Bhale Dongalu Telugu Review

Rating: 2.75/5

Critic Rating: (2.75/5)

‘భలే దొంగలు’ పర్వాలేదనిపించారు!

దొంగల సినిమా అంటే కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్. రెగ్యులర్ కామెడీ హీరోలు చేసే సినిమాలు ఒక రకం. అదే.. ప్రేక్షకుల్లో క్రేజీ ఇమేజ్ వున్న అందాల తార ఇలియానా, ఒకప్పుడు ‘నువ్వే కావాలి’ వంటి సినిమాతో గ్రాండ్‌గా హీరో అయిన తరుణ్ కలిసి అలాంటి దొంగలుగా నటిస్తే.. అదింకా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ‘భలే దొంగలు’ సరిగ్గా అలాంటి ఆసక్తికర చిత్రమే. అయితే దీన్ని రీమేక్ అనాలా, ఫ్రీమేక్ అనాలా? ‘భలే దొంగలు’కి తనే కథ సమకూర్చానని దర్శకుడు విజయభాస్కర్ టైటిల్స్‌లో ప్రకటించుకున్నాడు. కానీ కొన్ని పాత్రలు కలిపినంత మాత్రాన, కొన్ని సన్నివేశాలు మార్చినంత మాత్రాన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘బంటీ ఔర్ బబ్లీ’ ప్రధాన కథ తనదై పోతుందా? ‘భలే దొంగలు’ నిస్సందేహంగా ‘బంటీ ఔర్ బబ్లీ’ కథేనని మెడకాయ మీద తలకాయ వున్నవాడెవడైనా చెబుతాడు. అలాంటప్పుడు ఆ కథ తనదేనని బుకాయించడం సబబేనా? ఆ సంగతలా వుంచితే ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరుణ్, ఇలియానా జోడీ ‘భలే దొంగలు’గా రాణించారా?
కథ:

తండ్రి ఉద్యోగంలో చేరమన్నందుకు అలిగి రాము (తరుణ్), ఇంట్లోవాళ్లు తనకి వద్దంటున్నా పెళ్లి చేయాలనుకుంటున్నందుకు కోపంతో జ్యోతి (ఇలియానా) పెద్దలకి చెప్పా పెట్టకుండా ఒక రాత్రివేళ ఒకే రైలెక్కుతారు. ఒకే బోగీలో తారస పడతారు. తెల్లారేసరికి ఇద్దరి బ్యాగులూ మాయమవుతాయి. విశాఖపట్నం వెళతారు. అక్కడ జరిగే మిస్ ఇండియా సెలెక్షన్స్‌లో పాల్గొనాలనేది జ్యోతి ఆశయం. కానీ అక్కడామెకు ప్రవేశం లభించకపోగా అవమానం ఎదురవుతుంది. అడుగడుగునా వారికి మోసగాళ్లు ఎదురవుతారు. దాంతో తాము కూడా అలాగే మారాలనుకుంటారు రాము, జ్యోతి. కలిసి మోసాలు, దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. హైదరాబాద్‌కు వచ్చి ‘బంటీ ఔర్ బబ్లీ’ మాదిరిగా ‘రోమియో అండ్ జూలియెట్’ అవతారాలెత్తుతారు. కరడుగట్టిన డ్రగ్స్ వ్యాపారి, స్మగ్లర్ అయిన వీర్రాజు (ప్రదీప్ రావత్)ను సైతం మోసంచేసి, అతని ఆగ్రహానికి గురవుతారు. రోమియో జూలియట్‌ల వల్ల మోసపోయినవాళ్లు ఇచ్చే ఫిర్యాదులు ఎక్కువైపోతాయి. వారిని పట్టుకోవడానికి డిసిపి యుగంధర్ (జగపతిబాబు) నడుం బిగిస్తాడు. ఓవైపు అతను, మరోవైపు వీర్రాజు మనుషులు తరుముతుంటే రోమియో జూలియెట్‌లు ఏం చేశారు? వారు ఎవరి చేతికైనా చిక్కారా? పరస్పరం ఆకర్షితులైన వారి జీవితాలు చివరికేమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:

ఈ కథ చదివాక ఇది ‘బంటీ ఔర్ బబ్లీ’ కాదని ఎవరైనా అనగలరా? కాకపోతే హిందీలో లేని విలన్ వీర్రాజు తెలుగులో దర్శనమిస్తాడు. హీరో హీరోయిన్లు, పోలీసాఫీసర్ పాత్రలు సరిగ్గా అవే. హీరో హీరోయిన్లు ఇంట్లోంచి పారిపోయే కారణాలు అవే. హిందీలో మాదిరిగానే మొదట్లోనే పాట వస్తుంది. సరిగ్గా అందులో మాదిరిగానే ఆ పాటలోనే హీరోయిన్ ఇంట్రడక్షన్. హీరోయిన్ మిస్ ఇండియా సెలక్షన్‌కి వెళ్లడం, అక్కడామెకు ప్రవేశం లభించక పోవడం, పోలీసాఫీసర్ హీరో హీరోయిన్ల కోసం వెతుకుతూ ఒక బార్‌కి రావడం, ‘కజ్రారే’ తరహాలో ఒక పాట రావడం వంటివన్నీ ‘బంటీ ఔర్ బబ్లీ’ మాదిరే. కానీ టైటిల్స్‌లో ఎక్కడా ఆ సినిమాకు క్రెడిట్ ఇవ్వలేదు. హీరో హీరోయిన్లు మోసాలు చేసే తీరు, సన్నివేశాలు మాత్రం కొద్దిగా మార్చారు. ఒరిజినల్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. చివరిలో బబ్లీ గర్భవతై, ఒక బిడ్డను కంటుంది. పోలీసాఫీసర్ తమను అరెస్ట్ చేసినప్పుడు జైలు తప్పదని అర్ధమయ్యాక బిడ్డను చేతిలో పెట్టుకుని, ఆ బిడ్డ భవిష్యత్తు తలచుకుని బంటీ, బబ్లీ కన్నీరు కారుస్తుంటే చలించిపోయిన పోలీసాఫీసర్ వారిని విడిచి పెట్టేస్తాడు. ఆ సన్నివేశాల్ని దర్శకుడు విజయభాస్కర్ మార్చాడు. ఇందులో రోమియో జూలియెట్‌లు మధ్యలో పెళ్లి చేసుకోరు. కాబట్టి జూలియెట్ గర్భవతి అయ్యే సీను లేదు. హీరో హీరోయిన్లు మధ్యలో పెళ్లి చేసుకుని, హీరోయిన్ గర్భవతై బిడ్డను కంటే అది.. తెలుగు ప్రేక్షకులకు నచ్చదనో లేదంటే హీరోయిన్ ఇమేజ్‌కు అది భంగం కలిగిస్తుందనో ఆ సన్నివేశాల్ని తీసేశాడు దర్శకుడు. నిజానికి బిడ్డను చేతిలో పెట్టుకుని బంటీ, బబ్లీ దుఃఖించే సన్నివేశం మంచి సెంటిమెంటును పండించి, పోలీసాఫీసర్ హృదయాన్ని కరిగించింది. తెలుగులో రోమియో జూలియెట్‌లను పోలీసాఫీసర్ వదిలేసే సన్నివేశం పండలేదు. ఎన్నో దుర్మార్గాలు చేసిన వీర్రాజు అనేవాడు బయట హాయిగా ఉంటే మీరు జైలులో వుండటం నాకు నచ్చలేదంటూ రోమియో జూలియెట్‌లను యుగంధర్ వదిలేస్తాడు. అయితే రోమియో జూలియెట్‌లు తాము మోసంతో సంపాదించిన డబ్బును మూత్రపిండాలు చెడిపోయిన ఒక చిన్నారి పాప ఆపరేషన్ కోసం ఇవ్వడం మాత్రం బాక్సాఫీసు మంత్రమే. హీరో హీరోయిన్ల దొంగతనాలు, మోసాలకు ఒక మానవీయ కోణం జోడించాలనే ఆలోచన చేసినందుకు దర్శకుణ్ణి అభినందించాలి. అంతేకాదు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ఆయన అదనంగా ఒక కామెడీ ట్రాక్ సృష్టించారు. అది బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, హేమ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ. అందులో కొత్తదనం లేకపోయినా ప్రేక్షకులకి అది రిలీఫ్‌నిస్తుంది.
ప్రథమార్ధంలో ప్రేక్షకుల్ని అలరించే సన్నివేశాలు తక్కువ. సన్నివేశాల చిత్రీకరణ, వాటి కూర్పు ఆసక్తిని కలిగించలేక పోయాయి. ఆ లోటును ద్వితీయార్ధంతో పూడ్చుకోగలిగాడు విజయభాస్కర్. యుగంధర్ రంగం మీదికొచ్చాక కథనం ఊపందుకుంది. సినిమాకి విలన్ లేకపోతే తెలుగు ప్రేక్షకులు హర్షించరనే పాయింటుని దర్శకుడు బాగానే క్యాచ్ చేశాడు. వీర్రాజు పాత్ర రావడం వల్ల సెకండాఫ్ ఎఫెక్టివ్‌గా తయారయ్యింది. అయితే వీర్రాజు వంటి కిరాతకుడు తనముందు పసికూన వంటి రోమియోకు లోకువయ్యే సన్నివేశాలే హాస్యాస్పదం. తనకు కొకైన్ అమ్మడానికి వచ్చిన రోమియోకు అతడు 20 లక్షలిచ్చి పంపడమెందుకు? అతడికి ఆ కొకైన్ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవడానికి తన మనుషుల్ని పెట్టడమెందుకు? ఆ కొకైన్ ఎక్కడినుంచి వచ్చిందో చెప్పకపోతే ఖతం చేస్తానని బెదిరిస్తే అయిపోతుంది కదా. అంతటి కిరాతకుడికి ఆ పని చేయడం ఎంత సులభం! దర్శకులకి ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్కులు తట్టవు. జ్యోతి అలియాస్ జూలియెట్ పాత్ర మీద ఎక్కువ దృష్టిపెట్టి ఆ పాత్రని ఆకర్షకంగా మలచడం ప్రయోజనం చేకూర్చింది. ధర్మవరపు, బ్రహ్మానందం కామెడీ అలరిస్తుంది.
పాత్రధారుల అభినయం:

రాము అలియాస్ రోమియోగా తరుణ్ బాగానే చేశాడు. హావభావ ప్రదర్శనలో పరిణతి చూపించాడు. కాకపోతే ఒక బెత్తెడు పొడవుంటే బాగుండేదనిపిస్తుంది, ఇలియానా సరసన చూశాక. జ్యోతితో వియోగాన్ని భరించలేననే సంగతిని వెల్లడించే సన్నివేశాల్లో అతను బాగా ఆకట్టుకున్నాడు. జ్యోతి అలియాస్ జూలియెట్‌గా ఇలియానా రాణించింది. ఆ పాత్రలోని అమాయకత్వాన్నీ, అల్లరితనాన్నీ బాగా ప్రదర్శించింది. రోమియో పట్ల అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని చక్కగా చేసింది. ఆమె గ్లామర్ సినిమాకి ఖచ్చితంగా ఎస్సెట్. కానీ పాటలు సహా కొన్నిచోట్ల ఆమెకి కాస్ట్యూమ్స్ నప్పలేదు. డిసిపి యుగంధర్ పాత్రని జగపతిబాబు బాగా చేశాడు. ఆ పాత్రలోని ఎగ్రెసివ్‌నెస్‌నీ, స్పీడునీ సమర్ధంగా ప్రదర్శించాడు. ఒరిజినల్‌లో అమితాబ్ చేసిన పాత్ర అనే సంగతి మర్చిపోతే ఆ పాత్రకు జగపతి న్యాయం చేశాడని చెప్పాలి. ప్రదీప్ రావత్ విలనిజం గురించి కొత్తగా చెప్పుకోవలసింది లేదు. వీర్రాజు పాత్రని సమర్ధంగా పోషించాడు. మన్మథరావుగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమాలో ఎక్కువపాళ్లు వినోదాన్ని అందించింది ఆయనే. ఇలియానాతో ఆయన సన్నివేశాలు నవ్వులు పంచాయి. హెడ్ కానిస్టేబుల్ వెంగళరావుగా బ్రహ్మానందం, టాక్సీ డ్రైవర్‌గా సునీల్ తమ పాత్రల్ని రక్తి కట్టించారు. హెరో తల్లిదండ్రులుగా చంద్రమోహన్, సుధ, హీరోయిన్ తల్లిదండ్రులుగా జివిఎల్, సన, నాయనమ్మగా అన్నపూర్ణ కొద్దిసేపు కనిపిస్తారు.

టెక్నీషియన్ల పనితనం:

‘బొమ్మరిల్లు’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన అబ్బూరి రవి రాసిన సంభాషణలు కొన్ని సన్నివేశాల్లో అతి సాధారణంగా అనిపించినా చాలా చోట్ల అలరించాయి, నవ్వించాయి. జగపతిబాబు, ధర్మవరపులకు రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. సినిమాకు దన్నుగా నిలిచినవి మాత్రం సినిమాటోగ్రఫీ, సంగీతం. జగన్ అనే నూతన సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాతో వెలుగులోకి వచ్చాడు. సన్నివేశాల్ని అర్ధం చేసుకుని అందుకు తగ్గట్లుగా కెమెరాని అతను పరుగెత్తించాడు. ఒక పాటలో అతను ఉపయోగించిన కలర్ స్కీమ్ కొత్తగా అనిపించింది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్న కె.ఎం. రాధాకృష్ణన్ ఒరిజినల్లోని కొన్ని ట్యూన్లని వాడుకుంటూ అందించిన సంగీతం ఆకట్టుకుంది. కనీసం సగం పాటలు అలరించాయి. జగపతి, తరుణ్‌లతో ఛార్మి ఐటమ్ సాంగ్ బోనస్. రీ రికార్డింగ్ కూడా సమయోచితంగా సాగింది. ఫస్టాఫ్ సాధారణంగా రావడానికి ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్, కథకుడు విజయభాస్కర్ ఇద్దరూ బాధ్యులే. దాన్ని సెకండాఫ్‌తో మరిపించారు.

బలాలు, లోపాలు:

ఇలియానా గ్లామర్, జగపతిబాబు పాత్ర, ఆయన నటన, వినోదభరిత సన్నివేశాలు, ద్వితీయార్ధం, సంగీతం, సినిమాటోగ్రఫీ బలాలు. నీరసించిన ప్రథమార్ధం, ఎఫెక్టివ్‌గా లేని కథనం, సాధారణంగా వున్న క్లైమాక్స్ లోపాలు. ‘బంటీ ఔర్ బబ్లీ’ని చూసి, దానితో బేరీజు వేసేవాళ్లని మినహాయిస్తే ఓవరాల్‌గా ‘భలే దొంగలు’ ఓ మోస్తరుగా ఇటు యువతకూ, అటు ఫ్యామిలీ ప్రేక్షకులకూ వినోదాన్ని పంచి పెడుతారని ఆశించవచ్చు.
…యజ్ఞమూర్తి

Give your rating:

We would like to hear your comments below: