ప్రేక్షకులు ఈ యేడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ చిత్రం ‘జల్సా’ విడుదల ఒక వారం వాయిదా పడిందా? ప్రస్తుతం టాలీవుడ్లో ఈ సంగతి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ సంకల్పించారు. తర్వాత రామ్చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే అంటే మార్చి 27నే ఈ సినిమా విడుదలయ్యే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ సినిమా విడుదల వారం రోజులు వాయిదా పడనున్నదనే ప్రచారం మొదలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రచారం చెవిన పడటంతో పవన్ అభిమానులు అందులో నిజాన్ని నిర్ధారించుకోవడానికి గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వరుసపెట్టి ఫోన్లు చేస్తున్నారు. కొంతమందైతే నేరుగా ఆఫీసుకే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ వారికి మాత్రం సినిమా విడుదల వాయిదా గురించిన స్పష్టమైన సమాచారం లభ్యం కావడం లేదు. తమకు అలాంటి సమాచారమేదీ తెలియదని ఆఫీసు సిబ్బంది వారికి చెబుతున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీ గురించి నిర్మాత అరవింద్ అధికారిక ప్రకటన ఇచ్చేదాకా ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం వుంది.