ఇదివరకు పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేసిన జగపతిబాబు ఇటీవల ఒక సినిమాలో ఆ తరహా పాత్రను చేయడానికి నిరాకరించినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా నీలకంఠ దర్శకత్వం వహించిన ‘మిస్టర్ మేధావి’. అందులో రాజా హీరో కాగా, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ రెండవ హీరోగా కనిపించాడు. వాస్తవానికి మొదట సోనూ సూద్ చేసిన పాత్రని జగపతికి నీలకంఠ ఆఫర్ చేశాడనీ, కానీ దాన్ని చేయడానికి జగపతి అయిష్టత ప్రదర్శించాడనీ టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో జగపతి చాలా సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేశాడు. తాజాగా శ్రీకాంత్ సినిమా ‘నగరం’, తరుణ్, ఇలియానాల సినిమాలోనూ ఆయన నటిస్తున్నాడు. ఇదివరకు శశాంక్ హీరోగా నటించిన ‘అనుకోకుండా ఒక రోజు’లోనూ నటించాడు. కానీ ‘మిస్టర్ మేధావి’ ఆఫర్ను ఆయన తిరస్కరించడానికి కారణం అందులో రాజా హీరో కావడమే అని ప్రచారం జరుగుతోంది. రాజా హీరోగా నటించే సినిమాలో ప్రత్యేక పాత్రని చేయడం ఆయన చిన్నతనంగా భావించాడనేది ఆ ప్రచార సారాంశం. ఇందులో నిజమెంతో ఆయనకే తెలుసు.