రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ వంటి నందమూరి వారసులు ప్రచారం చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి మనకు తెలుసు. అయితే రాజకీయాల కంటే కెరీర్ మీదే ఎక్కువ దృష్టి పెట్టమని ఎన్టీఆర్‌కు బాబాయ్ బాలకృష్ణ సలహా ఇచ్చినట్లు ఆ కుటుంబ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ సినిమా ‘కంత్రి’ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతున్నదని వసూళ్లు తెలియజేస్తున్నాయి. తొలి వారంలో బాగానే వసూళ్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆ వసూళ్లు భారీగా పతనమవుతూ వచ్చాయి. బయ్యర్లకు ఈ సినిమా లాభాలు తీసుకు రావడం కష్టమని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కలిసిన జూనియర్ని ఇప్పుడే రాజకీయాల సంగతి తలపెట్టవద్దని బాలయ్య సలహా ఇచ్చారు. సినీ రంగంలో ఎంతో భవిష్యత్తు వున్నందున చిన్న వయసులోనే రాజకీయల పట్ల ఆసక్తి చూపించడం సినీ కెరీర్‌కు నష్టం కలిగిస్తుందని, అందువల్ల కెరీర్‌ని మరింత వృద్ధి చేసుకోవడం మీద దృష్టి పెట్టమనీ ఎన్టీఆర్‌కు ఆయన సూచించినట్లు ఆ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి బాబాయ్ మాటల్ని అబ్బాయ్ పాటిస్తాడో, లేదో చూద్దాం.