కథనంతో ‘గొడవ’
రేటింగ్ – 2.5/5
ఇది వారసుల యుగం. నిన్న చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ హీరోగా పరిచయం కాగా, చిరంజీవికి స్టార్డమ్ కల్పించిన ‘ఖైదీ’ సహా అనేక హిట్ సినిమాలకు దర్శకత్వం కల్పించిన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ (సుమంత్) ఇప్పుడు ‘గొడవ’తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎక్కడా కొత్త హీరో అన్న ఛాయలు కనిపించకుండా చాలా సులువుగా, సునాయాసంగా తన పాత్రని పోషించాడు.అతడిని అలా ప్రెజెంట్ చేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా అతని తండ్రి కోదండరామిరెడ్డిదే. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకుడు ఆయనే కాబట్టి.
కథ:
కొత్త హీరోని ప్రెజెంట్ చేయడానికి అలాంటి కథ కావాలో సరిగ్గా అలాంటి కథనే తన కొడుకు కోసం ఎంచుకున్నారు కోదండరామిరెడ్డి. టైటిల్‌కి తగ్గట్టే ఇది ప్రేమ కోసం ఓ కాలేజీ కుర్రాడు చేసే ‘గొడవ’. బాలచందర్ అలియాస్ బాలు (వైభవ్) ఓ కాలేజీ కుర్రాడు. అతని తల్లిదండ్రులది ప్రేమ వివాహం. తల్లి తమిళురాలు. తండ్రి తెలుగువాడు. ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు తిట్టుకుంటూ, పోట్లాడుకుంటూ ఉండడంతో ప్రేమ వివాహమంటేనే అపనమ్మకం పెంచుకుంటాడు బాలు. అతని కాలేజీలోనే చదువుకునే అంజలి (శ్రద్ధా ఆర్య) ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన బాలుని మొదట ఈసడించుకుని, క్రమేణా అతన్ని ప్రేమించడం ప్రారంభిస్తుంది. అయితే ఓ సందర్భంలో తాను ఎప్పటికీ ప్రేమలో పడనని చెప్పిన బాలు, ఏ అమ్మాయయినా తనకి ‘ఐ లవ్ యు’ చెబితే తాను ‘సారీ’ చెబుతానని అంటాడు. దీనికి అంజలి హర్టవుతుంది. ఇది ఇంటర్వల్ పాయింట్. ప్రేమంటే గిట్టని బాలు ఆ తర్వాత అంజలి ప్రేమలో ఎలా పడ్డాడు, అంజలి కోసం ఓ బిలియనీర్ సంబంధం చూసిన అంజలి తండ్రి ఏం చేశాడు? అనేది మిగతా కథ.
కథనం:
ప్రేమించడం, ఆ ప్రేమని హీరో గెలిపించుకోవడం అనే సాధారణ అంశంతో ఈ కథ రూపొందినప్పటికీ, మొదట హీరోకి ప్రేమపట్ల ఏహ్యభావం ఉండడం, చివరకు తన పొరబాటు తెలుసుకుని ప్రేమలో పడడమనేది కాస్త వైవిధ్యమైన పాయింట్. అయితే హీరో మనసులో ప్రేమ భావం కలగడం మరీ ఆలస్యం కావడం వల్ల విలన్‌తో అతను గొడవపడే సమయం మరీ తక్కువై, ఆ మేరకు డ్రామాకు నష్టం వాటిల్లింది. పైగా కథనాన్ని సాఫీగా నడిపించడంలో దర్శకుడు వైఫల్యం చెందాడు. కథ ఒక ట్రాక్ మీద నడవకుండా అడ్డదిడ్డంగా పరుగెత్తడంవల్ల సగటు ప్రేక్షకుడు తికమకకు గురవుతాడు. మొదట వర్తమానంలో ఓ 20 నిమిషాలు సాగిన కథ ఆ తర్వాత హీరో పాయింట్ నుంచి ఫ్లాష్‌బ్యాక్‌లోకి మళ్లుతుంది. సినిమా మరో అరగంటలో ముగుస్తుందనంగా కథ వర్తమానంలోకి వస్తుంది. హీరో హీరోయిన్ల దాగుడుమూతలకే ఎక్కువ సమయం వెచ్చించినందున టైటిల్‌కి పాక్షికంగా మాత్రమే న్యాయం జరిగిందని చెప్పాలి. హీరోయిన్ తండ్రయిన సాయాజి షిండే ప్రథమార్థంలో కనిపించింది రెండు మూడు సార్లే. అదీ ప్రతిసారీ కూతురితో ఫోన్లో మాట్లాడుతూనే. అతడి పాత్రని కుదించేయడం వల్ల అతడితో హీరో ‘గొడవ’ పడే సమయం బహు స్వల్పమై పోయింది. వాస్తవానికి విలన్‌తో కంటే హీరో ఎక్కువ గొడవ పడింది తనతోనే. ప్రేమంటే గిట్టని తనలోని మరో మనిషితో అతడు గొడవపడి, చివరకు ప్రేమించడం మొదలుపెట్టాడు. దీన్ని ఆకర్షవంతంగా చెప్పగలిగినట్లయితే సినిమా ఆసక్తికరంగా ఉండేది. ఈ సినిమాలో లోపించింది అదే. మధ్యమధ్యలో రిలీఫ్ కోసం పెట్టిన వేణుమాధవ్ కామెడీ ట్రాక్‌లో చివరి బిట్ మినహా మిగతావన్నీ అలరిస్తాయి. భార్యాభర్తలని అతడు విడదీసే విధానం ఇబ్బందికరం. ఆ వెంటనే అతడి బాధితులందరూ అతణ్ణి చావగొట్టడం, దాన్ని చేయించింది హీరో అని చూపడం కృతకంగా తోస్తుంది. ఈ సినిమా చూశాక కాలేజీ కుర్రాళ్లంతా మందుబాబులే అనే అభిప్రాయం కలిగితే.. ఆ తప్పంతా దర్శకుడిదే. ప్రిన్సిపాల్ బ్రహ్మానందంను స్టూడెంట్స్ బ్లాక్మెయిల్ చేసే తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు. హీరోయిన్ సైతం కాలేజీకి కురుచ దుస్తుల్లో రావడం ఆమె పాత్రని కించపరచడమే.
పాత్రధారుల ప్రతిభ:
బాలు పాత్రలో వైభవ్ సరిగ్గా ఇమిడిపోయాడు. గ్లామర్ తక్కువైనా అతడిలో స్పార్క్నెస్ దండిగా ఉంది. డాన్సుల్లో, ఫైట్లలో అతని కదలికలు దాన్ని స్పష్టం చేశాయి. డైలాగ్ మాడ్యులేషన్లోనూ అతను పరిణతి ప్రదర్శించాడు. హావభావ ప్రదర్శనలోనూ అతడు మెప్పించాడు. అతడి పాత్రలో రకరకాల ఎమోషన్స్ ఉన్నందున నటించేందుకు అవకాశం లభించింది. అయితే పాత్ర తీరులోని గందరగోళమే అతడికి మైనస్ అయ్యిందని చెప్పాలి. హీరోయిన్గా నటించిన శ్రద్ధా ఆర్యకు హీరోతో సమాన ప్రాతినిథ్యం ఉన్న పెద్ద పాత్రే లభించింది. అయితే దర్శకుడు ఆమెని ఎక్కువగా గ్లామర్ కోణం నుంచే ఫోకస్ చేయడానికి కృషి చేయడం వల్ల యువతరానికి ఆమె అందాలు కనువిందు చేశాయి. మహిళా ప్రేక్షకులు మాత్రం కుర్చీల్లో ఇబ్బంది పడక తప్పదు. ద్వితీయార్థంలోనే ఎక్కువగా కనిపించే సాయాజీ షిండే తనకు అలవాటైన రీతిలో నటించాడు. కనిపించినప్పుడల్లా పోట్లాడుకునే హీరో తల్లిదండ్రులుగా చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి తమ పాత్రలకి న్యాయం చేశారు. బ్రహ్మానందం సంగతి చెప్పేదేముంది. టిటిఇగా సునీల్ కొద్దిసేపు కనిపిస్తాడు. వేణుమాధవ్ రిలీఫ్నిచ్చాడు.
టెక్నీషియన్ల పనితనం:
మణిశర్మ సంగీతం ఉత్తమ స్థాయిలో లేకున్నా ఫర్వాలేదని చెప్పాలి. రెండుపాటల్లో బాణీలు ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. దినేష్ సినిమాటోగ్రఫీకి వంకలు పెట్టాల్సిన పనిలేదు. తనపనిని అతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. సన్నివేశాల్లోని మూడ్‌ని అతడి కెమెరా బాగానే పట్టుకుంది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఇంప్రెసివ్‌గా లేకపోవడమే వైచిత్రి. సెకండాఫ్ చికాకు పెట్టడంలో ఎడిటింగ్ బాధ్యత కూడా ఉంది. ఫైట్స్ యాక్షన్ ప్రియుల్ని అలరిస్తాయి.
ప్లస్‌లు, మైనస్‌లు:
వైభవ్ అభినయం, శ్రద్ధ గ్లామర్, కామెడీ సన్నివేశాలు ప్లస్ పాయింట్లు. స్క్రీన్‌ప్లే లోపాలు, హీరో పాత్రలోని తికమక, టైటిల్‌కి సరైన న్యాయం జరక్కపోవడం, ఎడిటింగ్ లోపాలు మైనస్ పాయింట్లు.
యజ్ఞమూర్తి