చిరంజీవి పార్టీ పేరు దాదాపు ఖాయమైంది. ఆ పేరు.. ‘మన దేశం పార్టీ’ (ఎండిపి). ఈ మేరకు చిత్రమాలకు విశ్వసనీయ సమాచారం అందింది. అంతర్గత వర్గాల కథనం ప్రకారం చిరంజీవి దరఖాస్తు చేసుకున్న పేర్లలో కేంద్ర ఎన్నికల కమీషన్ నుంచి ‘తెలుగు వెలుగు’, ‘మన దేశం’ అనే పేర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వీటిలో ‘మన దేశం’కు చిరంజీవి సన్నిహితులంతా ఓటేయడంతో చిరంజీవి ఆ పేరునే ఎంచుకున్నారు. గమనించదగ్గ సంగతేమంటే దివంగత ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా ‘మన దేశం’ కాగా, ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు నటించిన సినిమా ‘నా దేశం’. ఆ రెంటినీ దృష్టిలో వుంచుకుని ‘మన దేశం’ పేరును చిరంజీవి ఎంచుకున్నట్లు చెప్పుకుంటున్నారు. పార్టీ రంగుగా చిలకపచ్చ రంగును ఇప్పటికే నిర్ణయించారు. జూన్ 10న పార్టీ పేరును శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి చిరంజీవి ప్రకటించనున్నారు. దీనికోసం చిరంజీవి సోదరుడు నాగబాబు ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.