మద్రాస్‌లోని కోవలం బీచ్‌లో ‘సితార ‘ షూటింగ్ జరుగుతుంటే వంశీని కలిసి అడ్వాన్స్ ఇచ్చారు నిర్మాత కామినేని ప్రసాద్. 1970 ప్రాంతాల్లో కృష్ణతో ‘ఇంటింటికథ ‘ సినిమా తీసారాయన. వైజాగ్‌లోని అప్సరా హోటల్ యజమాని చిన్నితో కలిసి వంశీతో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టారు.
ఇంతవరకూ సున్నితమైన భావుకత్వం ఉన్న అంశాలతో సినిమాలు చేసిన వంశీకి ఎందుకో థ్రిల్లర్ వైపు మనసు మల్లింది. ‘సితార ‘ విడుదలయ్యాక మచిలీపట్నంలో ఒక లాడ్జిలో కథ మీద కసరత్తు మొదలు పెట్టారు. ఆ తరువాత అరకులోయలోని ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో పదిహేను రోజులు ఉండి కథ మొత్తం సిద్ధంచేసారు.
వంశీ తన కథ పూర్తికాగానే తన గురువులా అభిమానించే ఇళయరాజాను కలిసారు. ఇద్దరూ సంగీత చర్చలకోసం మధురై బయలుదేరి వెళ్ళారు. ఆ ఊరికి దూరంగా ఉండే ‘హోటల్ తమిళనాడు ‘ లోని ఒక సూట్ అంటే ఇళయరాజాకు ఇష్టం. అక్కడే మ్యూజిక్ సిట్టింగ్స్‌కి కూర్చుందామని అనుకున్నారు. హోటల్‌కి చేరుకున్నాక వంశీ కాసేపు నడుంవాల్చారు. ఈలోగా ఇళయరాజా అసిస్టెంట్ తలుపుతట్టి "ఏంటి పడుకున్నావు. ఆయన హార్మోనియం పెట్టెను ముందేసుకుని కూర్చుని ఉన్నారు. నిన్ను రమ్మంటున్నారు" అన్నాడు.
ఉలిక్కిపడి లేచి సిధ్ధమయ్యారు వంశీ. సూట్‌కేస్ తెరిచి చూస్తే గుండె ఆగినంత పనైంది. స్క్రిప్ట్ ఫైలు లేదు. పచ్చటి ఫైల్లో స్క్రిప్ట్ పెట్టుకున్నాననుకున్నారు గానీ, అది ట్రీట్మెంట్ ఫైలు. అసలు ఫైలు అరకులోనే మరిచిపోయారు. సరే ఏదైతే అదవుతుందని ఇళయరాజా గదిలోకి వెళ్ళారు వంశీ. ఆయన ‘కథ చెప్పు ‘ అన్నారు. వంశీ నోటికొచ్చింది చెప్పారు. ‘ఏమిటో కాస్త గందరగోళంగా ఉంది. సిట్యుయేషన్స్ చెప్పు ‘ అన్నారు ఇళయరాజా. వంశీ నోటికొచ్చినవి చెప్పారు. ఒక్కో సిట్యుయేషన్‌కి ఒక్కో అద్భుతమైన ట్యూన్ కట్టారు ఇళయరాజా.