Gosangi ghosha!

దర్శకుడు గోసంగి సుబ్బారావు బాధ బాధకాకుండా ఉంది. ఇదివరలో సురేష్ హీరోగా ‘భవానీ’, ‘శివుడు’, రాజా శ్రీధర్ హీరోగా ‘మనమిద్దరం’ సినిమాలకు దర్శకత్వం వహించిన అతను ప్రస్తుతం ‘రుద్ర’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అందులో కిరణ్‌తేజ్ అనే ఓ వర్థమాన నటుడు హీరో. ‘బ్రహ్మ’ అనే సినిమాతో సోలో హీరోగా మారిన అతను ఆ సినిమా 50 రోజులు, 100 రోజులు ఆడినట్లుగా తెగ ప్రచారం చేసుకున్న సంగతి కొద్దిమందికైనా గుర్తుండే వుంటుంది. లేకపోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు (ఆ సినిమా ఎక్కడెక్కడ 100 రోజులు ఆడిందని అడక్కండి). ఒకట్రెండు సినిమాలతోటే క్రేజీ హీరోగా తనని తాను భావించుకుంటున్న అతను అప్పుడే దర్శకుణ్ణి పక్కనపెట్టి సొంతంగా డైరెక్ట్ చేసుకుటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘రుద్ర’ సినిమాతో ఆ అనుభవం దర్శకుడు గోసంగికి ఎదురయ్యిందనేది ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాకి ముందు గోసంగి భోజ్‌పురి స్టార్ హీరో శివలాల్ యాదవ్ హీరోగా భోజ్‌పురి భాషలో ఓ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. మాతృభాష మీద ఉన్న మమకారంతో ‘రుద్ర’కి డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో, భోజ్‌పురి సినిమాని పక్కనబెట్టి మరీ హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ మధ్యలో రెండు భోజ్‌పురి సినిమాలని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా వాటిని వదులుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో తనని ‘రుద్ర’ హీరో కిరణ్‌తేజ్ తనతో నిమిత్తం లేకుండా ఆ సినిమాని డైరెక్ట్ చేసుకుంటూ ఉండడంతో, ఏం చేయాలో తెలీక తల పట్టుకున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

We would like to hear your comments below: