John Apparao 40+

Rating: 1.75/5

Critic Rating: (1.75/5)

‘జాన్ అప్పారావ్’కి ఎన్నో మైనస్‌లు! 

ముందు మనం ఒక విషయంలో కాస్త గుండె దిటవు చేసుకోవాలి. కృష్ణ భగవాన్ హీరో అంటే అది కామెడీ సినిమాయే అయి వుండనవసరంలేదనీ, అది క్రైమ్ సినిమా కూడా అయి వుండవచ్చనీ ఊహించుకోవాలి. లేదంటే నవ్వడానికి వెళ్లి, కుర్చీల్లో భయపడుతూ కూర్చోవాల్సి వస్తుంది. ఎన్నడో ‘ఏప్రిల్ 1 విడుదల’లో కత్తి గోపి పాత్రలో విలన్‌గా కృష్ణ భగవాన్‌ని మనం చూశాం. అప్పుడు మనకు అతనెవరో తెలీదు కాబట్టి, అందులో హీరో రాజేంద్రప్రసాద్ కాబట్టి ఆ సినిమాను ఆస్వాదించాం. ఆ సినిమాలోనూ క్రైమ్ ఎలిమెంట్ వుంది. అయినా హాయిగా నవ్వుకున్నాం. కానీ ‘జాన్ అప్పారావ్ 40+’లో ‘ఎ న్యూ బ్రాండ్ ఆఫ్ కామెడీ’ (ప్రమోషన్‌లో చెప్పింది అదే) వుంటుందని వెళ్లిన వాళ్లు మాత్రం హతాశులవక తప్పదు. కామెడీ ఇలాకూడా వుంటుందని మనకు జాన్ అప్పారావ్ బాగా చెప్పాడు. దర్శకుడు కూచిపూడి వెంకట్ ‘మొదటి సినిమా’ తీస్తే అది అతనికి మొదటి సినిమాయే కదా అని సర్దుకు పోయాం. కానీ ‘జాన్ అప్పారావ్ 40+’ చూశాక దీనికి టైటిల్ ‘చివరి సినిమా’ అని పెడితే బాగుండేదోమోనని కొంతమందికైనా అనిపించక మానదు. సిమ్రాన్, కృష్ణ భగవాన్ వంటి అరుదైన కాంబినేషన్‌తో మార్చి 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిజానికి టెర్రరిస్టుల సినిమా. ఆ.. అని నోరెళ్లబెట్టకండి. నోట్లో బాంబు పేలినా పేలవచ్చు.  

కథ:

అప్పారావ్ (కృష్ణ భగవాన్) 40 యేళ్లు పైబడిన ఫ్యాషన్ డిజైనర్. ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేయడంలో అతనికి వయసు మీరిపోతుంది. దాంతో అతని ఇద్దరు అసిస్టెంట్లు అతనికి పెళ్లి చేయడానికి కష్ట పడుతుంటారు. రుద్రరాజు అలియాస్ దురద రాజు (జీవా), మాణిక్యరావు అలియాస్ తరుణ్ (మేల్కోటే) అతనికి సంబంధాలు చూస్తుంటారు. కానీ ఏదీ వర్కవుట్ కాదు. ఒకానొక రోజు ఒక అపరిచితుడు కనిపించి నవంబర్ 22న ఒక అందమైన స్త్రీ అతని జీవితంలో ప్రవేశిస్తుందనీ, దాంతో అతని జీవితమే మారిపోతుందనీ చెబుతాడు. అతగాడు చెప్పినట్లే ఆ రోజు లండన్ నుంచి వచ్చిన ప్రవల్లిక (సిమ్రాన్) అనే 30+ యువతి అతనికి పరిచయమవుతుంది. తనకోసం ఒక కాస్ట్యూమ్‌ని డిజైన్ చేయమంటుందామె. అతడు తయారు చేసిన ఆ డ్రెస్ ఆమెకు బాగా నచ్చుతుంది. దాంతో తనతో బాటు లండన్‌కి రమ్మనీ, ఇద్దరం పార్టనర్లుగా ఒక ఫ్యాషన్ డిజైన్ షోరూమ్‌ను ఏర్పాటు చేద్దామనీ అంటుంది ప్రవల్లిక. ఆమె తనను ప్రేమిస్తున్నదనే భావనతో సరేనంటాడు అప్పారావ్. ఆమెతో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళతాడు. అయితే ఆమె అతణ్ణి అక్కడకు తీసుకొచ్చిన వుద్దేశం వేరు. ఆమె బిబిసి కరస్పాండెంట్. పేరుపొందిన టెర్రరిస్ట్ జాన్‌ని ఇంటర్వ్యూ చేసి, కెరీర్‌లో పైకెదగాలనేది ఆమె సంకల్పం. తన ఇంటర్వ్యూ కావాలంటే తనను పోలీసుల కళ్లుగప్పి దేశం దాటించి దుబాయ్‌కి వెళ్లే ఏర్పాట్లు చేయాలంటాడు జాన్. అప్పారావ్ సరిగ్గా జాన్ లాగే వుండటంతో అతణ్ణి చంపి, జాన్ చనిపోయాడని లోకాన్ని నమ్మించి, అప్పారావ్ స్థానంలో జాన్‌ని దేశం దాటించాలని ప్రవల్లిక తలపోస్తుంది. ఇదేమీ తెలీని అప్పారావ్ అమాయకంగా ప్రవల్లిక ఏం చెబితే అది చేస్తాడు. చివరికి ఏం జరిగింది? అప్పారావ్‌కు వాస్తవం తెలిసిందా? తెలిస్తే ఏం చేశాడు? ప్రవల్లికను అసహ్యించుకున్నాడా? టెర్రరిస్ట్ జాన్ ఏమయ్యాడు? అనే వాటికి జవాబు మిగతా సినిమా.

కథనం:

తొలి సన్నివేశంలోనే మెహిదీపట్నం రైతుబజార్లో బాబులు పేలి చాలామంది చనిపోవడం చూపి దర్శకుడు వెంకట్ ఈ సినిమా కేవలం కామెడీకే పరిమితమైంది కాదనీ, ఇందులో క్రైమ్ ఎలిమెంట్ కూడా వుంటుందనే సంగతిని అన్యాపదేశంగా తెలియజేశాడు. అయితే ఆ తొలి సన్నివేశం మినహాయిస్తే ప్రథమార్థంలో ఎక్కడా మరో విషాదకర సంఘటన గానీ, క్రైమ్‌కి సంబంధించిన సన్నివేశం గానీ కనిపించదు. అలా అని సినిమా వినోదంగా సాగుతుందా అంటే అదీ లేదు. కృష్ణభగవాన్, రాజేష్, జీవా, మేల్కోటే, మరో నటుడి మీద చిత్రీకరించిన సన్నివేశాలు ఏమంత హాస్యాన్ని పంచలేక పోయాయి. అప్పారావ్‌కి పెళ్లి చేయడమే ధ్యేయంగా అతని చుట్టూ వుండే పాత్రలు ప్రవర్తిస్తూ వుంటాయి. కానీ ప్రతి సంబంధమూ ఫెయిలవుతుంటుంది. శోచనీయమైన విషయమేమంటే ఆయా సన్నివేశాల్లో దర్శకుడు వల్గారిటీ చొప్పించడం. అప్పారావ్ చూసే ప్రతి సంబంధంలోనూ ఒక వేశ్య తరహా స్త్రీ సన్నివేశంలోకి వచ్చేస్తుంది. ఆ పాత్రలతో వినోదం పుడుతుందనే భ్రమల్లో దర్శకుడు వెంకట్ వుంటే, తక్షణమే దాన్ని మార్చుకోవాలి. హాస్య సన్నివేశాల ద్వారానే హాస్యం పుడుతుంది గానీ వల్గారిటీతో కాదు.

తొలి అర్ధభాగం సాదా సీదాగా నడిచిన సినిమా, ద్వితీయార్థంలో నత్త నడకన సాగి చికాకు కలిగిస్తుంది. వైజాగ్ నుంచి రంగం ఎప్పుడైతే హైదరాబాద్‌కు మారిందో అప్పట్నించీ కథలో ఆసక్తి సన్నగిల్లింది. అచ్చు అప్పారావ్ లాగే వుండే జాన్ పాత్ర ప్రవేశంతో కథలో వున్న కొద్దిపాటి కామెడీ కూడా మాయమై, దాగుడుమూతల దొంగాట మొదలవుతుంది. కానీ అది వినోదాన్ని అందించడానికి బదులు అసహనాన్ని కలిగిస్తుంది. సినిమాకు బాగా నష్టాన్ని కలిగించిన అంశమిదే. అప్పారావ్ “నాకు లోకంలో రెండే ఇష్టం. ఒకటి ప్రవల్లిక, రెండు అరటిపండు” అంటుంటాడు. అంటే అరటిపండు అతడి వీక్‌నెస్. ఎక్కడ అరటిపండు కనిపించినా దాన్ని తినకుండా వుండలేనంత బానిస. సెకండాఫ్‌లో దానివల్లే చిక్కుల్లో పడతాడు. అయితే అర్ధంకానిదొకటే. రకరకాల వేషాలువేసే జాన్ మారువేషంలో దేశం దాటడం ఎంతసేపు పని! అప్పారావ్‌ని చంపి, ఆ చచ్చింది జాన్ అని లోకాన్ని నమ్మించి, అప్పారావ్ స్థానంలో దేశం దాటాలని అనుకోవడం సిల్లీగా లేదూ! అంతకంటే ఆశ్చర్యం కలిగించేది ‘జాన్ ఇంటర్వ్యూ సంపాదిస్తేనే నీకు ఉద్యోగం వుంటుంది. లేకపోతే ఊడుతుంది’ అని ప్రవల్లిక బాస్ చెప్పడం. బిబిసియే కాదు ఏ మీడియాలోనూ ఈ తరహా బెదిరింపులు ఉద్యోగుల పట్ల వుంటాయా? ప్రవల్లిక తనను ఇష్టపడుతున్నదని అప్పారావ్ భావించడానికి గల బలమైన సన్నివేశాలు దర్శకుడు కల్పించలేదు. అందువల్ల అప్పారావ్‌ది ఒన్‌సైడ్ లవ్ గానే మనకు కనిపిస్తుంది. అప్పారావ్‌ను చంపడానికే ప్రవల్లిక అతడ్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిందని తెలిసినా మనకు అప్పారావ్ మీద సానుభూతి కలగకపోవడానికి కారణమిదే. అలా కాకుండా అప్పారావ్‌తో ప్రవల్లిక ప్రేమ నాటకం ఆడి, అతణ్ణి ప్రేమిస్తున్నట్లు చూపితే, అప్పారావ్ పాత్ర మీద జాలి పుట్టేదే. ఈ సంగతిని దర్శకుడు గుర్తించలేక పోయాడు. అయినా ఇన్నేళ్లనుంచీ కృష్ణ భగవాన్‌ను హాస్య పాత్రల్లో చూస్తూ అలవాటుపడిన జనం కరడుగట్టిన టెర్రరిస్టు పాత్రలో ఎలా చూస్తారు? మరీ ఇంత కొత్తదనమా! పైగా జాన్‌ను టెర్రరిస్టుగా ఈజీగా గుర్తుపట్టే జనం, అచ్చు అలాగే వుండే అప్పారావ్‌ను జాన్‌గా పొరబాటు పడకుండా వుంటారా? అలా గుర్తించలేక పోవడానికి కారణం కేవలం హెయిర్ స్టైలా? సినీ చిత్రం!  

నటీనటుల అభినయం:

అప్పారావ్, జాన్ పాత్రల్లో కృష్ణ భగవాన్ వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. జాన్ పాత్రకు వేరొకరి గంభీరమైన గొంతును వుపయోగించడం వైవిధ్యం కోసమైనా.. కృష్ణ భగవాన్‌కి అది నప్పలేదు. హావభావాల విషయంలో మాత్రం అతను చక్కని పరిణతి ప్రదర్శించాడు. అయితే నడక విషయంలో అతని బలహీనత చాలా సన్నివేశాల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రవల్లిక పాత్రలో సిమ్రాన్ బాగా రాణించింది. అయితే ఆమెనుంచి గ్లామర్ కోణాన్ని ఆశించి వచ్చే ప్రేక్షకులకు మాత్రం మిగిలేది నిరాశే. కొన్నిచోట్ల మేకప్ అతిగా కనిపించింది. రజాక్ అనే మరో టెర్రరిస్టు పాత్రలో సాయాజీ షిండే కనిపించేది తక్కువ సమయమే అయినా మెప్పిస్తాడు. ఎప్పుడూ గోక్కుంటూ కనిపించే దురద రాజుగా జీవా అలరించాడు. రాజేష్, మేల్కోటే రాణించారు. అలీ, రఘుబాబు జంట కామెడీ నవ్వించలేక పోయింది.

టెక్నీషియన్ల పనితనం:

ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు అయిన కూచిపూడి వెంకట్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను స్వయంగా సమకూర్చాడు. మాటలు అక్కడక్కడా కొంచెం మెరిసినా, ఓవరాల్‌గా మాత్రం సాదా సీదాగానే వున్నాయి. క్రైమ్ కథను ఆసక్తిగా మలచేది స్క్రీన్‌ప్లేయే. ఆ విభాగంలో వెంకట్ ఫెయిలయ్యాడు. కిరణ్ వారణాసి సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. ఎందుకంటే ఇందులో వున్నవన్నీ రీమిక్స్ పాటలే. దానివల్ల పాటలన్నీ నకిలీవిగా కనిపిస్తాయి. రీరికార్డింగ్ కూడా ఓ మోస్తరుగా వుంది. గోపీనాథ్ సినిమాటోగ్రఫీ మాత్రం ఫర్వాలేదు. అయితే నిర్మాణ విలువలు అతి సాధారణంగా వుండటంతో అతడి పనితనం కూడా సరిగా కనిపించలేదు.

బలాలు, లోపాలు:

అప్పారావ్‌గా కృష్ణ భగవాన్, ప్రవల్లికగా సిమ్రాన్ నటన, ఆ ఇద్దరి కాంబినేషన్, తొలి అర్ధభాగంలోని కొన్ని వినోదాత్మక సన్నివేశాలు బలం. ఆశించిన రీతిలో లేని కామెడీ, ఎఫెక్టివ్‌గా లేని క్రైమ్ ఎలిమెంట్, విసుగెత్తించే ద్వితీయార్ధం, ఒరిజినాలిటీ లేని పాటలు, ఆకట్టుకోని జాన్ పాత్ర చిత్రణ, క్వాలిటీలేని నిర్మాణ విలువలు లోపాలు. కామెడీ కోసం వచ్చే వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసే సినిమా ‘జాన్ అప్పారావ్ 40+’.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: