Apadamokkulavadu

Rating: 1.50/5

Critic Rating: (1.50/5)

తరిమికొట్టే ‘ఆపద మొక్కులవాడు’

అతి పాత్రలతో తీసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ హిట్టయ్యేసరికి దర్శకునిగా మారిన రచయిత పోసాని కృష్ణమురళికి తనమీద తనకు అతి నమ్మకమైనా ఏర్పడి ఉండాలి, లేదా జనం పట్ల చులకన భావమన్నా కలిగి ఉండాలి. అందుకే అర్ధం పర్థం లేని ‘ఆపద మొక్కులవాడు’ అనే అబ్సర్డ్ సినిమా జనం మధ్యకి వచ్చింది. ఏ సినిమాకైనా ఓ ప్రయోజనమంటూ ఒకటుంటుంది. కేవలం వినోదాన్ని పంచడమూ ఓ ప్రయోజనమే. ఆ ప్రకారం చూస్తే.. ఏ ప్రయోజనమూ లేకపోగా, ‘ఆపద మొక్కులవాడు’ అనే చక్కని టైటిల్ పెట్టి కూడా జనాన్ని ఆపదలో నెట్టే సినిమా తీసిన ఘనత మాత్రం పోసానిదే. రచయితగా ఉన్నప్పుడు ఆవేశపూరిత సంభాషణలతో పేరు తెచ్చుకున్న పోసాని, దర్శకుడిగానూ అదే తరహా ధోరణిని అవలంబిస్తున్నాడు. తనలోని అతివాద భావాలకు సన్నివేశాల ద్వారా రూపమిచ్చి, వాటిని జనం మీద బలవంతంగా రుద్దే యత్నం చేస్తున్నాడు. ఒకటి లేదా రెండుసార్లు అది బాక్సాఫీసు వద్ద అనుకూల ఫలితమివ్వ వచ్చేమోగానీ, ప్రతిసారీ కాదు. ‘ఆపద మొక్కులవాడు’లో ప్రతి ప్రధాన పాత్రా అతిగా ప్రవర్తిస్తూ, అనవసరంగా మాట్లాడుతూ తలలో సూదులు గుచ్చుతుంది. ఎలాగంటే..

కథ:

రంగయ్యనాయుడు (నాగేంద్రబాబు) నిజాయితీ పరుడైన జడ్పీటిసి సభ్యుడు. అన్యాయాన్ని ఏ మాత్రమూ సహించని ధైర్యవంతుడు. అసెంబ్లీలో మంత్రులూ, ఎమ్మెల్యేలూ బూతులు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టులో కేసువేసి, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం సంపాదించి వారినందర్నీ ఏకి పారేస్తాడు. తమ ప్రాంతంలో వరద సహాయక పనులకోసం కేటాయించిన నిధులు ఎలా దుర్వినియోగ మయ్యాయో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి (రాయపాటి సాంబశివరావు) దృష్టికి తెస్తాడు. దాంతో ఆ అవినీతితో సంబంధం ఉన్న మంత్రి లోకేశ్వరరావు (తనికెళ్ల భరణి), అతని గ్యాంగ్ అంతా కక్షగట్టి రంగయ్యనాయుడు భార్య సహా అతని మనుషులనందర్నీ చంపేస్తారు. ఎస్‌పి రాజారెడ్డి (సాయికుమార్) సహకారంతో రంగయ్యనాయుడు దుష్ట సంహారం ఎలా చేశాడనేది మిగతా కథ.

