చిరంజీవి ప్రారంభించనున్న రాజకీయ పార్టీకి ‘మనదేశం’ అనే పేరు పెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో ఒక కొత్త సంగతి చిత్రమాల చెవికి చేరింది. అది ఆయనకు భారతీయ జనతా పార్టీ నుంచి పిలుపు వచ్చిందని. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన వెంకయ్యనాయుడు చెన్నై నుంచి చిరంజీవికి ఫోన్‌చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజిపి బలహీనంగా వున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఆ పార్టీ బలోపేతం కావాలంటే చిరంజీవి వంటి ప్రజాకర్షణ వున్న నాయకుడు కావాలని అధినాయకత్వం భావిస్తోంది. అందుకే చిరంజీవిని బిజిపిలో చేరి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా వెంకయ్యనాయుడు ఆయనను కోరారు. ఆ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని ఆయనకే ఇప్పిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆయన పార్టీలో చేరితే ఆయనకు రాష్ట్ర శాఖకు సంబంధించిన పూర్తి అధికార బాధ్యతల్ని అప్పగిస్తామని కూడా చెప్పారు. అయితే చిరంజీవి ఆయనకు ఎలాంటి హామీని ఇవ్వలేదు. ఆలోచిస్తానని మాత్రం చెప్పారు. జూన్ 1న వెలువడే ఉప ఎన్నికల ఫలితాలను చూసుకుని ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఈ కథనం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయాలకు సంబంధించి ఏదీ అసాధ్యం కాదు కాబట్టి ఏం జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు.