Aapadamokkulavadu

Rating: 0.50/5

Critic Rating: (0.50/5)

ఆపద+చిక్కుల వాడు 

ఆపరేషన్ దుర్యోధన చిత్రం వివాదాలతో విజయాన్ని నమోదు చేసుకోగా, ఆ చిత్రం ఇచ్చిన స్పూర్తితో మరో సారి రాజకీయ నేపధ్యంలోనే ఆపదమొక్కులవాడు చిత్రాన్ని రూపొందించాడు పోసాని కృష్ణమురళి. నాగేంద్ర బాబు హీరోగా రూపొందిన ఈ చిత్రం వివిధ కారణాల వలన ఆసక్తి రేకెత్తించింది. చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించిన సంభాషణలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎండగట్టే మాటలు రాశారని ప్రచారం జరగడంతో ఒక వర్గం ప్రేక్షకులు ఈ చిత్రంపై ఆసక్తి కనబరిచారు. అయితే విడుదల విషయంలో జాప్యం జరిగి ఒక రోజు ఆలస్యంగా జనవరి 6న విడుదల అయిన ఆపదమొక్కులవాడు ఆ ఆసక్తికి తగ్గ చిత్రం కాదని తేలిపోయింది. పోసాని కృష్ణ మురళి మరోసారి తన అతిని కనబరిచి ప్రేక్షకులకి సహన పరీక్ష పెట్టిన ఈ చిత్రం పూర్తి వివరాలివి…

కథ:

జెడ్పీటీసీ రంగయ్య నాయుడు (నాగేంద్ర బాబు) నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తుంటాడు. అయితే తన ప్రాంత నాయకులు (తనికెళ్ళ భరణి, జాకీ) కొందరు అవినీతికి పాల్పడుతూ అక్కడి ప్రజలను కష్టాలకు గురి చేస్తుంటే, ప్రభుత్వానికి ఎదురు తిరిగి తన జిల్లా వరకు పేరలల్ గవర్నమెంట్ నడుపుతాడు. దీంతో కుటిల నాయకులు రంగయ్యనాయుడు మనుషులు అందరినీ చంపేస్తారు. అప్పుడు కట్టి పట్టిన రంగయ్యనాయుడు ఒక హత్య చేసి పోలీసులకు లొంగిపోతాడు. అయితే ఎస్పీ రాజారెడ్డి(సాయికుమార్) రంగయ్యను వదిలేసి దుష్ట సంహారం చేయమంటాడు. ఇక “దేవుడు” అవతారం ఎత్తిన రంగయ్య నాయుడు చేసే అసుర వధ (మనకి చిత్ర వధ) మిగిలిన కథ.

కథనం:

తల, తోక లేని సినిమాకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచే ఈ చిత్రం ఎక్కడ మొదలయి ఎటు పోతుందో అసలు అర్ధం కాదు. కథకు సంబంధం లేని సన్నివేశాలు వచ్చి పోతూ, ఏది కథలో భాగమో, ఏది అనవసరమయిన రాద్ధాంతమో అర్ధం కానివ్వవు. నిత్యం టీవీల్లో, పేపర్లలో చూసే ప్రతి అంశాన్ని ఇందులో చూపించడంతో అసలు కథా నాయకుడు ఏ అంశం మీద పోరాటం చేస్తున్నాడో అర్థం అవదు. కథా నాయకుడి పాత్ర ప్రవేశం, ఆపై జరిగే సన్నివేశాలు మరింత కన్‌ఫ్యూజన్‌కి గురి చేస్తాయి. హీరో పాత్ర అడ్డదిడ్డంగా సాగడంతో ఇక కథకు ఒక సక్రమమయిన మార్గం, గమ్యం లేకపోయింది. అసలు హీరో భగవంతుడి అవతారం ఎలా పొందాడు? మాయమయి, మళ్లీ ఎలా ప్రత్యక్షం అవుతున్నాడు అనేది సినిమా పూర్తయ్యాక కూడా బదులు దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్న. భగవంతుడు ఉన్నాడా లేదా అని పోసాని కృష్ణమురళి, హేమ మధ్య జరిగే సంభాషణ కథానుసారం చాలా కీలకమయిన పాయింట్. కానీ దానిని ఎలా కన్విన్సింగా చూపించాలో దర్శకుడికి తెలియక పోవడంతో కన్‌ఫ్యూజన్ నెలకొంది. దర్శకుడి మైండులో ఉన్న ఆలోచన ఒకటయితే తెర మీదకు తీసుకొచ్చింది మరొకటి అనిపించింది. చెప్పే విషయం మీద స్పష్టత కొరవడడంతో, అలాగే ఒక పాయింట్ కాక అనేకం తలకు ఎత్తుకోవడంతో దర్శకుడు దేనినీ జస్టిఫై చేయలేక పోయాడు. ఆపరేషన్ దుర్యోధన చిత్రంలోనూ ఇలాంటి కంగాళీ ఫార్ములానే ఎంచుకున్నా అక్కడ అది చెల్లిపోవడంతో అదే హిట్ ఫార్ములా అనే భ్రమకు లోనయినట్టున్నాడు పోసాని. రాజకీయ నాయకులు కుతంత్రాలు చేస్తూ ఉండొచ్చు గానీ ఈ సినిమాలో చూపించినట్టుగా ప్రజల ముందే తమ దారుణ మనస్తత్వాన్ని బయట పెట్టే నాయకులు పోసాని సినిమాల్లో తప్ప ఎక్కడా కనిపించరు. చిరంజీవి రాజకీయ ప్రవేశం చేయాలనే కోర్కె ను పలుమార్లు వెలిబుచ్చారు కానీ అవి కూడా అసందర్భ సన్నివేశాల్లో ఉన్న పళంగా ఊడి పడడంతో పేలలేదు. రాజకీయ నాయకులపై, అసెంబ్లీలో తిట్టుకునే విధానంపై సెటైర్స్ వేయాలని ట్రై చేసినా అవన్నీ టైట్ స్క్రీన్‌ప్లే తో ప్రణాళిక ప్రకారం ఒక క్రమ పద్దతిలో వేసి ఉంటే రెస్పాన్స్ ఉండేది. కానీ లింకు లేకుండా మాట్లాడడంతో వాటి పర్పస్ కూడా నెరవేరలేదు. 


నటీనటుల అభినయం:

నాగేంద్ర బాబు పాత్రకు తగ్గ ఆహార్యంతో సరిగ్గా సూట్ అయ్యారు. బరువు తగ్గించి ఈ పాత్ర కోసం ఆయన చాలా కృషి చేశారు. అయితే పోసాని రాసుకున్న క్యారెక్టర్ లో విషయం లేకపోవడంతో నాగేంద్రబాబుకి నటించే స్కోప్ లభించలేదు. గట్టిగా అరిచి చెప్పే సంభాషణలు స్పష్టంగా పలకలేకపోయారు. అస్మిత దర్శకుడి చేతిలో కీలు బొమ్మే. తనికెళ్ళ భరణి, జాకీ, చలపతి రావు, సన, ఏవీఎస్, బాబూ మోహన్, కోటా శంకర రావు తదితరులు అంతా దర్శకుడు చెప్పినట్టు చేశారు. సాయికుమార్ పాత్ర పరిధి చాలా తక్కువ. ఉన్నంతలో బాగానే చేశాడు. ముఖ్యమంత్రి పాత్రధారి, శీనుగాడు పాత్రధారి బ్లాంక్ ఫేసులతో హింసించారు. ఉదయభాను ఒక ఐటెం సాంగ్ చేసింది.

టెక్నీషియన్ల పనితనం:

కొరటాల శివ సంభాషణలు, లెనినా చౌదరి సంగీతం, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఏమీ బాలేదు. గ్రాఫిక్స్ వర్క్ కూడా టీవీ సీరియల్ క్వాలిటీతో ఉంది. చిత్ర నిర్మాణం కూడా చాలా తక్కువలోనే పూర్తయింది. తక్కువలో తీసిన క్వాలిటీ తెలిసిపోతూనే ఉంది.
దర్శకుడిగా ఒక క్రమ పద్దతిలో కథను, పాత్రలను హ్యాండిల్ చేయలేను అని పోసాని మరోసారి నిరూపించుకున్నారు. రచయితగా సెటైర్స్ వేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న పోసాని ఇప్పుడు ఆ ప్రతిభ కూడా చూపించలేక పోతున్నారు.

బాక్సాఫీస్ ఫలితం:
అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దీని మీద నెలకొన్న ఆసక్తి కారణంగా పెట్టుబడిని రాబట్టుకోవచ్చునేమో గానీ చూసిన ప్రేక్షకులలో కనీసం ఒక్క శాతం మంది చేత అయినా బాగుంది అనిపించుకోదు. ఈ చిత్రానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కూడా.

-శ్రీనిధి

Give your rating:

We would like to hear your comments below: