కృష్ణవంశీ దర్శకత్వంలో మోహన్‌బాబు ‘జెండాపై కపిరాజు’ అనే సినిమాను నిర్మించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు హీరో. హీరోయిన్గా మొదట ‘చిరుత’ ఫేమ్ నేహా శర్మను అనుకుని, తర్వాత మీరా చోప్రాను తీసుకున్నారు. రెండు నెలల నుంచీ ఈ సినిమా త్వరలో మొదలవుతుందని ప్రచారం జరుగుతున్నా ఇంతదాకా అది కార్య రూపం దాల్చలేదు. దాంతో ఆ సినిమా ఆగిపోయిందనే పుకార్లు బయలుదేరాయి ఫిల్మ్‌నగర్‌లో. ఆ పుకార్ల సారాంశం.. మోహన్బాబుకూ, కృష్ణవంశీకి స్క్రిప్ట్ విషయంలో విభేదాలు తలెత్తాయి. సాధారణంగా కృష్ణవంశీ కథలు కేవలం హీరో పాత్ర చుట్టూ నడవవు. కథలో హీరో ఒక పాత్రగా మాత్రమే కనిపిస్తాడు. అలా కాకుండా హీరో పాత్రకు మరింత ప్రాధాన్యం కల్పించమని మోహన్‌బాబు సూచించాడనీ, దీనికి కృష్ణవంశీ స్పందించలేదనీ, అందుకే ఆ ప్రాజెక్టును విరమించుకోవాలని ఆయన సంకల్పించాడనీ కథనాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు.