నితిన్ హీరోగా ‘ఆటాడిస్తా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు. తేజ సినిమా బానర్‌పై సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా సెట్స్ మీద రవికుమార్కీ, కల్యాణ్‌కీ తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగిందనీ, ఒకానొక స్థితిలో ఈ సినిమా నుంచి తప్పుకోవాలని కూడా రవికుమార్ భావించాడనీ టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ వర్గాల కథనం ఏమిటంటే.. షెడ్యూలు ప్రకారం చిత్రీకరణ జరగనందుకే రవికుమార్‌ని కల్యాణ్ నిలదీశాడు. సన్నివేశాలు తాననుకున్నవిధంగా వచ్చేదాకా తాను రాజీపడననీ, అందువల్లే మొదట అనుకున్నరీతిలో షూటింగ్ కావడంలేదనీ, కాస్త సర్దుకుపొమ్మనీ రవికుమార్ ఆయనకు చెప్పాడు. అయితే కల్యాణ్ దీనికి కన్విన్స్ కాలేదు. ఫలితంగా అభిమానం దెబ్బతిన్న రవి ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని అనుకున్నాడు. అప్పుడే నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని రవికుమార్కి నచ్చచెప్పి తిరిగి షూటింగ్ సజావుగా సాగేందుకు కృషిచేశారు. ఎందుకంటే ఇప్పటికే నితిన్ నిటించిన ‘సత్యం శివం సుందరం’ విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ఇప్పుడు ‘ఆటాడిస్తా’ కూడా ఆ బాటనే పయనిస్తే తన కుమారుడి కెరీర్ ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని ఆయన ఆందోళన చెందారు. అందుకే మధ్యవర్తిత్వం నెరపి ‘ఆటాడిస్తా’కి ఆటంకాలు జరగకుండా చూసుకుంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా ఇటు నితిన్‌కీ, అటు రవికుమార్కీ అగ్నిపరీక్ష లాంటిదే.