తరుణ్, ఇలియానా జంటగా దర్శకుడు కె. విజయభాస్కర్ ఒక సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘బంటీ ఔర్ బబ్లీ’ ఆధారంగా రూపొందుక్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ సమర్పిస్తున్నారు. ఒరిజినల్లో అమితాబ్ బచ్చన్ చేసిన పోలీసాఫీసర్ పాత్రని ఇందులో జగపతిబాబు చేస్తున్నారు. కాగా హిందీ సినిమాలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్‌లపై చిత్రీకరించిన ‘కజరారే..’ ఐటమ్ సాంగ్ సూపర్ పాపులర్ అయింది. ఆ పాట ట్యూన్‌ని ఉపయోగించుకుంటూ తెలుగులోనూ ఒక ఐటమ్ సాంగ్ తీయనున్నారు. మొదట ఈ పాటని మమతా మోహన్‌దాస్ చేయనున్నదని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మమత ఆ పాటని చేయడం లేదనీ, రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకూ, ఆమెకూ ఏకాభిప్రాయం కుదరక పోవడమే దీనికి కారణమనీ తెలియవచ్చింది. మరయితే మమత కాకుండా ఆ పాటలో నర్తించనున్న తార ఎవరు? ఛార్మి. అవును ఆ పాటలో డ్యాన్స్ చేసే అవకాశం ఛార్మికి వచ్చింది. అయితే దానికి ఆమె చేసిన డిమాండ్ ఎంతో తెలుసా? అక్షరాలా 23 లక్షల రూపాయలు! మరి ఇంత ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారనేది టాలీవుడ్ వర్గాల సమాచారం. ‘మంత్ర’తో ఛార్మికి వచ్చిన పాపులారిటీని దృష్టిలో వుంచుకుని ఆ మొత్తాన్ని చెల్లించేందుకు బెల్లంకొండ సురేష్ సరేనన్నారు. తెలుగులో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి ఇంత మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఇదే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నందుకు గాను ఇలియానాకు కోటి రూపాయలను చెల్లించడం సంచలనం కలిగించింది. కాగా ఐటమ్ సాంగ్‌ని జగపతి, తరుణ్, ఛార్మిలపై త్వరలో చిత్రీకరించనున్నారు.