Dasavatharam

Rating: 2.50/5

Critic Rating: (2.50/5)

‘దశావతారం’ అవసరమా?

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రం ‘దశావతారం’ జూన్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘శివాజి’ని మించిన ప్రచారం, అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిని అందుకుంది. రజనీకాంత్ మాదిరే తమిళ ప్రేక్షకుల్లోనే గాక తెలుగు ప్రేక్షకులకూ కమలహాసన్ సన్నిహితుడు కావటాన తెలుగునాట కూడా ఈ సినిమా భారీ స్థాయిలోనే విడుదలైంది. టైటిల్‌కి తగ్గట్లే పది విభిన్న పాత్రల్లో కమలహాసన్ నట వైదుష్యానికి పరాకాష్ఠ ‘దశావతారం’. సినిమా విడుదల కాకముందే అభ్యంతరాలు ఎలా తెలుపుతారంటూ పిటిషనర్లకు వ్యతిరేకంగా గురువారమే సుప్రీంకోర్టు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పిటిషనర్ల వాదనను బలం చేకూర్చే రీతిలోనే ఈ సినిమా ఆరంభ సన్నివేశాలు వుండటం వివాదాన్ని రేకెత్తించే అవకాశాలున్నాయి. చరిత్రలో ఏం జరిగినప్పటికీ వైష్ణవుల్ని హీరోలుగా, శైవుల్ని విలన్లుగా చిత్రీకరించడం ఖచ్చితంగా వివాదాస్పద అంశమే. అది మునుముందు గొడవలను తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. 

కథ:

12వ శతాబ్దంలో చోళ రాజు రెండవ కుళోత్తుంగుడు (నెపోలియన్) శైవమత దురభిమానంతో తన రాజ్యంలో వైష్ణవులనేవాళ్లు లేకుండా చేయాలనుకుంటాడు. వైష్ణవుల దైవమైన గోవిందరాజస్వామి విగ్రహాన్ని దేవాలయం నుంచి పెరికిస్తాడు. విష్ణు భక్తుడైన రంగరాజ నంబి (కమలహాసన్) ఈ చర్యను అడ్డుకుంటాడు. దాంతో అతణ్ణి నానా రకాలుగా హింసించి గోవిందరాజస్వామి విగ్రహానికే కట్టివేసి, సముద్రంలో పడేయిస్తాడు కుళోత్తుంగుడు. ఇక కథ 2004లోకి వస్తుంది. అమెరికాలో సైంటిస్టుగా పనిచేసే గోవిందరాజు (కమల్) బృందం అతి ప్రమాదకరమైన సింథటిక్ బయో వెపన్‌ను కనుగొంటుంది. దాని ప్రభావం ఎంత భయంకరంగా వుంటుందో అనూహ్యమైన ఒక సంఘటనతో ప్రత్యక్షంగా తిలకించిన గోవింద్ ఆ రసాయనాన్ని నాశనం చేయాలనుకుంటాడు. కానీ అమెరికా ప్రభుత్వం, అక్కడి సైంటిస్టులు దీనికి ఒప్పుకోరు. దాన్ని కోట్ల డాలర్లకు అమ్ముకోవాలని చూస్తారు. దాంతో దాన్ని తీసుకుని పారిపోతాడు గోవింద్. దాన్ని చేజిక్కించుకోవడానికి సిఐఎ ఏజెంట్ క్రిస్టియన్ ఫ్లెచర్ (అవతారం 3) అతని వెంట పడతాడు. ఆ రసాయనం గోవింద్ నుంచి చేజారి పొరబాటున ఒక కొరియర్ ద్వారా ఇండియాకు వెళుతుంది. దాంతో కథ కూడా ఇండియాకు మారుతుంది. ఆ కొరియర్ ఒక 95 యేళ్ల వృద్ధురాలు కృష్ణవేణి (అవతారం 4)కు చేరుతుంది. చిరునామా వెతుకుతూ అక్కడికి వస్తాడు గోవింద్. తన అనువాదకురాలు, హైక్లాస్ వేశ్య (మల్లికా షెరావత్)తో అతణ్ణి అనుసరిస్తాడు ఫ్లెచర్. ఆ రసాయనం ఎంత ప్రమాదకరమైందో తెలియని కృష్ణవేణి దాన్ని విష్ణుమూర్తి విగ్రహం లోపల పడేస్తుంది. ఆ విగ్రహాన్ని తీసుకుని వృద్ధురాలి మనవరాలైన రాధ (అసిన్)తో పాటు అక్కణ్ణించి పరుగులు తీస్తాడు గోవింద్. ఇక చివరిదాకా అతణ్ణి వెంటాడటమే ఫ్లెచర్ పని. ఆ ఇద్దరినీ పట్టుకోవడానికి పోలీసాఫీసర్ బలరాంనాయుడు (అవతారం 5) రంగంలోకి దిగుతాడు. ఈ మధ్యలో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ (అవతారం 6) పంజాబీ గాయకుడు అవతార్ సింగ్ (అవతారం 7), ఏడడుగుల ఎత్తుండే కలీఫుల్లా ఖాన్ (అవతారం 8), జపాన్‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్ యోధుడు షింఘేన్ (అవతారం 9), దళిత నాయకుడు విన్సెంట్ పుణ్యకోటి (అవతారం 10) అప్పుడప్పుడూ కనిపించి మాయమవుతుంటారు. చివరికి ఆ రసాయనం ఏమైంది? నాశనమయ్యిందా? లేక దుష్టుడైన ఫ్లెచర్ చేతికి చిక్కిందా? అనేది క్లైమాక్స్.
కథనం:

అసలు ఈ సినిమా ద్వారా కమల్ ఏం చెప్పదలచుకున్నాడు? వర్తమాన కథకీ, 12వ శతాబ్దం ఎపిసోడ్‌కీ ఏమిటి సంబంధం? ఇందులో వైష్ణవులు, శైవుల గొడవెందుకు? అనేవి అంతుచిక్కని ప్రశ్నలు. 12వ శతాబ్దంలో సముద్రంలో మునిగిన గోవిందరాజస్వామి విగ్రహం ఇప్పటి కోట్లాదిమంది ప్రాణాల్ని హరించే బయో రసాయనాన్ని నాశనం చేయడానికి సునామీని తెప్పించిందని కథకుడు అయిన కమల్ చివరలో అసిన్ పాత్ర చేత చెప్పిస్తాడు. నిజంగా ఇది ఎంత ఫూలిష్ ఆలోచనో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రకృతి భీభత్సానికి ఒక రూపమైన సునామీని పాజిటివ్‌గా చూపించ గలగడం కమల్‌లోని గొప్ప మనసుకి నిదర్శనమని అనుకోవాలా? అసాధారణ అంచనాలు, కనీవినీ ఎరుగని ముందస్తు ప్రచారం, వివాదాలు, కేసులు మధ్య వచ్చిన ‘దశావతారం’ ఎంతో గొప్పగా వుంటుందని ఊహించుకున్నవాళ్లకి దాని కథ, కథనాలు తప్పకుండా అసంతృప్తి కలిగిస్తాయి. పాత్రల చిత్రణ కూడా సక్రమంగా లేదు. సినిమా రిచ్‌గా కనిపించడం మినహా చాలా అంశాల్లో ఈ సినిమా ఆకట్టుకోలేదు. చివరి సన్నివేశంలో అసిన్ చేత చెప్పించిన మాటల్లో తప్పితే ప్రధాన కథకీ, 12వ శతాబ్దం కథకీ అనుసంధానమే లేదు. దానికి వైష్ణవ, శైవ ఆధిపత్యం గొడవ అవసరమే లేదు. కేవలం కాంట్రవర్సీ కోసమే ఆ ఎపిసోడ్‌ని సృష్టించారేమోననే సందేహం కలిగితే అది మన తప్పుకాదు. నిజానికి ఆ ఎపిసోడ్‌ని దర్శకుడు కెఎస్ రవికుమార్ అత్యున్నత స్థాయిలో చిత్రీకరించాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో రంగరాజ నంబి సన్నివేశాలు గొప్పగా వచ్చాయి. దాన్నే ప్రధాన కథగా తీసుకుని సన్నివేశాలు అల్లినా బాగుండేదనిపిస్తుంది, సినిమా అంతా చూశాక. క్లైమాక్స్ మన తెలుగుకి సరిపడేట్లు లేదు. సినిమాల్లో చాలా సన్నివేశాల్లో మాదిరే క్లైమాక్స్‌లోనూ తమిళ వాసన కొడుతుంది. తెలుగు సినిమాలో జార్జిబుష్, ప్రధాని మన్మోహన్ సింగ్ సరసన కనిపించాల్సింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కాదు. దానివల్ల సినిమాకు నేటివిటీ సమస్య కూడా వస్తుంది.

పాత్రధారుల అభినయం:

అసలు కమలహాసన్ 10 పాత్రల్ని చేయాల్సిన అవసరమేమిటి? కేవలం ప్రేక్షకుల్లో, ట్రేడ్‌లో క్రేజ్‌ని రేకెత్తించడానికీ, అదొక రికార్డనే గొప్పతనాన్ని చాటడానికి గాకపోతే. నిజం మాట్లాడుకోవాలంటే అసలు కథకూ కమల్ పోషించిన పంజాబీ గాయకుడు అవతార్ సింగ్, ఏడడుగుల ముస్లిం ఆజానుబాహుడు కలీఫుల్లా ఖాన్, దళిత నాయకుడు పుణ్యకోటి, జపాన్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షింఘేన్ పాత్రలు అడ్డు తగులుతూ వచ్చాయి. అవి లేకపోతే సినిమా గజిబిజి గందరగోళం కాకుండా కాస్తయినా సాఫీగా నడచి వుండేది. కమల్ ఒక్కడే ఇన్ని పాత్రలు చేయడం వల్ల ప్రేక్షకుడి దృష్టి కమల్ ఎప్పుడు ఏ అవతారంలో కనిపిస్తాడా.. అనే అనవసర అంశంపైకి మళ్లిపోతుంది. దీనివల్ల నటుడు సక్సెస్ అవుతాడే గానీ, సినిమా సక్సెస్ కాదు. ఆయా పాత్రల మేకప్ కూడా ప్రమాణాలకు తగ్గట్లు లేదని చెప్పడానికి సంకోచం అవసరం లేదు. కమల్ తన అసలు రూపంలో కాకుండా మరొకరిలా కనిపించాల్సి వచ్చినప్పుడు ఓవర్ మేకప్ మీద ఆధారపడ్డాడు. ముఖ్యంగా విలన్ ఫ్లెచర్ పాత్రకీ, జపనీయుడు, ముస్లిం పాత్రలకీ మేకప్ ఎబ్బెట్టుగా వుంది. అన్నిటికంటే తొలి సన్నివేశాల్లోని రంగరాజ నంబి పాత్రలోనే కమల్ చక్కగా వున్నాడు. అయితే పోలీసాఫీసర్ బలరాంనాయుడు పాత్రలో కమల్ మంచి వినోదాన్ని పంచాడు. ఆ పాత్రలో ఆయన చెప్పే డైలాగులు ఆహ్లాదాన్నిస్తాయి. తొలిసారిగా అసిన్ ద్విపాత్రల్లో దర్శనమిచ్చింది. రంగరాజ నంబి భార్య పాత్ర కొద్దిసేపే కనిపిస్తుంది. రెండోది గోవింద్‌తో బాటు పరుగులు తేసే పాత్ర. కాస్తయినా విరామం ఇవ్వకుండా లొడలొడా వాగే వసపిట్టగా ఆమె మెప్పిస్తుంది. అవతార్ సింగ్ భార్య పాత్రలో కనిపించేది తక్కువసేపే అయినా ఈ వయసులోనూ తనలో సౌందర్యం తగ్గలేదని తెలియజేసింది జయప్రద. హైక్లాస్ వేశ్యగా మల్లికా షెరావత్ చేసింది ఏమీలేదు. రెండవ కుళోత్తుంగ చోళుని పాత్రకి నెపోలియన్ సరిగ్గా అమరిపోయాడు. నగేష్, పి. వాసు, కెఆర్ విజయ, రేఖ, సంతాన భారతి తమ ప్రత్యేక పాత్రల్ని పరిధుల మేరకు చేశారు.  

టెక్నీషియన్ల పనితనం:

ఈ సినిమాలో అన్నిటికంటే ఆకట్టుకునేవి స్పెషల్ ఎఫెక్ట్స్. ఆరంభ సన్నివేశాల నుంచి మొదలుకొని చివరి సన్నివేశాల దాకా స్పెషల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత వున్న ‘దశావతారం’లో రంగరాజ నంబిని గోవిందరాజస్వామి విగ్రహంతో పాటు సముద్రంలో పడేయించే సన్నివేశాలు, క్లైమాక్స్‌లో సునామీ సన్నివేశాలు భారతీయ సినిమా ప్రమాణాలతో పోలిస్తే ఉన్నత స్థాయిలో వున్నాయి. ప్రత్యేకించి చివరి పావుగంట స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు జెన్నీ తన మాయాజాలంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. దానికి రవివర్మన్ సినిమాటోగ్రఫీ బాగా దోహదం చేసింది. కొద్ది సన్నివేశాల్లో మినహాయిస్తే అతని కెమెరా గొప్ప పనితనాన్ని ప్రదర్శించింది. పాటల్లో హిమేష్ రేషమియా సంగీత బాణీల కంటే దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగే ప్రశంసనీయం. క్లైమాక్స్‌లో ఫ్లెచర్, షింఘేన్ మధ్య చిత్రీకరించిన మార్షల్ ఆర్ట్స్ ఫైట్ ఆకట్టుకుంటుంది. వెన్నెలకంటి సంభాషణలు మెచ్చదగ్గ రీతిలో వున్నాయి. ముఖ్యంగా బలరాంనాయుడు, అసిన్ పాత్రలకు ఆయన చక్కని సంభాషణలు రాశారు.

బలాలు, లోపాలు:

పది పాత్రల్లో కమలహాసన్ వైలక్షణ నటనా వైదుష్యం, ఆరంభ, ముగింపు సన్నివేశాలు, స్పెషల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ బలాలు. కథకు సంబంధంలేని పాత్రలు, ఉప కథలు, గందరగోళ పరిచే ప్రథమార్ధం, గజిబిజి కథనం, సాధారణ స్థాయిలో వున్న పాటల సంగీతం లోపాలు. పది పాత్రల్లో కమల్ నటనను చూడాలనుకునే అభిమానులను మాత్రం ‘దశావతారం’ సంతృప్తి పరుస్తుంది. మహిళల్నీ, గ్రామీణ ప్రేక్షకుల్నీ అయోమయానికి గురిచేసే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా నిలిస్తే గొప్పే.

…యజ్ఞమూర్తి

Give your rating:

We would like to hear your comments below: