Bujjigadu

Rating: 2.25/5

Critic Rating: (2.25/5)

‘బుజ్జిగాడు’ దారి తప్పాడు!

వేసవిలో మంచి వినోదం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇటీవల వచ్చిన సినిమాలు అసంతృప్తి కలిగిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు’ పట్ల సినిమా ప్రేమికులు చాలా ఆసక్తి కనపరచారు. ఒకప్పటి సూపర్‌హిట్ సినిమాల నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, త్రిష జంటగా మూడవసారి నటించారు. త్రిష అన్నగా విలక్షణ నటుడు మోహన్‌బాబు ఒక కీలక పాత్రను చేయడం ఈ సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచింది. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో రజనీకాంత్ వీరాభిమానిగా కనిపించాడు. మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై’ ఎలా వున్నాడంటే…

కథ:

లింగరాజు అలియాస్ బుజ్జిగాడు (ప్రభాస్), మేఘన అలియాస్ చిట్టి (త్రిష) చిన్నప్పటి స్నేహితులు. విశాఖపట్నంలోని ఒక కాలనీలో పక్క పక్క ఇళ్లలో వుండే ఆ ఇద్దరూ చిన్నప్పుడే ఒకర్ని విడిచి ఒకరు విడిచి వుండలేనంత సన్నిహితంగా వుంటారు. ఒకసారి బుజ్జి చేసిన పనికి అలిగిన చిట్టి తనతో మాట్లాడవద్దని అతడికి చెబుతుంది. ‘ఎంతకాలం?’ అనడుగుతాడు బుజ్జి. ‘పన్నెండేళ్లు’ అంటుంది చిట్టి. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని కూడా అంటుంది. అన్నేళ్లు చిట్టితో మాట్లాడకుండా వుండటం తనవల్ల కాదని పన్నెండేళ్ల వయసుండే బుజ్జి ఇంటి నుంచి వెళ్లిపోయి చెన్నైకి చేరుకుంటాడు. పన్నెండేళ్లు గడచిపోతాయి. రజనీకాంత్ ఫ్యాన్ అయిన బుజ్జి వైజాగ్ వస్తాడు చిట్టి కోసం. కానీ తను వెళ్లిన కొద్ది రోజులకే చిట్టి వాళ్లు అక్కడనుంచి హైదరాబాదుకు వెళ్లిన సంగతి తెలుస్తుంది. ఈ మధ్యలో అనుకోకుండా పోలీసులను కొట్టినందుకు గాను స్నేహితుడు సత్తి (సునీల్)తో కలిసి జైలుకు వెళతాడు. అక్కడ అన్నదమ్ములైన ఇద్దరు గూండాలు పరిచయమై, బుజ్జి చురుకుదనం చూసి ఒకణ్ణి చంపితే కోటి రూపాయలిస్తామని చెబుతారు. సరేనని మరుసటి రోజే జైలు నుంచి తప్పించుకుంటాడు బుజ్జి. తను చంపుతానని ఒప్పుకున్న వ్యక్తిది కూడా హైదరాబాదే. చిట్టి కోసం, తను ఒప్పుకున్న పనికోసం హైదరాబాద్‌కు వస్తాడు బుజ్జి. అక్కడకు వచ్చిన తర్వాత తను చంపాల్సింది శివన్న (మోహన్‌బాబు) అనే ల్యాండ్ మాఫియా డాన్‌ని అనే సంగతి తెలుస్తుంది. శివన్న, మాచిరెడ్డి (కోట శ్రీనివాసరావు) ప్రత్యర్థులు. బుజ్జికి పని అప్పగించింది మాచిరాజు కొడుకులే. శివన్నను చంపుతానికి వెళ్లిన బుజ్జి అతడి చేతికి చిక్కుతాడు. శివన్న చెల్లెలే చిట్టి. ఆ సంగతి బుజ్జికి తెలుస్తుంది. బుజ్జి ద్వారా వాళ్ల చిన్నప్పటి అనురాగం సంగతి తెలుసుకున్న శివన్న అతడే బుజ్జి అనే నిజాన్ని చిట్టికి చెప్పవద్దని మాట తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బుజ్జి, చిట్టి ఒక్కటయ్యారా? శివన్న, మాచిరెడ్డి మధ్య గొడవల్లో ఎవరు చచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:

పూరీ జగన్నాథ్ సినిమాల్లో కథను ఆశించడం వృథా అని మనకు తెలిసిందే. ఒక చిన్న పాయింట్ పట్టుకుని దాని చుట్టూ రకరకాల కమర్షియల్ అంశాలు మేళవించిన సన్నివేశాలు అల్లడం అతని స్టోరీ డిపార్ట్‌మెంట్ రెగ్యులర్‌గా చేసే పనే. ‘బుజ్జిగాడు’ దానికి మినహాయింపు కాదు. అతుకుల బొంతలా వుండే ‘బుజ్జిగాడు’ సినిమాలో ఏ ఒక్క పాత్రా సమగ్రంగా లేదు, బుజ్జిగాడు పాత్ర సహా. చిన్నతనంలో చిట్టి పన్నెండేళ్ల పాటు మాట్లాడవద్దంటే బుజ్జి ఇంట్లో నుంచి వెళ్లిపోవడమేమిటో అర్ధం కాదు. ఈ సందేహం ప్రేక్షకులకి వస్తుందనే కాబోలు చివర్లో శివన్న పాత్ర చేత దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు జగన్. తను ఇంట్లో నుంచి చెన్నైకి వెళ్లిపోయిన కారణాన్ని బుజ్జి చెబితే ‘ఇది ఫూలిష్‌గా వుందే’ అంటాడు శివన్న. నిజంగానే అది ఫూలిష్‌నెస్. అప్పటి సన్నివేశాలూ అంతే ఫూలిష్‌నెస్‌తో కనిపిస్తాయి. మధ్య మధ్యలో కథకు అవసరంలేని చిన్న చిన్న సస్పెన్సు ‘కళలు’ కూడా. హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి (సంజన) బుజ్జి వాళ్లింటికి వచ్చి బుజ్జి తండ్రి ప్రభాస్‌రాజు (ఎమ్మెస్ నారాయణ)కి తాను చిట్టినని చెబుతుంది. ప్రేక్షకులు కూడా ఆమే చిట్టి అనుకుంటారు. కొద్దిసేపు పోయాక చిట్టి ఆమె కాదనీ, ఆమె చిట్టి చెల్లెలు కంగన అని చూపిస్తాడు దర్శకుడు. ఆ పావుగంట సస్పెన్స్ వల్ల దర్శకుడు బావుకున్నదేమిటి? అలాగే చిట్టి చిన్నతనంలో ఆమె తల్లిదండ్రులుగా ఆహుతి ప్రసాద్, సుధ కనిపిస్తారు. అలా అని భ్రమింపజేస్తాడు దర్శకుడు. మధ్యలో ఆహుతి ప్రసాద్‌ని ‘బాబాయ్’ అని చిట్టి సంబోధించినప్పుడు ఆశ్చర్యపోతాం. దీన్ని మనం ట్విస్ట్ అనుకుని సంబరపడాలి. కానీ ఆ ట్విస్ట్ వల్ల ఒనగూడిన ప్రయోజనం లేనప్పుడు అది ఎందుకంట?
చిన్నప్పుడే చిట్టిని గాఢంగా ప్రేమించి ఆమె తనతో మాట్లాడవద్దంటే సరేనని తలాడించి, ఇంట్లోనుంచి వెళ్లిపోయిన బుజ్జి చివరలో ‘బుజ్జి అనేవాణ్ణి కాకుండా చిట్టి మరొకర్ని ప్రేమిస్తే నరికేస్తా’నంటాడు. పెద్దయ్యాక పరిణతి చెందాడన్నమాట! సినిమాలో మనల్ని అన్నిటికంటే ఆశ్చర్య పరిచేది బుజ్జి పట్ల శివన్న ప్రవర్తన. మాచిరెడ్డి అనుచరుల్ని కనిపిస్తే చాలు నల్లుల్లా నలిపేసే శివన్న అందుకు విరుద్ధంగా తనను చంపడానికి వచ్చి, తన కళ్లముందే తన మనుషుల కాళ్లూ చేతులూ విరిచిన బుజ్జిని ‘ఐ లవ్ యూ రా’ అనడమే గాక దెబ్బలు తగిలిన బుజ్జికి తన వద్దే ఆశ్రయమివ్వడం.. వాట్ ఎ వండర్ క్రియేషన్! దట్ ఈజ్ తెలుగు డైరెక్టర్స్ ఇమాజినేషన్! మిగతా భాషల దర్శకులు ఇమ్మీడియేట్‌గా నేర్చుకోవాల్సిన క్రియేషన్. శివన్న ప్రవర్తన ఇంత విచిత్రంగా వుంటే బుజ్జి ప్రవర్తన కూడా తక్కువ తినలేదు. శివన్నని చంపుతానని డబ్బులు తీసుకున్నవాడు పోయి అదే శివన్నతో మిలాఖత్ కావడమేమిటి? వ్యక్తిత్వ హననం! అంటే ఇటు బుజ్జి, అటు శివన్న.. ఇద్దరి క్యారెక్టరైజేషన్లు దెబ్బతిన్నాయి.
హీరోయిన్ చిట్టి పాత్రలో ఎక్కడా సున్నితత్వం గోచరించదు. ప్రభాస్, త్రిష జంట అంటే ప్రేక్షకులు ఏమాశిస్తారు? ఆ ఇద్దరికీ చక్కని రొమాన్స్ వుంటుందని! ‘బుజ్జిగాడు’లో లోపించింది సరిగ్గా అదే. ప్రభాస్, త్రిషల మధ్య రొమాన్స్ మిస్సవడం సినిమాని అనాసక్తంగా తయారుచేసింది. పాటల్లో తప్పితే ఆ ఇద్దరూ ఏ సన్నివేశంలోనూ సన్నిహితంగా కనిపించరు. తీపి కబుర్లు చెప్పుకోరు. తమ మధ్యే రజనీకాంత్ అనే పెరుతో చలామణీ అవుతున్నవాడే బుజ్జి అనే నిజం చిట్టికి తెలీక పోవడం వల్ల వచ్చిన చిక్కది. ఆ చిక్కుని దర్శకుడే కోరి తెచ్చుకున్నాడు. కామెడీ విషయంలో జగన్ ఒకడుగు ముందుటాడు. ఇందులో అది కూడా చెప్పుకోదగ్గ రీతిలో లేదు. జగన్ సినిమాలో కామన్‌గా కనిపించే అలీపై చిత్రించిన నాలుగు కామెడీ సీన్లు కూడా చెప్పుకోదగ్గ రీతిలో లేవు. ఈ సినిమాలో కథానాయకుడి లక్ష్యం తన చిట్టిని కలుసుకోవడం. అంటే ఆ ఇద్దరి మధ్య ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు, చక్కని రొమాంటిక్ సీన్లు రావాలి. కానీ అవి లేకుండా బుజ్జిగాడు పాత్రని అనవసర విషయాల్లోకి దింపి కథని దర్శకుడు పక్కదారి పట్టించాడు. చేజేతులా సినిమాను అనాసక్తంగా మార్చేశాడు.

పాత్రధారుల అభినయం:

బుజ్జిగాడుగా ప్రభాస్ చలాకీగా నటించాడు. అతని బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో కాస్త కొత్తగా కనిపిస్తుంది. జగన్ ప్రతిభ కారణంగా అతను బుజ్జిగా రాణించాడు. రజనీకాంత్ ఫ్యాన్‌గా కనిపించే అతని పాత్రలో వినోదం, యాక్షన్.. రెండూ కలిసి వున్నాయి. పాత్ర తీరు సంగతి అలా వుంచితే ఆ రెండు అంశాల్లోనూ అతనికి మంచి మార్కులు పడతాయి. కాకపోతే కొన్నిచోట్ల అతని ఛాతీ నున్నగా కనిపిస్తే, చాలాచోట్ల వెంట్రుకలతో కనిపిస్తుంది. యూనిఫామిటీ మైన్‌టైన్ చేస్తే బాగుండేది. చిట్టి పాత్రలో త్రిష గురించి గొప్పగా రాయడానికి ఏమీ లేదు. ఎందుకనో ఆమెలో ఛార్మింగ్ కనిపించలేదు. అది మేకప్ తప్పో, లేక ఆమే అలా అయ్యిందో తెలీదు. శివన్నగా మోహన్‌బాబు తనదైన శైలితో ఆకట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ దందా చేసే ఆయనను పాజిటివ్ కోణంలో చూపించడం, బుజ్జితో ఆయన ప్రవర్తించే విధానం ఆ పాత్రలో దొర్లిన లోపాలు. వాటిని మినహాయిస్తే శివన్న పాత్రకు ఆయన న్యాయం చేశారు. విలన్ మాచిరెడ్డి పాత్రలో కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఆయన కొడుకుల పాత్రల్లో సుమీత్, అజయ్, సుబ్బరాజు సరిపోయారు. ప్రభాస్ స్నేహితుడిగా సునీల్, తండ్రిగా ఎమ్మెస్ నారాయణ, త్రిష తండ్రిగా ఆహుతి ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. త్రిష చెల్లెలుగా సంజన పర్వాలేదు. అలీ నవ్వించే ప్రయత్నం చేశాడు.

టెక్నీషియన్ల పనితనం:

దర్శకుడు జగన్ ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలతో పాటు మాటల బాధ్యతనీ తీసుకున్నాడు. సంభాషణలు ‘ఓహో’ అనిపించేట్లు లేకపోయినా, పాత్రోచితంగానే సాగాయి. బుజ్జి పాత్రకి మరీ తమిళ వాసన ఎక్కువ పెట్టకుండా వుండే బాగుండుననిపిస్తుంది. సందీప్ చౌతా సంగీతం కూర్చిన పాటల్లో ఒకటి, రెండు ఓ మోస్తరుగా వుంటే మిగతావి సిగరెట్ పాటలు. భాస్కరభట్ల, కందికొండ ‘ఇంగ్లీసు’ ముక్కలతో పాటల్ని నింపడం గాక కాస్త సాహిత్య విలువలు వుండేలా పాటలు రాస్తే బాగుంటుంది. లేకపోతే వారి పేర్లు ఎన్నటికీ చరిత్రకెక్కవు. ఈ సినిమాకి పాటలు ఏ రకంగానూ ప్లస్ కాలేవు. పాటల్లోని బాణీలతో పోలిస్తే నేపథ్య సంగీతమే బెటర్. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఓకే. లైటింగుని బాగానే వాడాడు. విజయన్ ఫైట్లు మాస్‌కీ, పిల్లలకీ బాగా నచ్చుతాయి. గన్ ఫైట్లు ఎక్కువ. వర్మ ఎడిటింగ్ ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మెరుగ్గా వుంది.

బలాలు, లోపాలు:

ప్రభాస్ చలాకీ నటన, అతని ఛార్మింగ్, మోహన్‌బాబు గంభీర నటన, సినిమాటోగ్రఫీ, ఫైట్లు బలాలు. బలహీనమైన పాయింట్, ప్రధాన పాత్రల చిత్రణ, హీరో హీరోయిన్ల మధ్య మిస్సయిన్ రొమాన్స్, అనాకర్షకంగా వున్న పాటలు, త్రిషలో కనిపించని ఛార్మింగ్, సరిపడునంతగాలేని వినోదం లోపాలు. మొత్తంగా కొద్ది మంది మాత్రనే సంతృప్తి పరచి, ఎక్కువమందిని నిరాశకు గురిచేసే చిత్రం ‘బుజ్జిగాడు’.

…యజ్ఞమూర్తి

Give your rating:

We would like to hear your comments below: