దర్శక నిర్మాత ఇవివి సత్యనారాయణ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ కెరీర్ సందిగ్ధంలో పడిపోయింది. వంశీ దర్శకత్వంలో నటించిన ‘అనుమానాస్పదం’ సినిమా కూడా అటకెక్కడంతో అతనితో సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అతడికి హీరోగా కెరీర్ ఇవ్వాలని స్వయంగా ఇవివి శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ఆయన చిన్న కుమారుడు నరేష్‌కు ఎడాపెడా ఆఫర్లు వస్తున్నాయి. కామెడీని పండించడంలో పరిణతి సాధించడం వల్ల భవిష్యత్ రాజేంద్రప్రసాద్ అంటూ ఇప్పటికే అతనికి గుర్తింపు వచ్చేసింది. ఆరేళ్ల క్రితం ‘అల్లరి’తో పరిచయమైన నరేష్ అప్పుడే పాతిక సినిమాల్లో నటించేశాడు. ‘కితకితలు’, ‘అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ’, ‘సీమశాస్త్రి’, ‘గమ్యం’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘గమ్యం’ నటుడిగా నరేష్‌కు చాలా పేరు తెచ్చింది. తమ్ముడి సక్సెస్ చూసి రాజేష్ మరింతగా మధనపడుతున్నాడని టాలీవుడ్ అంతర్గత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి రూపం ప్రకారం చూస్తే నరేష్ కంటే రాజేష్ స్ఫురద్రూపి. నరేష్ మాదిరే పొడగరి కూడా. అయినా అతను చేసిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో అతని కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. త్వరలో రాజేష్‌తో ఒక సినిమాను తీస్తానని ఇవివి చెప్పి యేడాది గడిచినా ఇంతవరకు అది కార్య రూపం దాలచలేదు. తను సంపాదిస్తున్నది కొడుకుల కోసమే కాబట్టి వారిని జీవితంలో నిలబెట్టడానికే దానిని ఖర్చు పెడుతున్నానని ఇవివి అంటారు. ఒక తండ్రిగా ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తూ నరేష్ మాదిరిగానే రాజేష్‌కు కూడా కెరీర్‌ని ఇవ్వాలని తపిస్తున్నారు. అయితే ఆరేళ్లుగా కృషి చేస్తున్నా తనకు సక్సెస్‌లు రాకపోవడంతో రాజేష్ నిరాశా నిస్పృహలతో బాధపడుతున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పెళ్లి చేస్తేనైనా అతడు ఆ పరిస్థితి నుంచి బయటకొస్తాడేమోనని ఇవివి భావిస్తున్నట్లు సమాచారం. బహుశా త్వరలోనే ఇవివి ఇంట పెళ్లిబాజా మోగే అవకాశాలున్నాయి.