Gamyam

  • Cast: Allari Naresh, Sarvanand, Kamalini Mukharjee
  • Director: Radha Krishna Jagarlamud
  • Music Director: E.S.Murthy
  • Producer: Saibaba Jagarlamudi
Rating:
3.25
  • Listen Audio
  • Watch Trailer

సజావుగా సాగిన ‘గమ్యం’

సినిమా కళ పట్ల అభిమానం, అభిరుచి వున్న దర్శకుల వల్ల తెలుగులో అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తూ వున్నాయి. ఇటీవలి కాలంలో కొత్తగా ఆలోచిస్తూ సినీ రంగంలోకి అడుగుపెడుతున్న దర్శకులు ఎక్కువవుతున్నారు. వారిలో రాధాకృష్ణ జాగర్లమూడి కూడా చేరతాడని చెప్పాలనిపిస్తుంది ‘గమ్యం’ చూశాక. ఫార్ములా చట్రంలో కాకుండా తాననుకున్న పాయింట్‌ని కొత్తగా చెప్పాలనే తాపత్రయం రాధాకృష్ణలో కనిపిస్తుంది. నటీనటుల ఎంపికలో కూడా అతను ఈ ధోరణిని కనపర్చాడు. శర్వానంద్ ప్రధాన హీరో అయితే, నరేష్ సైడ్ హీరో. కమలినీ ముఖర్జీ హీరోయిన్. నిజంగా ఆసక్తి కరమైన కాంబినేషన్. శుక్రవారం (ఫిబ్రవరి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకీ, సిద్ధార్థుడి (బుద్ధుడి) కథకీ ఒక పోలిక వుంది. అదేమంటే…

కథ:

చెప్పుకోవడానికి ఇందులో కథంటూ పెద్దగా ఏమీ లేదు. తనని వదలి వెళ్లిన కథానాయిక కోసం కథానాయకుడు జరిపే అన్వేషణ ఈ సినిమా. ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో అతను పొందిన అనుభవాల మాలిక ఈ సినిమా. అభిరామ్ (శర్వానంద్) పదివేల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైన సంపన్న యువకుడు. ఒకసారి అతడికి జానకి (కమలిని) అనే అందమైన మెడికో తారస పడుతుంది. ఆమెని వారం రోజుల్లో ప్రేమలో పడేస్తానని తన మిత్రుడితో పందెం కడతాడు అభి. ఆమెకు ‘ఐ లవ్ యు’ చెబుతాడు. ఆమె నవ్వి ఊరుకుంటుంది. ఆమెతో పరిచయం పెంచుకుని తన బర్త్‌డే పార్టీకి పిలుస్తాడు. అభి తనకోసం ఎందుకు తిరుగుతున్నాడనే నిజం అక్కడ జానకికి తెలుస్తుంది. అభిని ఏవగించుకుంటుంది. పందెం కట్టింది నిజమే గానీ, ఇప్పుడు నిజంగానే ప్రేమిస్తున్నానంటాడు అభి. అక్కణ్ణించి కారులో వస్తున్న ఇద్దరి మధ్య వాదులాట జరుగుతుంది. కారు కంట్రోల్ తప్పి ఒక స్త్రీని ఢీకొంటుంది. కళ్లువిప్పితే  ఆసుపత్రిలో వుంటాడు అభి. జానకి అతణ్ణి వదిలి వెళ్లిపోతుంది. తనకోసం వెతకొద్దని ఉత్తరం రాస్తుంది. కానీ అభికిప్పుడు జానకి నిజంగా కావాలి. ఆమె కోసం బయలుదేరతాడు. మధ్యలో ఒక మోటారు వాహనాల దొంగ గాలి శీను (నరేష్) తారసపడతాడు. అభి వద్ద కనిపించిన ఖరీదైన మోటార్ బైకుని దొంగిలించాలని శీను కూడా అతనితో ప్రయాణిస్తాడు. అక్కణ్ణించి ఆ ఇద్దరూ ఎన్నో అనుభవాలు పొందుతారు. ఆ అనుభవాలేమిటి? ఆ ఇద్దరూ తమ తమ గమ్యాల్ని చేరుకున్నారా? జానకి ఏమయ్యింది? అనేది మిగతా సినిమా. 

కథనం:

అంతఃపురం వీడి బయటి లోకంలోకి అడుగుపెట్టిన సిద్ధార్థుడు అక్కడి భయంకరమైన స్థితుల్ని చూసి బిత్తరపోతాడు. చావు బతుకుల గురించి ప్రత్యక్షంగా చూసి చలించిపోతాడు. నిజమైన జీవితమంటే ఏమిటో తెలుసుకుంటాడు. జన్మకి అర్ధాన్ని అన్వేషించే క్రమంలో సన్యాసి అవుతాడు. జ్ఞానోదయంతో బుద్ధుడిగా మారతాడు. బుద్ధుడిగా మారకముందు ప్రపంచంలో గౌతముడికి ఎదురైన అనుభవాల ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘గమ్యం’ కథని మలిచాడు దర్శకుడు రాధాకృష్ణ. కాకపోతే కథానాయకుడి అన్వేషణ తన నాయక కోసం. ప్రేమ కోసం. అయినప్పటికీ ఆ అన్వేషణలో కథానాయకుడు లోకం తీరు ఎలా వుందో తెలుసుకుంటాడు. జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటాడు. మనిషికీ, మనిషితనానికీ అర్ధం తెలుసుకుంటాడు. ప్రేమంటే ఏమిటో, ప్రేమించడమంటే ఏమిటో తెలుసుకుంటాడు. తన చేతుల మీదుగా ఒక జననం, ఒక మరణం చూస్తాడు. కథానాయకుడు అభిరామ్ పొందే ఈ అనుభవాల కోసం దర్శకుడు కల్పించిన సన్నివేశాలు ప్రశంసనీయంగా వున్నాయి. మొదట్లో రిలేషన్‌షిప్స్ అన్నీ ఆబ్లిగేషన్స్ అనుకున్న అభిరామ్ చివరకు వచ్చేసరికి అనుబంధాల్లోని ఆత్మీయతని ఆస్వాదిస్తాడు. అలా ఆ పాత్ర మారే క్రమాన్ని చూపించడంలో దర్శకుడు ఎంతో మెచ్యూరిటీని కనపర్చాడు. ఆ పాత్రలో ఆ పరిణామానికి కారణమైన గాలి శీను పాత్రనీ చక్కగా తీర్చిదిద్దాడు. అభిరామ్, శీను మధ్య స్నేహానుబంధం పెనవేసుకునే తీరు ఆకట్టుకుంటుంది. కలిసి ప్రయాణించే క్రమంలో ఆ ఇద్దరి స్వభావాల్లోనూ మార్పు వస్తుంది. అందుకే ఒకచోట విజయచందర్ చేత "జంతువులు మారవు. మారని వాడు మనిషి కాడు" అనిపిస్తాడు దర్శకుడు. గ్రామాల్లో రికార్డింగ్ డాన్సులు ఎలా జరుగుతాయో చూపించిన అతను అక్కడ రికార్డింగ్ డాన్సర్‌కి కూడా మనసు, ఆత్మగౌరవం వుంటాయనే సన్నివేశాన్ని కల్పించిన తీరు ప్రశంసనీయం. అలాగే నక్సలైట్లు అడవుల్లోంచి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజోపయోగ పనులు చేయాలని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. అభిరామ్ అన్వేషణకి కారణమైన జానకి పాత్ర ఆకట్టుకుంటుంది. అయితే ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించిన దర్శకుడు ఆమె పాత్రని ఇంకా విపులంగా చిత్రించివుంటే సినిమాకి మరింత ఆకర్షణ చేకూరేది. పాటల చిత్రీకరణ విషయంలోనూ రాధాకృష్ణ జాగ్రత్త వహించాడు. కథ నడకకి అవి అడ్డుపడకుండా చూసుకున్నాడు. రవీంద్రభారతిలో కమలిని బృందం చేత చేయించిన నృత్యం యువతని సైతం ఆకట్టుకుంటుంది. నరేష్ పాత్రలో వినోదాన్ని చొప్పించిన దర్శకుడు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలను సందర్భోచితంగా వాడుకున్నాడు. కథనం విషయంలో ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని రూపొందించింది కొత్త దర్శకుడంటే నమ్మడం కష్టం.

నటీనటుల అభినయం:

‘వెన్నెల’, ‘అమ్మ చెప్పింది’ సినిమాల్లో ప్రతిభావంతంగా నటించిన శర్వానంద్ ‘గమ్యం’లో అభిరామ్‌గా పరిణతి చెందిన అభినయాన్ని ప్రదర్శించాడు. కథ ప్రకారం పాత్ర ఎలా పరిణతి చెందుతూ వస్తుందో దానికి తగ్గట్లు అతను హావభావాలు ప్రదర్శించాడు. వాచకంలో ఇంకాస్త శ్రద్ధ వహిస్తే హీరోగా రానున్న రోజుల్లో రాణించగలుగుతాడు. ఏమైనా ఈ సినిమాతో హీరోగా అతనికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. గాలి శీనుగా సైడ్ హీరో పాత్రని చేయడానికి నరేష్ అంగీకరించి, మంచిపనే చేశాడు. ఆ పాత్ర స్వభావానికి నరేష్ అతికినట్లు సరిపోయాడు. ఈమధ్య చేసిన సినిమాలతో నిరాశపరచిన అతను ఇందులో మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. మొదట్లో అల్లరి చిల్లరగా కనిపించి కాలక్షేపాన్ని అందించిన అతను చివర్లో కళ్లల్లో నీళ్లు తెప్పిస్తాడు. కమలిని నటనా సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జానకి పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చింది. సినిమాలో ప్రధానమైనవి ఈ మూడు పాత్రలే. మిగతావి ఇలా వచ్చి అలా పోతాయి. ఆ పాత్రల్లో ఆయా నటులు.. అభిషేక్ (శర్వానంద్ మిత్రుడు), బ్రహ్మానందం, ఎమ్మెస్, ఎల్బీ శ్రీరామ్, విజయచందర్, హేమ వగైరా.. రాణించారు.  

టెక్నీషియన్ల పనితనం:

కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు రాధాకృష్ణ తన పనిని శ్రద్ధగా చేస్తే, సంభాషణల్ని నాగరాజు గంధం సందర్భోచితంగా ప్రయోగించాడు. కథనానికి ఆయన మాటలు బాగా వుపకరించాయి. ప్రధానంగా నరేష్ నోట పలికే మాటలు ప్రేక్షకులకి రిలీఫ్‌నిస్తాయి. జీవితం గురించి చెప్పే సందర్భాల్లోనూ ఆయన కలం చురుగ్గా పనిచేసింది. ఇ.ఎస్. మూర్తి, అనిల్ కలిసి కూర్చిన సంగీతం ఓకే. నేపథ్య సంగీతం యాప్ట్‌గా వుంది. ఈ సినిమాకి ప్రధాన బలాల్లో ఒకటి సినిమాటోగ్రఫీ. యువకుడైన దర్శకుడి మనసుని గ్రహించినట్లు సీనియర్ సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు కెమెరా సన్నివేశాల్లోని మూడ్‌ని బాగా క్యాప్చర్ చేసింది. సన్నివేశాలకు తగ్గట్లు నేపథ్యాన్ని సృష్టించడం అంత తేలికైన పనికాదు. కళా దర్శకుడు రాజీవ్ నాయర్ ఆ పనిని మెరుగ్గా చేసుకుపోయాడు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా వుంది.

బలాలు, లోపాలు:

అభిరామ్, గాలి శీను పాత్రలు, ఆ పాత్రల్లో శర్వానంద్, నరేష్ అభినయం, కథనం, సంభాషణలు, సంగీతం, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం బలాలు. కమలిని పాత్ర నిడివి తక్కువ కావడం, ప్రథమార్ధంలో ఆకర్షణీయమైన సన్నివేశాలు తక్కువ కావడం, క్లైమాక్స్ ముందరి లీడ్ సన్నివేశాలు.. లోపాలు. ఓవరాల్‌గా చూస్తే కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులని ఈ సినిమా సంతృప్తి పరుస్తుంది.

…యజ్ఞమూర్తి

 

Gamyam Reviewed by HaribabuBolineni on . Gamyam

సజావుగా సా&#.. Rating: 3.25 out of 5

Passionate about movies and content. Spent several years on Tollywood movie industry and write quality entertainment content.