Bhadradri

Rating: 2.50/5

Critic Rating: (2.50/5)

బరువెక్కువైన ‘భద్రాద్రి’

శ్రీహరికి బి, సి కేంద్రాల ప్రేక్షకులే మొదట్నించీ బలంగా వుంటూ వస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు దానికి దోహదం చేశాయి. దానివల్ల ఆయనకు బాల్కనీ తరగతి దూరమయ్యింది. ‘ఎ’ కేంద్రాల్లో ఆయనను పట్టించుకునేవాళ్ల సంఖ్యా తక్కువే. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ఢీ’ సినిమాలు చేశాక ఆయనకు ఈ సంగతి బాగా అవగాహనకు వచ్చింది. ఆ రెండు సినిమాలు అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధించాయి. అయితే వాటిలో ఆయన హీరో కాదు. హీరోయిన్‌కు అన్న. అందుకే తను హీరోగా నటించే సినిమాలు కూడా అన్ని తరగతుల్ని ఆకట్టుకునేలా వుండాలని ఆయన కోరుకుంటున్నారు. దానిలో భాగంగా ఆయన చేసిన తొలి సినిమా ‘భద్రాద్రి’ అని చెప్పాలి. కేవలం మాస్‌నే గాక ఫ్యామిలీ ప్రేక్షకుల్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ సినిమాని చేశారు. ఎన్నడో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘అభిమన్యు’కి దర్శకత్వం వహించిన మల్లికార్జున్ ఈ సినిమాకి దర్శకుడు. రాజా కూడా ఒక పాత్ర చేసిన ఈ సినిమా మార్చి 6న విడుదలైంది.

కథ:

తమ వూరు భద్రాద్రి కోసం ప్రాణాలైనా ఇచ్చే కుటుంబం రఘురామ్ (శ్రీహరి)ది. ఒకసారి బ్లో ఔట్ సంభవించి భద్రాద్రిలో చాలామంది మాడి మసైపోతారు. పొలాలన్నీ బీళ్లవుతాయి. జనం ఊరు వదిలి వెళ్లిపోతుంటే రఘురామ్ తండ్రి (రంగనాథ్) వారిని ఆపి, పక్క ఊరిలో తనకున్న 60 ఎకరాల పొలాన్ని వారికిచ్చి సేద్యం చేసుకోమంటాడు. ఆ తర్వాత తెలీని జబ్బేదో సోకి అక్కడ 20 మంది పిల్లలు చనిపోతారు. తమ వూరికి ఒక డాక్టర్‌ను పంపమని ఆరోగ్యమంత్రి (జయప్రకాష్‌రెడ్డి)ని వేడుకుంటాడు రఘురామ్ తండ్రి. కానీ ఫలితం వుండదు. దాంతో ఊరి బాగుకోసం ఆయన ఆత్మాహుతి చేసుకుంటాడు. ఊరిజనం కోసం తమ్ముడు చందు (బాలాదిత్య)ని మెడిసిన్‌లో చేర్పిస్తాడు రఘురామ్. తన ఊరిపిల్లలు బ్లో ఔట్ వల్ల చనిపోలేదనీ వారు చనిపోవడానికి కారణం బ్లో ఔట్ జరిగినప్పుడు నెక్స్ జెన్ అనే మందుల కంపెనీ ఇచ్చిన మందులే కారణమనీ చందు కనిపెడతాడు. ఈ సంగతి బయటి ప్రపంచానికి తెలీకుండా ఆ కంపెనీ యజమాని శంకర నారాయణ (ముఖేష్ రుషి), ఆరోగ్యమంత్రీ కలిసి చందుని హత్యచేసి, దాన్ని ల్యాబ్‌లో జరిగిన ప్రమాదంగా చిత్రీకరిస్తారు. ఆ సంగతి రఘురామ్‌కీ, చందు స్నేహితులకీ తెలుసుంది. చందుకి సన్నిహిత స్నేహితుడైన సిద్ధు (రాజా) సహకారంతో రఘురామ్ తన తమ్ముణ్ణి చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? చావుకు దగ్గరగా వున్న తన ఊరివాళ్లని ఎలా రక్షించుకున్నాడు? అనేది మిగతా కథ.

కథనం:

ఇటీవలి కాలంలో కాస్త అర్ధవంతమైన, బలమైన కథతో వచ్చిన సినిమా ‘భద్రాద్రి’. కాకపోతే అనవసరంగా సాగదీయడం వల్ల అది కాస్త బరువుగా తయారయ్యింది. ఒకవైపు తన తమ్ముడు చావుకి కారణమైన వాళ్లని చంపి ప్రతీకారం తీర్చుకోవడం తన లక్ష్యం కాదనీ, తన వూరివాళ్ల జబ్బుని నయం చేయడమే తన ధ్యేయమనీ చెప్పిన రఘురామ్ దానికి విరుద్ధంగా తన తమ్ముణ్ణి చంపిన వాళ్లని ఉద్దేశపూర్వకంగా చంపుతూ రావడం స్క్రీన్‌ప్లే లోపం. అతడు ప్రాణాలతో విడిచిపెట్టేది ఒక్క ఆరోగ్యమంత్రిని మాత్రమే. తొలి సన్నివేశాల్లోనే ముంబైలోని జైల్లో వున్న ఒక ఆరోగ్యశాఖ అధికారి (ప్రభాకర్)ని రఘురామ్ చంపుతాడు. ఆ అధికారి ముంబై జైల్లో ఎందుకున్నాడన్న దానికి సమాధానం మనకి సినిమాలో ఎక్కడా దొరకదు. హీరో ముంబైకెళ్లి ఒక ‘హీరోచిత’ కార్యం చేశాడని చూపించాలి కాబట్టి ఆ సన్నివేశాన్ని అక్కడ సృష్టించారు. ముంబైలో రఘురామ్ చేతుల్లో భంగపడ్డ పోలీసులు మళ్లీ అతడికోసం వెతికితే ఒట్టు. చందు చావుకు కారణమైన మరో అధికారి (బెనర్జీ)ని కూడా అతడి ఆఫీసుకెళ్లి మరీ చంపుతాడు రఘురామ్. అప్పుడు కూడా పోలీసులు స్పందించరు. ఆరోగ్యమంత్రిని చంపినట్లు సీను సృష్టించి, అతణ్ణి రఘురామ్ కిడ్నాప్ చేసినప్పుడు పోలీసులు సీనులోకి వస్తారు. ఆ వచ్చేది కూడా రణబీర్‌సింగ్ రాథోడ్ (బ్రహ్మానందం) అనే విదూషకుడి తరహా పోలీసాఫీసర్. ఆరోగ్యమంత్రి అంతటివాడు హత్యకు గురైతే ప్రభుత్వం, పొలీసు వ్యవస్థ ఎంత తీవ్రంగా రియాక్ట్ అవుతాయి? ఈ సినిమాలో అటువంటి హడావుడి అసలు కనిపించదు. సినిమా అని సరిపెట్టుకోవాలి. తను కనుగొన్న రహస్యాన్ని చందు మొదట ఎవరికి చెప్పాలి? తన స్నేహితులకు, లేదంటే తమ కాలేజీ యాజమాన్యానికి. కానీ అతను ఆరోగ్యశాఖ కార్యాలయానికొచ్చి వాళ్లకి చెబుతాడు. ద్వితీయార్ధం దర్శకుడు సినిమాని కనీసం 20 నిమిషాలు సాగదీశాడు. ఆరోగ్యమంత్రిని కిడ్నాప్ చేశాక క్లైమాక్స్ వచ్చినట్లయితే కథనంలో బిగువు కొనసాగేది. అలా చేయకుండా సన్నివేశాల్ని పొడిగించుకుంటూ పోవడంవల్ల చివరికొచ్చేసరికి చికాకు కలుగుతుంది. ఆ సమయంలో శ్రీహరి ఐదు నిమిషాలు ఆగకుండా చెప్పే డైలాగులు ఇంకో పరీక్ష. సందేశం కోసం ఉపన్యాసం ఇస్తే వినే రోజులు పోయి చాలాకాలమే అయ్యింది. సందేశాన్ని మాటల రూపంలో కాకుండా దృశ్యరూపంలో ఇస్తేనే ఎఫెక్టివ్‌గా వుంటుంది. భారీ డైలాగుల బలహీనతని శ్రీహరి తక్షణం మానుకోవాలి. శ్రీహరి తమ్ముడు బాలాదిత్య అనే సంగతి తెలిసి, అతను చనిపోయాక వచ్చే సన్నివేశాల్లో బరువు పెరిగిపోయింది. చందు చనిపోయాడనే సంగతిని కొద్దిసేపు ఎందుకు సస్పెన్స్‌లో పెట్టారో తెలీదు. రఘురామ్ తమ్ముడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాజాని చూపించి, అతడే రఘురామ్ తమ్ముడనే అభిప్రాయం కలిగించాల్సిన అవసరం లేదు. రఘురామ్‌ని చంపుతానికంటూ వచ్చే గజాలా గ్రూపు ప్రహసనం అర్ధరహితం. దాన్ని వినోదం కోసం వుపయోగించాలనుకున్నాడు దర్శకుడు. కానీ అది ఫుల్‌ఫిల్ కాలేదు. ఎమ్మెస్ నారాయణ వంటి గొప్ప టైమింగ్ వున్న కమెడియన్‌ని వృథాచేశారు. రఘురామ్ మీద కక్షతో రగిలే సింగరాజు (బ్రహ్మాజీ) పాత్ర ప్రయోజనం శూన్యం.

