ఇటీవలి కాలంలో చిరంజీవి కంటే ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ చర్యలు చూస్తున్న వాళ్లకి చిరంజీవి కంటే ముందుగా ఆయనే రాజకీయాల్లోకి వస్తారేమోననే అభిప్రాయం సైతం కలుగుతోంది. దానికి తగ్గట్లు ‘కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ (సిఎంపిఎఫ్) అనే సామాజిక సంస్థని ఆయన నెలకొల్పారు. కొద్ది రోజుల క్రితం ఆయన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) పట్ల ఆకర్షితుడవుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. కాగా ఆదివారం (డిసెంబర్ 1) ఉత్తర్ ప్రదేశ్ నుంచి కొంతమంది బిఎస్పి నేతలు హైదరాబాద్ వచ్చి, పవన్ కల్యాణ్‌ని కలిసి, చర్చలు జరిపినట్లు గాసిప్స్ బయటకు వచ్చాయి. ఆ నేతలు పవన్‌ని తమ పార్టీలో చేరాల్సిందింగా ఆహ్వానించారనీ, అందుకు కృతజ్ఞతలు వ్యక్త్యం చూస్తూనే, రాజకీయాల్లో చేరే విషయం గురించి తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పవన్ వారికి చెప్పినట్లు వినిపిస్తోంది. ‘సిఎంపిఎఫ్’ని చూసుకోవాల్సిన బాధ్యత తనమీద ఉందని కూడా ఆయన వారికి చెప్పినట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్న మాట.