దుందుడుకు నిర్మాతగా టాలీవుడ్ సర్కిల్స్‌లో పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సురేష్ ప్రస్తుతం తరుణ్, ఇలియానా జంటగా ఓ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. లక్ష్మీదేవి ప్రొడక్షన్స్ బానర్‌పై కె. విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ బంజారాహిల్స్‌లో జరుగుతోంది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘బంటీ ఔర్ బబ్లీ’ అధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో జపతిబాబు ప్రత్యేక పాత్రను (హిందీలో అమితాబ్ చేసిన పాత్ర) చేస్తున్నాడు. ‘శివాజీ’ సినిమా తెలుగు హక్కుల్ని అత్యధిక రేటుకు కొని, ఆమధ్య వార్తల్లో నిలిచిన ఆయన తాజా సినిమాలో నటిస్తున్నందుకు ఇలియానాకు దాదాపు కోటి రూపాయలు చెల్లిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఆయన ‘దేవా’ అనే డబ్బింగ్ సినిమాని విడుదల చేశారు. సూర్య, అసిన్ నటించిన ఆ సినిమా సరిగా ఆడలేదు. ఇకనుంచీ డబ్బింగ్ సినిమాలకు దూరంగా వుండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే రీమేక్స్ మాత్రం కొనసాగిస్తారు. కాగా తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా నిర్మించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారమవుతోంది. బాలకృష్ణకు వీరాభిమాని ఆయిన సురేష్ ఇదివరకు ఆయనతో ‘చెన్నకేశవరెడ్డి’, ‘లక్ష్మీనరసింహా’ సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల వల్ల ఆ ఇద్దరూ దూరమయ్యారు. అయితే కొంతకాలంగా తిరిగి వారిమధ్య పూర్వ పరిస్థితులు నెలకొంటున్నాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బాలయ్యతో మళ్లీ సినిమా తీస్తానని ఇదివరకే బెల్లంకొండ ఓ సందర్భంలో చెప్పారు. బాలయ్య ప్రస్తుతం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రంగడు పాండురంగడు’ సినిమాని చేస్తున్నారు. దాని తర్వాత ఆయన బెల్లంకొండతో పనిచేసే అవకాశాల్ని తోసిపుచ్చలేం. అయితే ఆ సినిమాకి బెల్లంకొండ పరోక్ష నిర్మాతగా ఉంటారా, లేక ప్రత్యక్ష నిర్మాతగా కనిపిస్తారా అనేది చూడాలి.