పాత్రధారుల అభినయం:

భద్రాద్రి క్షేమం కోసం అహరహం శ్రమించే రఘురామ్‌గా శ్రీహరి ప్రమాణాలకు తగ్గట్లు నటించారు. యాక్షన్ హీరోగా తనకున్న ఇమేజ్‌కి తోడు ఫ్యామిలీ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునేందుకు ఆయన యత్నించారు. తమ్ముడి సెంటిమెంటు అందుకు తోడ్పడింది. భావోద్వేగపూరిత సన్నివేశాల్లో ఆయన బాగా రాణించారు. చివరి సన్నివేశాల్లో ఆయన హావభావాలు ఉన్నత స్థాయిలో వున్నాయి. పాటల్లో మాత్రం తనకు పనికిరాని డాన్సులతో కాస్త ఇబ్బందిపెట్టారు. సిద్ధు పాత్రలో సైడ్ హీరోగా రాజా సరిపోయాడు. శ్రీహరి, అతను కలిసి కనిపించిన అన్ని సన్నివేశాల్లోనూ అతడి ప్రాధాన్యం సెకండరీయే. శ్రీహరిని చంపడానికంటూ వచ్చి ఆయన ప్రేమలో పడే పాత్రలో గజాలా మెప్పించలేకపోయింది. ఆమెలో మునుపటి కళ కనిపించలేదు. ఆమెకంటే రాజా సరసన చేసిన నిఖిత కాస్త బెటర్. గ్లామర్ ప్రదర్శనకన్నా పనికివచ్చింది. శ్రీహరి తమ్ముడిగా తక్కువ నిడివి పాత్రయినా బాలాదిత్య ఆకట్టుకున్నాడు. అతడికి జోడీగా సైరాబాను చక్కగా వుంది. ఆరోగ్యమంత్రిగా జయప్రకాష్‌రెడ్డి, శంకరనారాయణగా ముఖేష్ రుషి విలనీని పండించారు. వేణుమాధవ్, గీతాసింగ్ జోడీ నవ్వించింది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ ఆ పని చేయలేకపోయారు.

టెక్నీషియన్ల పనితనం:

స్వామీజీ విజయ్ స్క్రీన్‌ప్లేకంటే సంభాషణలు మెరుగ్గా వున్నాయి. అయితే క్లైమాక్స్‌లో శ్రీహరి చేత ఉపన్యాసం ఇప్పించకుండా వుంటే బాగుండేది. సన్నివేశాలు ఎక్కువవడం వల్ల సెకండాఫ్ బోర్ కలిగించింది. మణిశర్మ పాటలకిచ్చిన బాణీలకంటే, రీ రికార్డింగ్ ఆకట్టుకుంది. ఊరికోసం శ్రీహరి పాడే పాట బాగుంది. భరణీ కె. ధరన్‌కి సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరుంది. కానీ ఈ సినిమాలో చాలా సన్నివేశాల్లో లైటింగ్ డల్‌గా కనిపించింది. అది కెమెరా లోపమా లేక ఫిల్మ్ లోపమా? యాక్షన్ సన్నివేశాలు, ఒకట్రెండు పాటల్లో మాత్రమే కెమెరా పనితనం మెప్పించింది. రామ్‌లక్ష్మణ్ స్టంట్స్ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. గౌతంరాజు ఎడిటింగ్ సాధారణ స్థాయిలో వుంది.

బలాలు, లోపాలు:

శ్రీహరి పాత్ర, ఆయన నటన, కథాంశం, తమ్ముడి సెంటిమెంటు, రీ రికార్డింగ్, ఫైట్స్ బలాలు. సెకండాఫ్ సాగతీతకు గురవడం, క్లైమాక్స్ ఎఫెక్టివ్‌గా లేకపోవడం, పాటలు, సినిమాటోగ్రఫీ అతి సాధారణంగా వుండటం, వినోదం ప్రమాణాలకు తగ్గ స్థాయిలో లేకపోవడం లోపాలు. ఏతావాతా ఈ శ్రీహరి సినిమా కూడా బి, సి ప్రేక్షకుల్నే ఒకింత ఆకట్టుకునే అవకాశాలున్నాయి.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: