చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి తలొకరు తలో మాట అంటున్నా బయటపడని చిరంజీవి చడీ చప్పుడు లేకుండా తన పని తాను చేసుకు పోతున్నారు. ఈ విషయంలో ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ ఆయనకు అన్నివిధాలుగా సహకరిస్తున్నారు. నాగబాబు వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ, అక్కడి చిరంజీవి అభిమానులతో చర్చలు జరుపుతూ వారి మనోభావాలు తెలుసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ రూపురేఖల విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాగా ఉగాదికి చిరంజీవి తమ కొత్త పార్టీ ప్రకటన చేయవచ్చని మొదట వినిపించగా, ఆయన ఆంతరంగిక వర్గాల ప్రకారం తాజాగా ఏప్రిల్ 7ని అందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈలోగా ఆయన నటించే నూతన సినిమా షూటింగ్ మొదలు కానున్నది. పార్టీ పేరేమిటనే విషయంలో మాత్రం చిరంజీవి ఇంకా గుంభనని పాటిస్తున్నారు. అయితే ఎన్నికల కమీషన్‌కు రెండు పేర్లను ఇప్పటికే సమర్పించారనీ, వాటిలో కమీషన్ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే దానిని పార్టీ పేరుగా ప్రకటిస్తారనీ తెలుస్తోంది. అలాగే నటుడు ప్రకాష్‌రాజ్ సైతం చిరంజీవి పార్టీలో చేరే అవకాశం వుందని వినికిడి. పార్టీలో ఆయనకు కూడా కీలక హోదా లభించనున్నది.