Victory

Rating: 2.50/5

Critic Rating: (2.50/5)

‘డిఫీట్’ కాకుంటే బాగుణ్ణు! 

జనాభా పెరిగే కొద్దీ భూమి అపురూపమైన వస్తువు అయిపోతూ వస్తోంది. కూడు, గూడు, గుడ్డలలో మొదటిది, చివరిది లభ్యం కావడం కష్టం కాదు గానీ, వుండేందుకు కాసింత గూడు సమకూర్చుకోవడమే సగటు జీవికి భారమైపోతోంది. మనిషికి ప్రకృతి ప్రసాదించిన వనరుల్లో ఒక్క గాలి మాత్రమే అతనికి ఉచితంగా అందుతోంది. తాగే నీటినీ, వుండే భూమినీ అతను డబ్బు పెట్టి కొనాల్సిందే. భూమి విలువ అంతకంతకూ పెరిగిపోతుండటంతో, అది బంగారం కంటే విలువైందనే సంగతి గ్రహించిన కొద్దిమంది బలవంతులు కబ్జాల పేరిట దాన్ని తమ వశం చేసుకుని, దానితో వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. పేదల భూమిని బలవంతగా ఆక్రమిస్తూ వారిని రోడ్డున పడేస్తున్నారు. అలాంటి ల్యాండ్ మాఫియా మీద కొద్దిమంది కుర్రాళ్లు చేసే తిరుగుబాటే ‘విక్టరి’. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ల్యాండ్ మాఫియా ఇప్పటికే జడలు విప్పి, వికటాట్టహాసం చేస్తోంది. దానివల్ల బడుగు జీవులు ఎంతగా అల్లాడుతున్నారో తెలియజెప్పే యత్నం ‘విక్టరి’. హైదరాబాద్‌లోని ల్యాండ్ మాఫియా నేపథ్యంలో నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదివరకు ‘సామాన్యుడు’ చిత్రాన్ని రూపొందిందిన రవి సి కుమార్ దీని దర్శకుడైతే, అదే సినిమాన్ని నిర్మించిన ఆర్ఆర్ మూవీమేకర్స్ దీనినీ నిర్మించింది. ప్రయత్నం మంచిదే కానీ, కథని చెప్పిన తీరు ఆకర్షణీయంగా వుందా? ల్యాండ్ మాఫియా మీద తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మరి ‘విక్టరి’లో వున్న కొత్తదనం ఏమిటి?.

కథ:

ఎమ్మెల్యే దేవరాజ్ (అశుతోష్ రాణా) ల్యాండ్ మాఫియా మీదే ఆధారపడి కోట్లు సంపాదిస్తాడు. అతని కన్ను పడితే, ఇక ఆ భూమి అతడి సొంతం కావలసిందే. దాని కోసం ప్రాణాలు తీయడం అతనికి తృణప్రాయం. తనకి పోటీగా తయారైన పాండు (సుప్రీత్) చేయి తెగనరుకుతాడు. అలాంటిది అతడి కన్ను స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకట్రామయ్య (రావి కొండలరావు)కు చెందిన 500 ఎకరాల భూమిపై పడుతుంది. ఆ స్థలాన్ని పింగళి ఎన్నడో పేదలకి పంచి ఇచ్చాడు. అవినీతిపరుడైన ఎమ్మార్వో సాయంతో ఆ భూమిని తన తండ్రికి వెంకట్రామయ్యే రాసిచ్చినట్లు డాక్యుమెంట్లు పుట్టిస్తాడు దేవరాజ్. ఆ స్థలంలో ప్లాట్లు కలిగిన వందలమంది దాంతో దిక్కుతోచన స్థిలో పడిపోతారు. ఆ కుటుంబాల్లో విజయ్ (నితిన్) కుటుంబంతో పాటు అతని స్నేహితుల కుటుంబాలూ వుంటాయి. రవి (శశాంక్), సింధు (సింధూ తులాని), దువ్వాసి మోహన్ మరికొంతమంది కలిసి దేవరాజ్‌ను ఎదుర్కోవడానికి నడుం బిగిస్తారు. వారికి పింగళి మనవరాలు మమత (మమతా మోహన్‌దాస్) సహకరిస్తుంది. దేవరాజ్ మీద పగతో అతడి మీదకు విజయ్‌ని ప్రయోగించాలనుకుంటాడు పాండు. అయితే అతడూ దుర్మార్గుడే కాబట్టి, తెలివిగా దేవరాజ్ చేతే అతణ్ణి మట్టుబెట్టిస్తాడు విజయ్. దేవరాజ్ వెంటనే భూమి అక్రమించకుండా కోర్టులో కేసు వస్తాడు నితిన్. సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డ పింగళిని హత్య చేయిస్తాడు దేవరాజ్. ఆ తర్వాత అతడి బండారాన్ని తన స్నేహితుల సాయంతో విజయ్ ఎలా బయటి ప్రపంచానికి తెలియజేశాడు? ఆతడితో పాటు ఆ ల్యాండ్ మాఫియా వెనుక వున్న పెద్ద తలకాయల్ని ఎలా బయటపెట్టాడు?.. అనేది క్లైమాక్స్.

కథనం:

ఈ సినిమా కథ గంభీరమైన ఆశయం కలది. ‘దున్నే వాడిదే భూమి అనేది పాత సామెత. తన్నే వాడిదే భూమి అనేది కొత్త సామెత’ అనే దేవరాజ్ వంటి ల్యాండ్ మాఫియాగాళ్ల పీచమణచి సామాన్యులు తమ భూమిని తాము పొందడమనేది ‘విక్టరి’లోని ప్రధానాంశం. నేటి సామాన్యులు ఎంతోమంది అనుభవిస్తున్న సమస్య కాబట్టి ఈ సినిమా కథతో భూమి కోసం పాట్లుపడే సామాన్య ప్రేక్షకులు సులభంగానే ఐడెంటిఫై అవుతారు. కేవలం సమస్య మీదే కథని ఫోకస్ చేస్తే జనం రెండున్నర గంటల సేపు కుర్చీల్లో కదలకుండా కూర్చోవడం కష్టం అనే సంగతి దర్శకుడికి బాగా తెలుసు. దానికోసం ప్రేమ, యాక్షన్, వినోదం, భావోద్వేగాలు వంటి మసాలాలని దర్శకుడు రవి సి కుమార్ జోడించాడు. అయితే వాటిని కలపాల్సిన పాళ్లలో కలపక పోవడం వల్లా, ఆయా సన్నివేశాల్ని ప్రభావవంతంగా కల్పించక పోవడం వల్లా హీరో బృందానికి విలన్ మీద ‘విక్టరి’ లభించవచ్చు గానీ, ప్రేక్షకుల హృదయాల్ని ఈ సినిమా గెలుస్తుందా? అన్నది సందేహం. ప్రారంభంలో ‘సిక్స్ ప్యాక్’తోటో, ‘ఎయిట్ ప్యాక్’తోటో కండల వీరుడిగా కనిపించే నితిన్ సినిమా అంతా వీర విహారం చేస్తాడనే, తన కండలకి న్యాయం చేకూరుస్తూ క్లైమాక్స్‌ని దున్నేస్తాడనే భావనని కలిగించిన దర్శకుడు ఆ విషయంలో ప్రేక్షకుణ్ణి తీవ్ర అసంతృప్తికి గురిచేశాడు. చివరలో విలన్ మీద హీరో కేవలం బుద్ధి బలం చూపి తృప్తి పడిపోతాడు. ఆరంభంలో హీరోని చూపించిన బిల్డప్‌కి తగ్గట్లు చివరలో అతను ప్రవర్తించడు. అది ప్రేక్షకుణ్ణి డీలా పడేలా చేస్తుంది. క్లైమాక్స్ ఎంత ఆవేశపూరితంగా వుంటుందో, విలన్‌ను హీరో తన అరివీర భయంకర కండలతో ఎలా మట్టికరిపిస్తాడో చూడాలనుకునే ప్రేక్షకుడి తృష్ణ తుస్సుమని నీరుకారిపోతుంది. అంటే ఏమిటి? కథకుడు కూడా అయిన దర్శకుడు కథలో విలన్ పాత్రని బాగా చిత్రించాడు కానీ, హీరో దగ్గరకు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. విలన్ పాత్ర ఎంత బలంగా వుంటే, హీరో పాత్ర అంతగా రాణిస్తుందన్నది కమర్షియల్ సినిమాకు సంబంధించిన ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. అయితే విలన్ పాత్ర బలంగా వున్నంత మాత్రాన హీరో పాత్ర రాణించదనీ, ఆ పాత్ర కూడా బలంగా వున్నప్పుడే కథ ఆసక్తికరంగా వుంటుందనీ ‘విక్టరి’ మనకు తెలియజేస్తుంది. హీరోతో పాటు హీరోయిన్ మమత పాత్రని కూడా దర్శకుడు సక్రమంగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. ఆమె పాత్ర చిత్రణలో దొర్లిన పొరబాట్లని దర్శకుడు గ్రహించలేక పోయాడు. తనకి కుజ దోషం వుంది కాబట్టి, అలాంటి దోషమే వున్న నితిన్‌ను పెళ్లి చేసుకోవాలని మమత ఆలోచించడం బాగానే వుంది కానీ, తనకు నచ్చని సిగరెట్, మందు తాగే అలవాట్లు వున్న నితిన్ చేత అవి మాన్పించేందుకు ఆమె ఎందుకు కష్టపడాలి? ఆ అలవాట్లులేని మరొకణ్ణి చూసుకోవచ్చు కదా? అసలు ఈ ‘కుజ దోషం’ అనే కాన్సెప్ట్ ఈ కాలానికి నప్పుతుందా? పైగా నితిన్‌కు తెలీకుండా మమత, నితిన్ తల్లిదండ్రులు (తనికెళ్ల, సన) కలిసి ఆడే నాటకం నితిన్‌కు చివరికి కూడా తెలీకపోవడం కథనంలో దొర్లిన లోపం. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా సరిగా తెరకెక్కలేదు. మమత వెంటపడటమే గానీ, ఆమెతో నితిన్ చేసినదంతా బలవంతపు రొమాన్సే. ఆమె బలవంతం చేస్తేనే ‘ఐ లవ్ యూ’ చెబుతాడు హీరో. ఆమెతో వున్న అవసరం కొద్దీ హీరో ఆమెను ప్రేమిస్తానంటాడే గానీ, మనస్ఫూర్తిగా కాదు. ఇది హృదయాల్ని ఆకట్టుకునే చిత్రణ కాదు. పాండు పాత్రని కూడా దర్శకుడు సరిగా వినియోగించుకోలేక పోయాడు. ఇవాళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నది నీతులూ, సుద్దులూ కాదు. ప్రధానంగా వినోదం. ఆ సంగతికొస్తే ‘విక్టరి’లోని వినోదం కూడా అసంతృప్తి కలిగిస్తుంది. దువ్వాసి మోహన్, అతని తండ్రి (విజయ రంగరాజు) మధ్య వినోదం రెండు సన్నివేశాలకే పరిమితమైంది. బ్రహ్మానందం, అలీ, అభినయశ్రీల ఎపిసోడ్ హర్షించతగ్గ రీతిలో లేదు. 

పాత్రధారుల అభినయం:

విజయ్ పాత్రలో నితిన్ కండలు బాగా ప్రదర్శించాడు. అయితే హీరోగా రాణించాలంటే అభినయం, వాచకం చాలా ప్రధానమని నితిన్ తెలుసుకోవాలి. ఇన్ని సినిమాల తర్వాత కూడా అతనిలో ఈ రెండు అంశాల్లో అనుకున్నంత మెరుగుదల కనిపించకపోవడం అసంతృప్తి కలిగిస్తుంది. అతను కేవలం డాన్సులు, ఫైట్ల మీద శ్రద్ధ చూపిస్తే చాలదు. హావభావాల ప్రదర్శనలోనూ, వాచకంలోనూ పరిణతి సాధించాలి. పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని దానికి అనుగుణంగా కెమెరా ముందు నడచుకునే నేర్పును అలవరచుకోవాలి. హీరోయిన్‌గా మమత కూడా ఆకట్టుకోలేక పోయింది. చిలిపితనాన్ని బాగానే ప్రదర్శించినప్పటికీ, భావోద్వేగాల్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఆమె ముఖంలో భావాలు సహజంగా కాక కృతకంగా కనిపించాయి. హీరో హీరోయిన్లతో పోల్చుకుంటే శశాంక్, సింధు మెరుగైన నటన ప్రదర్శించారు. విలన్ దేవరాజ్ పాత్రలో అశుతోష్ రాణా, పాండుగా సుప్రీత్ రాణించారు. కనిపించేది తక్కువ సేపే అయినా క్రూరత్వ ప్రదర్శనలో అజయ్ మెప్పించాడు. నితిన్ తండ్రి పాత్రలో తనికెళ్ల అలవోకగా ఇమిడిపోయాడు. దువ్వాసి కొంత రిలీఫ్‌నిస్తాడు. బ్రహ్మానందం, అలీ కామెడీ సాధారణ స్థాయిలో వుంది. లాయర్ లక్ష్మణరావుగా రవిబాబు ఆకట్టుకున్నాడు. అతడికి ‘లైసెన్స్’ (మగతనం) లేదనే గాసిప్ ప్రచారంలోకి రావడమనేది నవ్విస్తుంది. నారాయణగా ఎమ్మెస్ నారాయణ వినోదాన్ని పంచాడు. ఇన్‌స్పెక్టర్‌గా నెగటివ్ పాత్రలో సత్యప్రకాష్ ఓకే. కృష్ణభగవాన్, రావి కొండలరావు పరిధుల మేరకు నటించారు. 

టెక్నీషియన్ల పనితనం:

దర్శకుడి సంగతి పక్కనపెడితే టెక్నీషియన్లలో మొదట చెప్పుకోవలసింది విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీనే. ‘ఆనంద్’, ‘హ్యాపీడేస్’ స్థాయిలో కాకపోయినా, ‘విక్టరి’కి మెరుగైన సినిమాటోగ్రఫీని అందించాడు. అయితే సన్నివేశాల్లో ఆకర్షణీయత అంతగా లేకపోవడంతో అతని కెమెరా పనితనం వెలుగులోకి రాకపోవచ్చు. దర్శకుడు రవికుమార్, కలువ కృష్ణసాయి కలిసి రాసిన సంభాషణల్లో ఎమ్మెస్ నారాయణ, రవిబాబు, భరణికి రాసినవే మెరుగ్గా అనిపిస్తాయి. చక్రి అలవాటైన ధోరణిలో సాహిత్యం వినిపించని గందరగోళ బాణీలకే మరోసారి పెద్దపీట వేశాడు. ఒకే ఒక్క మెలోడీలో మాత్రమే సాహిత్యం వినిపించింది. వాటి చిత్రీకరణ పర్వాలేదు. వున్నంత వరకు ఫైట్లు ఆకట్టుకుంటాయి. నితిన్, అజయ్ మధ్య తీసిన ఫైట్ రామ్ లక్ష్మణ్ పనితనాన్ని పట్టిస్తుంది. క్లైమాక్స్‌లో ఫైట్ లేకపోవడమే ప్రేక్షకుల్ని నిరాశపరిచే అంశం.

బలాలు, లోపాలు:

యువతను ఆకట్టుకునే నితిన్ రూపం, విలన్ పాత్ర చిత్రణ, యాక్షన్ ఎపిసోడ్లు, సినిమాటోగ్రఫీ బలాలు. కథ, కథనాల్లో దొర్లిన తప్పులు, అనాకర్షకంగా వున్న సన్నివేశాల కల్పన, హీరో హీరోయిన్ల మధ్య మిస్సయిన రొమాన్స్, కండలు తిరిగిన హీరోకి తగ్గట్లుగా లేక, చప్పగా తేలిపోయిన క్లైమాక్స్ లోపాలు. మొత్తంగా ‘విక్టరి’ గురించి రెండు మాటలు చెప్పాలనిపిస్తుంది. ‘విక్టరి’కి కావలసింది బలమైన కథ.. కండలు కాదు. సినిమాకి అవసరమైనవి నవ రసాలు.. ‘ఆరు పలకలు’ (సిక్స్ ప్యాక్) కాదు.

…యజ్ఞమూర్తి

Give your rating:

We would like to hear your comments below: