ఉగాది పండుగ రోజు అంటే ఏప్రిల్ 7న చిరంజీవి రాజకీయ రంగ ప్రకటన చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆ సంగతి ఎక్కడా ప్రస్తావించకపోయినా, ఆయన సన్నిహిత వర్గాలే ఈ ప్రచారాన్ని తీసుకు వచ్చాయి. ఓవైపు చిరంజీవి తన సన్నిహితులతో మంతనాలు సాగించడం, ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు వివిధ జిల్లాల్లో పర్యటించి, చిరంజీవి అభిమానులను కలుసుకుని వారితో చర్చలు జరపుతుండడం, పార్టీ మేనిఫెస్టో తయారవుతుండడం, ఎన్నికల కమీషన్‌కు పార్టీ ఏర్పాటు గురించి దరఖాస్తు చేసుకోవడం వంటివి ఆయన పార్టీ పెట్టడం ఖాయమనే సంగతిని బలపరుస్తూ వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 7న కాకుండా ఏప్రిల్ 14న చిరు పార్టీ ప్రకటన వెలువడే అవకాశముంది. ఆ తేదీని చిరంజీవి ఎందుకు ఎంచుకున్నారన్న సంగతి వెల్లడి కాలేదు. అయితే పార్టీ ప్రకటన తేదీ ఒక వారం రోజులపాటు వెనక్కి జరిగిందనేది నిజమేనని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీ పేరును ఆ రోజే చిరంజీవి ప్రకటించనున్నారు. పార్టీ చిహ్నాన్ని మాత్రం మేలో ప్రకటించే అవకాశాలున్నాయి. ఆయన పార్టీ ప్రకటన తేదీ సమీపిస్తున్నకొద్దీ ప్రధాన రాజకీయ పార్టీల్లో గుబులు పెరుగుతూ పోతోంది. వలసల భయంతో బాటు ఎన్నికల్లో ఆయా పార్టీల జయాపజయాల్ని ప్రభావితం చేయగల శక్తి ఆ పార్టీకి వుంటుందనే భావన దానికి కారణం.