చిరంజీవి పార్టీ పెడితే అందులో తాను చేరతానని ఇదివరకే హాస్య నటుడు బ్రహ్మానందం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్న వాళ్లలో తాను ముందు వరసలో వుంటానని కూడా ఆయన చెప్పారు. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చిరు పార్టీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు అంతర్గత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అవకాశమిస్తే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఆయన ఆశిస్తున్నారు. అత్తిలి బ్రహ్మానందం స్వస్థలం కావడం గమనించదగ్గ విషయం. కమెడియన్గా తనకు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ వుంది కనుక చిరు పార్టీలో తనకు ఎంతో కొంత ప్రాధాన్యత లభిస్తుందనే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది. పార్టీ తరపున మిగతా ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి కూడా ఆయన సుముఖంగా వున్నారు.