Mahesh to support Congress?

రానున్న ఎన్నికల్లో రాజకీయ వాతావరణాన్ని సినిమా రంగం బాగా ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన సొంత పార్టీతో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతారన్న విషయం అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ దాదాపుగా ఖరారైన విషయమే. ఆయన రాకతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో పెను మార్పు చోటు చేసుకుంటుందని విశ్లేషకులు ఊహిస్తున్నారు. ఆయన చరిష్మా ఎదుర్కోవడానికి ప్రధాన రాజకీయ పార్టేలైన కాంగ్రెస్, తెలుగుదేశం ఇప్పటినుంచే తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. చిరంజీవితో పోటీ పడగలిగిన ఇమేజ్ ఉన్న బాలకృష్ణను ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని అంటున్నారు. తాను ఏదో ఒక పార్టీలో చేరేది తధ్యమని హీరో డాక్టర్ రాజశేఖర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, యువతలో అమోఘమైన ఇమేజ్ ఉన్న మహేష్ బాబును పార్టీ ప్రచారం కోసం బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో సూపర్‌స్టార్ కృష్ణకు ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ తరపున ఆయన లోగడ ఎంపీగా కూడాఎన్నికయ్యారు. రాజశేఖర్ రెడ్డికి కూడా కృష్ణ సన్నిహితులు. ఇటీవల ప్రభుత్వ పధకాల ప్రచారం నిమిత్తం రూపొందించిన కొన్ని డాక్యుమెంటరీ చిత్రాల్లో కూడా కృష్ణ నటించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణకి గౌరవ డాక్టరేట్ రావడం కూడా వై.ఎస్. చలవేనని అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి కృష్ణకు వియ్యంకులు అవుతారు. ఇన్నిసన్నిహిత సంబంధాల నేపధ్యంలో లేటెస్ట్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుకి యువతలో, ప్రజలో ఉన్న క్రేజ్ ప్రచారానికి ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

We would like to hear your comments below: