Don

Rating: 2.00/5

Critic Rating: (2.00/5)
 

మాస్ తర్వాత నాగార్జున, లారెన్స్ ల సినిమా కదా, బాగుంటుందేమో అని ఆశించిన వారంతా తొలి రోజు మొదటి ఆటకే వెళ్తే ఊహించని విధంగా ఎదురు దాడి చేసి భయభ్రాంతులకి గురి చేశాడు ”డాన్”. రెండో షోకి వెళ్లే వారికి ముందే టాక్ సంబంధిత హెచ్చరికలు జారీ అవుతాయి కనుక ప్రిపేర్డ్‌గానే ఉంటారు కాబట్టి పర్లేదు. కానీ ఏమీ ఉంటుందో, ఎలా ఉంటుందో తెలియకుండా వెళ్ళిన వారిని వార్నింగ్ లేకుండా వేధించాడీ డాన్. డిసెంబర్ 20న, నాగార్జునకు బాగా అచ్చి వచ్చిన సీజన్లో విడుదల అయిన డాన్ పూర్తి పాఠమిది…

టూ లేని ఈ సినిమాలో దాని కోసం వెతికితే దారపు పోగు లాంటి స్టోరీ లైన్ ఒకటి చేతికి తగుల్తుంది. అయితే ఈ కథను హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో విలన్ కు అయినా ఒక లక్ష్యం ఉంటుంది కానీ, హీరోకు అది కూడా ఉండదు. అంతులేని తన సామ్రాజ్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న విలన్ (కెల్లి జార్జ్) ఆంధ్రప్రదేశ్ మీద కన్నేస్తాడు. కానీ ఇక్కడ డాన్ అయిన హీరో అతనికి అడ్డు తగుల్తాడు. తెలుగు మట్టి వైపు చూస్తే గుడ్లు పీకేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. అంతిమంగా హీరో గెలుస్తాడు… యాంటీ “హీరో” తన లక్ష్యం నెరవేరకుండానే చచ్చిపోతాడు. 

ఈ దారపు పోగు కథని ఏమాత్రం కష్టపెట్టకుండా వీలయినన్ని తక్కువ ముడులేసి (మలుపులు పెట్టి) మరింత బలహీనమయిన కథనంతో దండ గుచ్చాడు లారెన్స్. కేవలం ఫైటు, పాట, ఛాలెంజ్, ఆట తప్ప మరో ట్రాక్ మీదకు కథ పొరపాటున కూడా వెళ్లదు. కమర్షియల్ సినిమాకు అత్యంత ఆవశ్యకం అయిన కామెడీ, రొమాన్స్ నమూనాకు అయినా కాన రావు. కథను నడిపించే నాయకుడికే ఎలాంటి పర్పస్ లేనపుడు ఇక ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తి ఎలా ఏర్పడుతుంది? ఒక వ్యక్తి సమాజాన్ని శాసించే శక్తిగా ఎదగడమనే కాన్సెప్ట్ ఇలాంటి డాన్ సినిమాలకు ముడి సరుకు. కనీసం దానిని అయినా తీసుకోకుండా, కాంటెంపరరీ డాన్ సినిమాల్లోని ఇంగ్రేడియేంట్స్ అయినా జోడించకుండా అరవ సోదితో కిచిడీ వండాడు లారెన్స్. సినిమా మొదలయిన దగ్గరి నుంచి ముగింపుకి చేరే సరికి కూడా కనీసం కథ గానీ, సంఘర్షణ కానీ కాన రాలేదంటే లారెన్స్ మినిమమ్ బేసీక్స్ అయినా పాటించలేదని అర్ధం చేసుకోవాలి. గట్టిగా చెప్పుకున్నా రెండు నిమిషాలకు మించి చెప్పలేని ఈ కథతో అంత పెద్ద హీరోని, అన్ని కోట్లు పెట్టిన నిర్మాత ని ఎలా ఒప్పించాడో లారెన్స్ ఇష్ట దైవమయిన ఆ రాఘవేంద్రుడికే తెలియాలి.

అతని తెర వెనుక ప్రతాపం గురించి తర్వాత చెప్పుకోవచ్చు. ముందుగా అతని తెర మీది విన్యాసాలని చర్చించుకోవాలి. ఇందులో పేరుకి హీరో నాగార్జున అయినా నాగార్జున చేయాల్సిన పనులన్ని లారెన్స్ చేసేస్తూ ఉంటాడు. డాన్ ఏమీ చెయ్యాలో ఏమీ చెయ్యకూడదో అతని రైట్ హ్యాండ్ పాత్ర పోషించిన తమ్ముడు లారెన్సే డిసైడ్ చేస్తాడు. అన్న కూర్చోవాలన్నా, మాట్లాడాలన్నా, కొట్టాలన్నా, కాల్చాలన్నా అంతా తమ్ముడు చెప్పాకే జరగాలి. నాగార్జున సాయం కోరుతూ ఒక వ్యక్తి వస్తే దీనికి అన్న ఎందుకు అని లారెన్స్ వస్తాడు. ఇంట్రడక్షన్‌కి హీరో రేంజ్ బిల్డ్ ఇచ్చారు కూడా. నాగార్జున ని ప్రేమించమని, పెళ్లి చేసుకోమని కూడా అతనే ప్రేరేపిస్తాడు. చివరకు విలన్ వద్ద నేనే నిన్ను చంపగలను, కానీ ఆ ఛాన్స్ మా అన్నకి ఇస్తున్నా అని కూడా అనేస్తాడు. అంటే చివరకు విలన్ ని చంపే ఛాన్స్ కూడా ఇతనే హీరోకి ఇచ్చాడన్న మాట. డాన్సంతా లారెన్స్ వేసి రెండు స్టెప్పులు నాగార్జునకి, డైలాగులన్ని అతనే చెప్పి రెండు ముక్కలు నాగార్జునకి మిగుల్చుతూ ఉంటాడు. ఆరంభం నుంచి శుభం కార్డు దాకా ఈ చిత్రంలో అనేకానేక పాత్రలు పోషించి వెగటు పుట్టిస్తాడు లారెన్స్.

నాగార్జున గెటప్ కొత్తగా ఉంది. కొన్ని చోట్ల బాలేక పోయినా ఓవరాల్‌గా పర్వాలేదు అనిపిస్తుంది. ముందే చెప్పుకున్నట్టు ఇందులో నటించడానికి నాగార్జునకి ఏమీ మిగల్చలేదు లారెన్స్. ఫైట్ చేయడానికి తప్ప నాగార్జున పాత్ర కీలు బొమ్మ అంతే. అనుష్క కేవలం పాటలకే పరిమితం అయింది. నిఖిత పాత్ర చిన్నది అయినా దానికో మలుపు ఉండడంతో గుర్తుంటుంది. కెల్లి జార్జ్ డాన్‌గా నమ్మ దగ్గ రూపంతో ఆకట్టుకున్నాడు. నాజర్, కోటా, చలపతి రావు, జీవా తదితరులంతా తమ పాత్రలకు చేయదగింది చేశారు.

ఎస్. గోపాల రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. వైబ్రెంట్ కలర్స్ తో స్క్రీన్ లైవ్లీగా ఉంచారు. నీకై నేను పాటలో ఫోటోగ్రఫీ ఆయన సీనియారిటీ విలువ తెలియజేస్తుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఫాస్ట్ కట్స్ తో డల్ స్క్రీన్‌ప్లే ను కూడా ఒక్కో చోట పరుగులు పెట్టించారు. అబ్బూరి రవి సంభాషణలు ఏమాత్రం బాలేదు. విజయ్ ఫైట్స్ ఓకే అనిపిస్తాయి. ఫైట్స్‌లో మ్యాట్రిక్స్ ట్రిక్స్ ఎక్కువ. నిర్మాత భారీగా ఖర్చు పెట్టారు. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, కొరియోగ్రఫీ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన లారెన్స్ ఒక్క దానికి కూడా న్యాయం చేయలేదు. అన్ని అంశాల్లోను దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఎన్నో లూప్ హోల్స్, లూజ్ ఎండ్స్ ఉన్న ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోదు. యాక్షన్, స్టయిలిష్ సినిమాల ప్రియులు మాత్రం కొంత వరకు సంతృప్తి చెందవచ్చు. ఏదయినా అద్భుతం జరిగితే తప్ప ఈ డాన్ సక్సెస్ సాధించడం అసాధ్యం.

అసందర్భ, అసహజ, అర్థ రహిత, “అతి”శయం ఈ చిత్రం. దీపావళి వెళ్లిపోయిన చాలా రోజులకి థియేటర్లలో ఢామ్మని పేలిన భారీ టపాకాయ డాన్.
-శ్రీనిధి

Give your rating:

We would like to hear your comments below: