగ్ మిస్సింగ్ ఇన్ ద మూవీ.
కథ:

కాళిదాసు (సుశాంత్) పసివాడిగా ఉన్నప్పుడే తల్లి చనిపోతుంది. పదేళ్ళ వయసప్పుడు అతని తండ్రి అయిన పోలీస్ కమీషనర్ (నాగబాబు)ను రాయలసీమ ఫ్యాక్షనిస్టులు దారుణంగా చంపుతారు. అదిచూసి కోపావేశంతో ఆ ఫ్యాక్షనిస్టుని నరికి చంపుతాడు కాళిదాసు. అతని మనుషులు వెంటపడేసరికి రైలెక్కి గుంటూరుకు పారిపోతాడు. కనకదుర్గ (జయసుధ) అనే వితంతువు అన్నంపెట్టి ఆదుకునేసరికి ఆమెకు అండగా మారతాడు. ఆమె కొడుకు దేవ్ (అభిషేక్)ని చదివించడం కోసం కార్ల దొంగగా మారతాడు. మాయా కాలనీలో ప్రాపకం సంపాదించి అక్కడే పెరుగుతాడు. దేవ్‌ని హైదరాబాద్‌లో చదువుకోసం పంపిస్తాడు. మాయా కాలనీలోని బాషా (సునీల్), మరికొందరు దాసుకు స్నేహితులవుతారు. ఒకసారి హైదరాబాదు కెళ్లి అక్కడనుంచి అతను దొంగిలించిన తెచ్చిన కారు డిక్కీలోంచి ఒక అందమైన అమ్మాయి (తమన్నా) దిగుతుంది. ఆమె పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నా దాసుకు మాత్రం ఆమె అలా నటిస్తున్నదని అనుమానం. ఆమె కోసం హైదరాబాదులో ‘అర్చనా.. అర్చనా’ అంటూ అజయ్ (అజయ్) అనే గూండా కలవరిస్తుంటాడు. అతను ప్రతాప్ (వినోద్ కుమార్) అనే మరో గూండా ఉంపుడుగత్తె (సురేఖా వాణి) తమ్ముడు. ఈ ప్రతాప్ హోమ్‌మంత్రి గరుడాచలం (రాజన్ పి. దేవ్) కుడి భుజం. అర్చన చేసిన ఒక ఫోన్‌తో ఆమె ఎక్కడవుందో తెలుసుకున్న అజయ్, ప్రతాప్‌లు మాయా కాలనీకి వచ్చి, విధ్వంసం సృష్టించి అడ్డుకున్న బాషాను దారుణంగా చంపేసి, అర్చనను బలవంతంగా తీసుకుపోతారు. దాంతో బాషా హంతకుల అంతు చూసేందుకు హైదరాబాదుకు వెళ్లిన కాళిదాసుకు మరో భయంకర నిజయం తెలుస్తుంది. తన ప్రాణ సమానుడైన దేవ్‌ను సైతం అదే గూండాలు చంపేశారనేది ఆ నిజం. దాంతో ఆ దుర్మార్గుల అంతుచూసి, తనను ప్రేమించిన అర్చనను దాసు ఎలా చేపట్టాడనేది మిగతా కథ.

కథనం:

తొలి సినిమాకే ఈ తరహా మాస్ కథ ఎంచుకుని సుశాంత్ పెద్ద సాహసం చేశాడు. ఇలాంటి కథలు ప్రేక్షకుల్లో ఇప్పటికే గుర్తింపు వున్న హీరోలకి నప్పుతాయి కానీ కొత్త హీరోకి కాదు. అందుకే సుశాంత్ చేసింది దుస్సాహసం. దర్శకుడు రవిచరణ్‌రెడ్డి ప్రథమార్ధాన్ని ఆసక్తికరంగా తీయగలిగినట్లు ద్వితీయార్ధాన్ని తీయలేకపోయాడు. తొలిసగం ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడంతో అది ఆహ్లాదంగానే సాగింది. చిక్కంతా రెండో సగంతోటే వచ్చింది. అది నడుస్తూ….నే వుండటంతో ప్రేక్షకులు పదే పదే కుర్చీల్లో అసహనంగా కదలడమే కనిపిస్తుంది. బాషా చావు తర్వాత విలన్ బృందాన్ని అంతం చేయడానికని కాళిదాసు హైదరాబాద్ వచ్చాక కథని అనవసరంగా పొడిగించుకుంటూ పోయారు. దేవ్ చావును కథకి ఒక ట్విస్టులా ఉపయోగించుకోవాలనుకున్నా అది సరిగా పండక కథనం పేలవంగా తయారయ్యింది. దేవ్ ఎపిసోడ్ కథకి ఉపకరించింది లేదు. పోలీస్ లాకప్‌లో ఉన్న కాళిదాసుని అర్చన, కాలేజీ ప్రిన్సిపాల్ (తనికెళ్ల భరణి) దేవ్ పేరుతో బయటకు తీసుకురావడమేమిటో, ‘నేనిప్పుడు కాళిదాసును కాను దేవ్‌ని, జయదేవ్‌ని’ అని దాసు డైలాగులు చెప్పడమేమిటో అంతుపట్టదు. కథకి అదవసరమా? దీనివల్ల కాళిదాసు పాత్ర చిత్రణ గందరగోళంగా తయారయ్యింది. ఏదో ఒక అంశం మీద శ్రద్ధపెట్టి ఆ అంశం మీదుగా కథని నడిపించినట్లయితే కథనంలో క్లారిటీ ఉండేది. ఒక వైపు బాషా చావుకు ప్రతీకారం, మరోవైపు దేవ్ ఆశయాన్ని సాధించడం, ఇంకోవైపు అర్చనను కాపాడటం.. కథలో ఇన్ని అంశాలు తలకెత్తుకోవడంతో దర్శకుడు దేనికీ న్యాయం చేకూర్చలేక పోయాడు. తొలి సినిమాతోటే సుశాంత్‌ను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలనే తాపత్రయం వల్లే కథ, కథనాలు దారి తప్పాయి. హీరో పాత్రతో పోలిస్తే విలన్ పాత్రలే అర్ధవంతంగా ఉన్నాయి. అజయ్‌కి అర్చనను దక్కించుకోవడం ముఖ్యం. ప్రతాప్‌కి పొలిటికల్ కెరీర్ మీదే దృష్టి. హోమ్‌మంత్రికి అర్చన కాలేజీకి చెందిన 500 కోట్ల రూపాయల విలువచేసే భూమిమీదే ధ్యాస. వాళ్ల పాత్రల విషయంలో క్లారిటీ చూపిన కథకుడు, దర్శకుడు హీరో పాత్ర విషయంలోనే కంగారుకి గురయ్యారు. కామెడీ విషయానికొచ్చినా సునీల్ మీద వర్కవుట్ అయినా కామెడీ ఎమ్మెస్ నారాయణ మీద కాలేదు. ఎమ్మెస్ నారాయణ ఆసుపత్రి ఎపిసోడ్ నేటి కార్పొరేట్ ఆసుపత్రుల తీరుని తెలియజేసింది గానీ హాస్యానికి పనికిరాలేదు.
నటీనటుల అభినయం:

తన పరిధికి మించిన పాత్రని సుశాంత్ మోయలేకపోయాడు. అతడి నటనా సామర్థ్యం కంటే అతడి పాత్రలోని పగ, సెంటిమెంట్ బరువే ఎక్కువ. ఈ సినిమాతో సుశాంత్ సాధించింది.. డాన్సులు, ఫైట్లు బాగా చేశాడని. అంతే. అంతకు మించి నటుడిగా అతడు చాలా ఎదగాలి. ఒకటి రెండని కాదు.. చాలా సందర్భాల్లో అతడి హావభావాలు మరీ అమెచ్యూరిష్‌గా వున్నాయి. దానితోడు హావభావాలు ప్రదర్శించాల్సిన సమయంలోనే కెమెరా అతణ్ణి క్లోజప్‌లో చూపించడం వల్ల సుశాంత్ అపరిపక్వ నటన మరింతగా బయటపడింది. తొలి అర్ధభాగంలో నటించేందుకు అవకాశమొచ్చిన తమన్నాకు ద్వితీయార్ధంలో ఆ అవకాశం చాలా తక్కువగా లభించింది. అయినా దాసు వద్ద ఆమె పిచ్చిదానిలా నటించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాసు గురించి అప్పటికే ఆమె వినివుంది. అతడిని చూడకుండానే ఆరాధిస్తూ వుంది. కానీ తన సెల్‌ఫోన్‌లో దేవ్‌తో కలిసివున్న తన ఇమేజ్‌ని వాల్‌పేపర్‌గా పెట్టుకోవాల్సిన అవసరం అర్చనకేముంది? అనే సందేహానికి సమాధానం దొరకదు. పాటల్లో మాత్రం తమన్నా గ్లామర్‌గా కనిపించింది. కానీ ‘హ్యాపీడేస్’ సినిమాలో మధు పాత్రని చూసిన కళ్లతో తమన్నాను అర్చన పాత్రలో చూడటం కాస్త ఇబ్బందికరమే. విలన్ పాత్రల్లో అజయ్, వినోద్‌కుమార్, రాజన్ పి. దేవ్ రాణించారు. అయితే అజయ్, వినోద్ పాత్రలకి ముంగింపునిచ్చిన దర్శకుడు రాజన్ పాత్రని మాత్రం గాలికొదిలేశాడు. సునీల్ మరోసారి తన నటనతో నవ్వించి ఆకట్టుకుంటాడు. జయసుధ, తనికెళ్ల భరణి, అభిషేక్, సురేఖావాణి వంటివాళ్లు పరిధుల మేరకు నటించారు.

టెక్నీషియన్ల పనితనం:

సినిమాలో ఆకట్టుకునే సాంకేతిక అంశాల్లో అఖిలన్ సినిమాటోగ్రఫీ, కణల్‌కన్నన్ థ్రిల్స్, చక్రి మ్యూజిక్ ఉంటాయి. సుశాంత్ హావభావాల్ని క్లోజప్‌లో చూపించిన సందర్భాల్ని వదిలేస్తే మిగతా అన్ని చోట్లా ఆయన కెమెరా చాలా చురుగ్గా పనిచేసింది. పాటల్నీ, ఫైట్లనీ బాగా కాప్చర్ చేసింది. అందుకే వాటిలో సుశాంత్ మెప్పించగలిగాడు. చక్రి మరోసారి హిట్ ట్యూన్లని అందించ గలిగాడు. కనీసం మూడు పాటలైనా హమ్ చేసుకునే రీతిలో వున్నాయి. వాటి చిత్రీకరణా అందంగా వుంది. నిఖిత ఐటమ్ సాంగ్ బాగా వచ్చింది. మాస్ హీరోగా సుశాంత్‌ని నిలబెట్టాలనుకున్న ఫైట్లు కూడా ఎఫెక్టివ్‌గా వచ్చాయి. అవి మాస్‌ని అలరిస్తాయి. ఇటీవలి కాలంలో సీనియర్ ఎడిటర్ గౌతంరాజు కత్తెర చురుగా పనిచేయడం లేదు. ఆయన ఎడిటింగ్ అసంతృప్తిని కలిగిస్తోంది. ‘కాళిదాసు’ ద్వితీయార్ధం బాగా బోర్ అనిపించడానికి ఆయన కత్తెర సరిగా పనిచేయక పోవడం ఒక కారణం.
బలాలు, లోపాలు:

ఏఎన్నార్ కుటుంబ వారసుడిగా సుశాంత్ అరంగేట్రం, తొలి అర్ధభాగంలోని ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాటోగ్రఫీ, సంగీతం, యాక్షన్ ఎపిసోడ్లు బలాలు. సుశాంత్‌కు నప్పని మాస్ కథ, విసుగెత్తించే సెకండాఫ్, దారితప్పిన కథనం, ఆకర్షణీయంగాలేని హీరోయిన్ పాత్ర లోపాలు. మొత్తంగా ఈ సినిమా సగటు ప్రేక్షకుణ్ణి అసంతృప్తికి గురిచేస్తుంది.

…యజ్ఞమూర్తి

Give your rating:

We would like to hear your comments below: