Teja and MS Raju combo film shelved?

తేజ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత యమ్మెస్ రాజు ఒక సినిమాని నిర్మించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా తన తనయుడు సుమంత్ అశ్విన్‌ని హీరోగా పరిచయం చేయాలని ఆయన తలపోశారు. ఈ సినిమాకు ‘వస్తాడు నా రాజు’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే తాజాగా ఆ సినిమా ఆగిపోయినట్లేనని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తను దర్శకత్వం వహించిన ‘వాన’ విడుదలైన వెంటనే ఆ సినిమా షూటింగ్ మొదలు పెడతానని ఆ సినిమా విడుదలకు ముందు యమ్మెస్ రాజు తెలిపారు. ‘వాన’ సంక్రాంతికి విడుదలైనా ఇంతవరకు తేజతో సినిమా మొదలు కాలేదు. దాంతో ఆ సినిమా ఇక వుండే అవకాశాలు లేనట్లేననే ప్రచారం జరుగుతోంది. తేజ ‘కేక’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. అంతా కొత్త తారలతో ‘కేక’ని ఆయన రూపొందించనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యంతో చిత్రం మూవీస్ బానర్‌పై ఈ సినిమాని తేజ స్వయంగా నిర్మించనున్నాడు.

We would like to hear your comments below: