చిరంజీవి తదుపరి సినిమా ‘అధినాయకుడు’ అనే సంగతి తెలిసిందే. ‘ఎన్కౌంటర్’, ‘జయం మనదేరా’, ‘శ్రీరాములయ్య’ తదితర చిత్రాల దర్శకుడు ఎన్. శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాగా ఈ సినిమా స్క్రిప్టుకు ప్రస్తుతం తుది మెరుగులు జరుగుతున్నాయి. ఇక్కడ కాదు. బ్యాంకాక్‌లో. ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారమవుతున్న దాని ప్రకారం రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు శంకర్ బ్యాంకాక్‌కు వెళ్లారు. హైదరాబాదులో వుంటే ఏదో ఒక అంశమై ఎవరో ఒకరు వారి ఏకాగ్రతకు భంగం కలిగించే అవకాశాలున్నాయనే వుద్దేశంతో వారు బ్యాంకాక్‌కు వెళ్లినట్లు సమాచారం. శంకర్ ప్రస్తుతం డైరెక్టర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కూడా. పరుచూరి సిద్ధం చేసిన నాలుగు సబ్జెక్టుల్లో ఒక దానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, దానికి తుది మెరుగులు దిద్దడానికే పరుచూరి బ్యాంకాక్‌కు వెళ్లారనీ వినిపిస్తోంది. ‘అధినాయకుడు’ను మే నెలాఖరులో సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వనీదత్, అల్లు అరవింద్ భావిస్తున్నారు. డిసెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది చిరంజీవి సంకల్పం.