కథనం:

అవినీతితో కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థని బాగు చేయాలనేది పోసాని ఆరాటం. ఆ వ్యవస్థని బాగుచేయడానికి పోరాటం చేయాలనే సంగతి చెప్పడానికి ఆయన సినిమాలు తీస్తున్నాడు. ఆశయం మంచిదే. కానీ ఆచరణ ఎలా ఉండాలి? ఖచ్చితంగా ‘ఆపద మొక్కులవాడు’లో చూపించిన విధంగా మాత్రం కాదని కాస్త వివేకం ఉన్నవారెవరైనా చెబుతారు. రంగయ్యనాయుడు పాత్రని దర్శకుడు చిత్రించిన తీరూ, దుష్ట సంహారం చేయడానికి ఆ పాత్రతో చేయించిన ఫీట్లూ ఏమాత్రం అర్ధవంతంగా గానీ, బాధ్యతాయుతంగా గానీ లేవు. ఆపాత్ర కృతకం.అది ప్రవర్తించే తీరు మరింత కృతకం, బాధ్యతారాహిత్యం.  కొన్ని కొన్ని సన్నివేశాలు దర్శకుడు ఎందుకు చిత్రీకరించాడో కూడా బోధపడని రీతిలో కలగాపులగంగా కనిపిస్తాయి. తొలి సన్నివేశమే అందుకు నిదర్శనం. పోలీస్ స్టేషన్‌లో పోలీసులనందర్నీ చావబాది తప్పించుకున్న రంగయ్యనాయుడు మార్చురీలో ఉన్న భార్య శవాన్ని తెచ్చుకుని, దానికి దహనక్రియలు జరిపిస్తుంటే ఫేక్ ఎన్ఔంటర్‌లో ఎస్‌పి రాజారెడ్డి అతన్ని తన రివాల్వర్‌తో కాల్చివేసినట్లు చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత టైటిల్స్ వస్తాయి. చిత్రమేమంటే సెకండాఫ్‌లో అదే రాజారెడ్డి ‘ఎన్‌కౌంటర్‌లో నువ్వు చనిపోయినట్లు అందర్నీ నమ్మిస్తాను” అని చెప్పే సీను అందుకు భిన్నంగా కనిపిస్తుంది. అక్కడ ఎన్‌కౌంటర్ సందర్భం, సన్నివేశం.. రెండూ భిన్నమైనవే. ఈ తప్పిదం దర్శకుడిదా, ఎడిటర్‌దా?

మధ్యమధ్యలో కథకి ఏమాత్రం సంబంధం లేని పాత్రలేవో వచ్చి, అసందర్భంగా మాట్లాడి పోతుంటాయి. అలాంటి సన్నివేశాలు కల్పించేది పరిపక్వత ఏమాత్రం లేని దర్శకుడే. ఓవైపు మన ముఖ్యమంత్రి మంచివాడని చెబుతూనే, హఠాత్తుగా, అసందర్భంగా ఓ పాత్ర చేత చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని చెప్పించాడు. దేశ రాజకీయ నాయకులనుంచి రాష్ట్ర నాయకులదాకా ఒక్కొక్కరిలోని ఒక్కో గుణాన్ని చిరంజీవికి ఆపాదించి ఆయన్ని కీర్తించాడు. ఆ డైలాగ్ వింటే అంతమంది గొప్ప నాయకులు ఎంతోమంది ఉంటే ఇంకా మరో నాయకుడు అవసరమా? అనే సందేహం కలగడం కద్దు. అదే కాదు. ఇంకోచోట దేవుడున్నాడా? లేడా? అనే అనవసర చర్చ కోసం ఓ సన్నివేశాన్ని తీసి, అందులో తన వ్యక్తిగత భావాల్ని రుద్దే యత్నం చేశాడు పోసాని. అందులో దేవుడున్నాడని వాదించే వ్యక్తిగా తనే కనిపించి, బాబాల్ని వెనకేసుకొచ్చాడు. మనిషి పుట్టుక విషయంలో డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తున్న ఈ సందర్భంలో తన సొంత భావాల్ని ఇలా మూర్ఖమైన పద్ధతిలో రుద్దాలని యత్నించడం సరైన పనికాదు. డబ్బుపెట్టి సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుంటే ఈ సన్నివేశాలు ఎంత అసంబద్ధమైనవో, అనవసరమైనవో అర్ధమవుతుంది.
ఆ సంగతలాఉంటే రంగయ్యనాయుడు ‘దేవుడు’లా వచ్చి, దుష్టుల్ని సంహరించడ మేమిటి? మనం ఉన్నది 21వ శతాబ్దంలోనేనా? లేక పురాణ కాలంలోనా? రంగయ్యనాయుడు ఎలా ప్రత్యక్షమవుతాడంటే.. ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి.. ఉరుములు ఉరుముతాయి. ఆకాశంలోని మెరుపు చమక్ చమక్‌మని భూమిమీదికి దిగుతుంది. ఒక జ్వాలగా వెలుగుతుంది. ఆ జ్వాల దేవుడిలా అస్పష్ట రూపంతో కదులుతుంది. ఒక్కోసారి అదే రూపంతో దుష్టుల తలల్ని పుచ్చకాయల్లా తెగ్గోస్తుంది. ఒక్కోసారి అది రంగయ్యనాయుడుగానూ మారిపోతుంది. ఎవరైనా ఆపదలో ఉన్నవాళ్లు ‘దేవుడా’ అని కేకవేస్తే చాలన్నమాట. ఎక్కడున్నా రంగయ్యనాయుడికి వినిపించేస్తుంది. ఇంకేముంది? మెరుపు దేవుడిలా ప్రత్యక్షమై, తన కరవాలంతో ఒక్కొక్కడి కుత్తుకలు తెగ్గోయడమే! రంగయ్యనాయుడా! మజాకా! ఈ ‘దేవుడి’ దెబ్బకి అవినీతి నాయకులందరూ తమ పాపపు సొమ్ముని ఎక్కడెక్కడి దేవుడి గుళ్లలోని హుండీలలో వేసి, పాప ప్రక్షాళన చేసుకుంటారు! బాగు బాగు. ‘ఆపద మొక్కులవాడు’ చూశాక మన రాజకీయ నాయకులు ఆ పనే చేయొచ్చేమో. ఎవరు చూడొచ్చారు! ఇందులో శీను అనేవాడు మరో రకం రాక్షసుడు. రాక్షసులకు మల్లే ఎప్పుడు పడితే అప్పుడు, అనాయాసంగా తన చేతులు, కాళ్లు తనే తెగ్గొట్టుకుని చిద్విలాసంగా నవ్వుతూ ఉంటాడు. డాక్టర్లు వాటిని అలవోకగా అతికించేస్తూ ఉంటారనుకోండి.. ఒకసారైతే పొడవాటి కత్తిని పిండి ముద్దలో గుచ్చినంత చులాగ్గా తన కడుపులోంచి వీపులోకి వచ్చేట్లు దించేసుకుని (మ్యాజిక్ కాదండోయ్) నవ్వుతుంటాడు.. ఎదురుగా కూర్చుని చూస్తున్న ప్రేక్షకుల వంక (పాపం పిచ్చివాళ్లన్నట్లా?) చూస్తూ. అయినా షరా మామూలే. వాడికేమీ కాదు. దేవుడికి బదులు ఈ రాక్షసుడన్నమాట. ‘దేవుడున్నాడు’ అని గట్టిగా తన నోటితోటే చెప్పిన పోసాని చివరకి వచ్చేసరికి ‘నువ్వు దేవుడిలాగే శాశ్వతంగా ఉండిపో. మనిషివని తెలిస్తే జనం మళ్లీ మారిపోతారు’ అని రంగయ్యనాయుడిని ఎస్‌పి అనేలా చేయడం.. దేవుడు ఉన్నాడని చెప్పడమా, లేనట్లు చెప్పడమా? దేవుడున్నాడని చెప్పినప్పుడు దుష్ట సంహారం చేస్తున్నది దేవుడనే చూపించాలి. కానీ దేవుడి పేరిట ఆ పనులు చేస్తున్నది రంగయ్యనాయుడే అని చూపడం వల్ల దేవుడి పాత్ర అందులో ఏమీ లేనట్లే. అంటే పోసానే పూర్తి కన్‌ఫ్యుజన్‌లో ఉన్నాడనేది స్పష్టం.

పాత్రధారుల అభినయం:

రంగయ్యనాయుడు అలియాస్ దేవుడు అలియాస్ ఆపద మొక్కులవాడు పాత్రలో నాగేంద్రబాబు బాగానే రాణించారు. దర్శకుడు ఆ పాత్రని ఎలా మలిచారో దానికి తగ్గట్లు న్యాయం చేశారు. ఈ పాత్ర కోసం ఆయన బరువుకూడా తగ్గినట్లు కనిపించింది. ఆయన భార్య శిరీషగా టీవీ తార అస్మిత నటించింది. ఎస్‌పి రాజారెడ్డి పాత్రని చేయడం సాయికుమార్‌కి నల్లేరుమీద నడక. ముఖ్యమంత్రి పాత్రలో రాయపాటి సాంబశివరావు విగ్రహపుష్టి పనికొచ్చింది గానీ హావభావ ప్రకటన, వాచకాల్లో ఎలిమెంటరీ స్కూలు విద్యార్థి. అవినీతి మంత్రి లోకేశ్వరరావుగా తనికెళ్ల భరణి ఇమిడిపోయారు. ప్రతిపక్ష నాయకుల పాత్రల్లో బాబూమోహన్, కోట శంకరరావు, మొత్తమ్మీద రెండుమూడు సార్లు మాత్రమే పెదవివిప్పి విచిత్రంగా ప్రవర్తించే శీను పాత్రలో శ్రీనివాస్, దుష్ట ఎమ్మెల్యేగా జాకీ, వెన్నుపోటు బాబాయిగా చలపతిరావు పాత్రలకి తగ్గట్లు నటించారు. టీవీ యాంకర్ ఉదయభాను ఓ ఐటమ్ సాంగ్‌ని హుషారుగా చేసింది.

టెక్నీషియన్ల పనితనం:

కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో పాస్ మార్కులు పొందలేక పోయిన పోసాని దర్శకుడిగానూ ఏమాత్రం రాణించని ఈ సినిమాలో సంభాషణలకి కొదవలేదు. ‘భద్ర’, ‘ఒక్కడున్నాడు’ వంటి సినిమాలకి పనిచేసిన కొరటాల శివ ఆ సంభాషణల బరువుని మీదికెత్తుకుని, జనాన్ని ఇబ్బంది పెట్టాడు. రాజకీయ ప్రసంగాల మోత ఎక్కువగా ఉండే సినిమాకి మాటలు రాయడం మాటలు కాదని అతనికి తెలిసివచ్చి ఉండాలి. లెనినా చౌదరి బాణీలు కట్టిన రెండు పాటలూ ఐటమ్సే. మరొకటి తరచూ రంగయ్యనాయుడి నేపథ్యంలో వినిపించే భావోద్వేగ పల్లవులు. రీరికార్డింగ్ సొద ఎక్కువ. ఎ. రాజా కెమెరా సన్నివేశాలకి తగ్గట్లే ఉంది. మొండెం నుంచి పుచ్చకాయల్లాగా ఎగిరి, నేలమీద బంతుల్లా తలలు ఎగిరిపడడంలో పనితనం చూపాడు.

బలాలు, లోపాలు:
మొత్తం లోపాలే కనిపించే ఈ సినిమాలో బలాల కోసం బూతద్దం పెట్టుకుని వెతకాలి. ఆకట్టుకునే పాత్ర ఒక్కటీ లేదు. కథ, కథనం, మాటలు, సన్నివేశాల కల్పన, ఎడిటింగ్.. వగైరా అన్నీ కట్టుకట్టుకుని లోపాలమయంగా తయారైన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశం ఒక్కటే.. మన రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో చూపించడం. థియేటర్‌లోంచి బయటకు వచ్చేప్పుడు ఓ ప్రేక్షకుడన్నాడు.. ‘గదిలో బంధించి ఒళ్లంతా కుళ్లబొడిచినట్లుంది’. అదీ విషయం.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: