టాలీవుడ్‌కు చెందిన కొన్ని వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. చాలామందికి అది జీర్ణం కాని అంశం. హీరో బాలకృష్ణతో వై.ఎస్. జగన్ ఓ సినిమాని నిర్మించనున్నారనేదే ఆ అంశం. నిజంగా ఇది నమ్మశక్యమేనా? రాజకీయాల్లో మాదిరిగానే, సినిమా రంగంలోనూ సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. చిత్రమాలకు అందిన సమాచారం ప్రకారం జగన్ దృష్టి సినిమా రంగం మీద ప్రసరించింది. త్వరలో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. తొలి సినిమాని బాలకృష్ణతో తీయాలని ఆయన తలపోస్తున్నారనేది ఇప్పుడు గుసగుసగా వినిపిస్తున్న మాట. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడు, ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. కొడుకేమిటీ, తెలుగుదేశం పార్టీ స్థాపకుడైన ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణతో సినిమా తీయడమేమిటీ అనే సందేహం చాలామందికి మాదిరిగానే చిత్రమాలకు వచ్చింది. అయితే తెలిసినదేమంటే జగన్‌కు బాలకృష్ణ అంటే చాలా అభిమానం. ఇదివరలో బాలకృష్ణ సినిమా విడుదలైనప్పుడల్లా కడపలో ఆయన కాస్త హడావుడి చేసేవాడు. ఆ అభిమానం వల్లే బాలకృష్ణతో సినిమా నిర్మించాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవ రూపం దాలుస్తుందా లేక గాసిప్ గానే మిగిలిపోతుందా.. లెటజ్ వెయిట్ అండ్ సీ.