Aa Budget ‘Anumanaspadam’

ఆ బడ్జెట్ ‘అనుమానాస్పదం’

ఒకప్పుడు డైరక్టర్‌గా వంశీ ఓ వెలుగు వెలిగాడు. ఓ వైపు రచయితగా తన సృజనాత్మక రచనలతో ఆకట్టుకున్టూనే మరోవైపు సృజనాత్మక దర్శకుడిగానూ ఆయన పేరు తెచ్చుకున్నాడు. మంచు పల్లకి, సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్, మహర్షి, స్వరకల్పన, చెట్టుకింద ప్లీడరు, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ వంటి సినిమాలు ఆయనలోని ప్రతిభా పాటవాలకు నిదర్శనాలు. ఆ తర్వాత ఆయన ఎందుకనో రిథం తప్పిపోయారు. ఆయన సృజనాత్మకత ఎందుకనో దారి తప్పింది. వరుసగా నాలుగైదు జనాలు, విమర్శకులు మెచ్చని సినిమాలు తీశారు. ఎట్టకేలకు 2002లో ‘ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో ఆయన ప్రేక్షకులని ఆకట్టుకోగలిగారు. మళ్లీ ఆయన జోరు మొదలైందని చాలామంది భావించారు. కానీ అలా జరగలేదు. మళ్లీ మామూలే. దొంగరాముడు అండ్ పార్టీ, కొంచెం టచ్‌లో వుంటే చెపుతాను సినిమాలతో ఆయన నిరాశ పరిచారు. అయినప్పటికీ తాటి సతీష్ అనే ఓ ఆసామికి వంశీ అంటే చాలా అభిమానం. ఆయనతో ఓ సినిమా తీయాలనేది ఆయన ఆశయం. అదీ జనాన్ని బాగా ఆకట్టుకోవాలి. వంశీని సంప్రదించి, తన కోరికని చెప్పాడు. సరే అన్నాడు వంశీ.
‘అనుమానాస్పదం’ మొదలయింది. ఆ టైటిల్ ఎందుకనో సతీష్ కి అంత బాగా ఉన్నట్లు అనిపించలేదు. ఆయన స్నేహితులు కూడా అదే మాటన్నారు. కానీ ‘అన్వేషణ’ విషయంలోనూ జనం అలాగే అన్నారనీ, ఆది పెద్ద హిట్టయిందనీ, ‘అనుమానాస్పదం’ విషయంలోనూ అదే జరుగుతుందనీ వంశీ భరోసా ఇచ్చాడు. డబ్బు ఎక్కువ చెల్లించాల్సిన తారలు గానీ, భారీ సెట్లు గానీ లేవు. అందువల్ల తక్కువలో అయిపోతుందని సతీష్ భావించాడు. కానీ.. కోటి, రెండు కోట్లు, మూడు కోట్లు దాటి పోయింది ఖర్చు. అయినా సినిమా పూర్తి కాలేదు. ఇంకా.. ఇంకా పెట్టాల్సి వచ్చింది. ఖర్చు తగ్గించమని వంశీని అడగలేడు. కోరి ఆయనతో చేస్తున్న సినిమా అయ్యే. మొత్తానికి సినిమా థియేటర్లలో విడుదలయ్యేసరికి దాదాపు నాలుగున్నర కోట్లు వదిలాయి. ఒక్క పైసా చేతికి రాలేదు. సినిమా నిర్మాణం మీద అవగాహన ఉన్నవాళ్ళు ‘మహా అయితే ఈ సినిమాకి రెండున్నర, మూడు కోట్లకు మించి అవదు’ అని తేల్చారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని వుపయోగమేమిటి?.. అని సర్దిచెప్పుకోవడమ్ మించి ఏమీ చేయలేకపోయాడు సతీష్. ఇప్పుడాయనని ‘మళ్లీ సినిమా ఇప్పుడు తీస్తారు?’ అని అడిగి చూడండి. ఆయన మీవంక చూస్  చూపు చాలు. ఆయన ఎంత కోల్పోయాడో తెలుసుకోడానికి. ఫిల్మ్ నగర్ కబుర్లు ఇలాగే ఉంటాయి మరి.

We would like to hear your comments below: