Krishna

Rating: 0.00/5

Critic Rating: (0.00/5)

రేటింగ్ 3.0/5
‘కృష్ణ’ వినోదం!
సాధారణంగా భావోద్వేగాలు రెచ్చగొట్టే సినిమాలు రూపొందించే దర్శకుడు బాణీ మార్చి వినోదానికే పెద్ద పీట వేసి సినిమా తీస్తే ఎలాఉంటుంది? అచ్చు ‘కృష్ణ’లాగే ఉంటుంది. నిజమే. దర్శకుడు వినాయక్ ఇంతదాకా తీసిన సినిమాలు గమనిస్తే కొట్టొచ్చేట్లు కనిపించే సంగతి.. అతను యాక్షన్ ప్రియుడనీ, ఎమోషనల్ సన్నివేశాలంటే అతనికి మహా ఇష్టమనీ. అలాంటివాడు ఆకస్మికంగా ఎంటర్‌టైన్‌మెంట్ మీద దృష్టి సారించాడు. ఎవరినీ లెక్కచేయకుండా తింగరోడిలా మాట్లాడుతూ సరదాగా జీవితాన్ని గడిపే పాత్రతో గమ్మత్తులు చేయించాలనుకున్నాడు. ‘కృష్ణ’ని ఆవిష్కరించాడు. ఇలాంటి తింగరి పాత్ర చేయడానికి రవితేజని మించిన నటుడు ఎంకెవరున్నారు? అందుకే వినాయక్ ప్రయత్నం చాలావరకు సత్ఫలితాన్నిచ్చేట్లే కనిపిస్తోంది. తన అల్లరి చేష్టలతో కృష్ణ మంచి వినోదాన్నే పంచాడు, కథేమీ లేకపోయినా.
కథ:
దసరా వేడుకల సమయాన కృష్ణానదిలో స్నానమాచరిస్తున్న సంధ్య (త్రిష) అనే సుందరాంగిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు కృష్ణ (రవితేజ). ఆమెకి ‘ఐ లవ్ యూ’ చెప్పేస్తాడు. ఆమె స్పందించదు. ఫోన్ నెంబర్ అడిగిన కృష్ణకి నోటికొచ్చిన నెంబర్ చెప్పి అతడ్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. దానివల్ల లంకారాజు (దండపాణి) అనే లోకల్ గూడాతో గొడవ పడాల్సి వస్తుంది కృష్ణకి. జరిగినదానికి కృష్ణకి సంధ్య క్షమాపణలు చెబుతుంది. హైదరాబాద్ నుంచి సెలవులకు విజయవాడలో ఉండే తనకు అన్నయ్య (పెదనాన్న కొడుకు) అయ్యే బాబీ (బ్రహ్మానందం) వద్దకు వచ్చిన సంధ్య ఒకరోజు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోతుంది. తనకు చెప్పాపెట్టకుండా పోయిందనే బాధతో బెజవాడ నుంచి బాబీని వెంటపెట్టుకుని హైదరాబాద్‌కు వెళతాడు కృష్ణ. సంధ్య ఇంట్లోనే దిగుతాడు. సంధ్య అన్న షిండే (సాయాజీ షిండే) గూండాగా మారిన ఓ బిల్డర్. తన చెల్లెలి మీద మనసుపడిన జలదంకి కామేశ్వరరావు అలియాస్ జక్కా (ముకుల్‌దేవ్) అనే కిరాతకుడైన గూండాని ఎదుర్కొనేందుకు అతనలా మారతాడు. క్రమేణా కృష్ణ ప్రేమలో పడుతుంది సంధ్య. ఆ ఇద్దరినీ సన్నిహితంగా చూసిన షిండే తన చెల్లెలికి తగినవాడివి కావని కృష్ణని హెచ్చరించి, తను గూండాగా మారిన వైనాన్ని చెబుతాడు. అంతదాకా జైలులో ఉన్న జక్కా బయటకు వచ్చి సంధ్యని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అతడిని కృష్ణ ఎదుర్కోవడం, ఆటలు ఆడి మట్టికరిపించడం ఎవరైనా ఊహించేదే.

కథనం:
‘కృష్ణ’ కథలో కొత్తదనం ఏమీలేదు. ఇలాంటి కథలు తెలుగులో కొల్లలుగా వచ్చాయి. అయినప్పటికీ ‘కృష్ణ’ అలరించగలిగాడు. కారణం.. వినోదాన్ని నమ్ముకుని ఆద్యంతం విసుగెత్తకుండా కథని నడిపించడం. టూకీగా ఒక్క మాటలో చెప్పాలంటే సంధ్య అనే అమ్మాయిని బలవంతంగా తనదాన్ని చేసుకోవాలనుకునే జక్కా అనే ఓ గూండాని తెలివిగా ఎదుర్కొని, అతన్ని ఓడించి సంధ్యని తనదాన్ని చేసుకునే కృష్ణ అనే అల్లరి యువకుడి కథ ఇది. కృష్ణ పాత్రని మలచిన విధానం, ఆ పాత్రని తనదైన శైలిలో రవితేజ పోషించిన తీరూ ఈ సినిమాకి ఆకర్షణని తీసుకొచ్చి పెట్టాయి. కథని నడిపించిన తీరు ఆమధ్య వచ్చిన ‘ఢీ’ని తలపిస్తుంది. ప్రథమార్థం పూర్తి స్థాయి వినోదంతో సాగడం వల్ల విసుగనిపించదు. సంధ్య వల్ల లంకా రాజుతో గొడవపడి అతన్నీ, అతని గ్యాంగునీ కృష్ణ చావగొట్టే సన్నివేశం మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఓ వైపు వినోదాన్నీ, మరో వైపు యాక్షన్‌నీ సమపాళ్లలో మేళవించి దర్శకుడు తెలివిగా వ్యవహరించాడు. కథనం బిగువుతో సాగడానికి కారణమదే. దీనికి కృష్ణ అన్నావదినలైన చంద్రమోహన్, సుధ పాత్రలు, బ్రహ్మానందం పాత్ర బాగా ఉపకరించాయి. పనిమనిషితో బ్రహ్మానందం శృంగారం ఎపిసోడ్ అసమ్మతమైనదైనా వినోదాన్ని బాగా అందించింది. వేణుమాధవ్ పాత్రతో ఆ ఎపిసోడ్‌కి జీవం వచ్చింది. ఇంటర్వల్ బ్లాకులో  మాత్రం ఎలాంటి ట్విస్టులూ లేవు. అది అతి సాధారణం.
జక్కా పాత్రని కిరాతకంగా మలచిన దర్శకుడు అతని మేనమామ జయప్రకాశ్‌రెడ్డి పాత్రని దుర్మార్గం, హాస్యం మేళవింపుతో చిత్రించిన తీరు ముచ్చటేస్తుంది. అతని పాత్ర పాతకాలం సక్సెస్‌ఫుల్ సినిమాలలోని విలన్ పాత్రల్ని జ్ఞప్తిచేస్తుంది. విలన్ పాత్రకి రవ్వంత బఫూనరీని జోడిస్తే ఆ మజాయే వేరు. అలా అని ఆ బఫూనరీ పాళ్లలో తేడా వచ్చిందా, అంతే సంగతులు! అందుకే ఈ విషయంలో వినాయక్‌ని అభినందించి తీరాలి. కథ మొత్తానికీ కీలకమైన సంధ్య పాత్ర విషయంలో మాత్రం అతడు ఒకింత అలక్ష్యం వహించాడని చెప్పక తప్పదు. కృష్ణ ఆమెని తొలిచూపులోనే ప్రేమించాడు. ఆ ప్రేమని అతను వ్యక్తం చేసినప్పుడు తేలిగ్గా తీసిపారేసిన ఆమె అతణ్ణి తర్వాత ప్రేమించడానికి బలమైన కారణం కావాలి కదా. అలాంటి సన్నివేశం ఒకటి కల్పించినట్లయితే ఆ ఇద్దరి కలయికకు సంబంధించిన సన్నివేశాలు ఎఫెక్టివ్‌గా వచ్చి ఉండేవి. ఆ లవ్ ఫీల్ మిస్సయింది సినిమాలో. సంధ్యకి కృష్ణ మీద ప్రేమ భావన ముందునుంచీ ఉంటే తప్పకుండా అతడికి చెప్పే హైదరాబాద్‌కు వెళ్లాలి. అలా చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత అతడ్ని ఆమె ప్రేమించడానికి ఓ చిక్కనైన సన్నివేశాన్ని కల్పించాలి. అలాంటి సన్నివేశం పడకపోవడం లోపమే. వినాయక్‌లో కనిపించే ప్రధాన బలహీనత పదుల సంఖ్యలో సుమోలు లేదా స్కార్పియో వాహనాల్ని అవసరమున్నా లేకపోయినా ఉపయోగించడం, వాటిలో కొన్నింటిని ధ్వంసం చేయించడం. ఆ బలహీనతని ఇందులోనూ కొనసాగించాడు. ఒకటి రెండు సందర్భాల్లో ప్లేస్‌మెంట్ సరిగా లేకపోవడంతో పాటలు పంటికింద రాళ్లలా ఇబ్బందిపెట్టాయి. అవసరం లేకపోయినా పాటలు ఇరికించే దురలవాటుని తెలుగు దర్శకులు ఎప్పుడు మానుకుంటారో! 

నటీనటుల అభినయం:
కృష్ణ పాత్రని తనదైన రీతిలో విజృంభించి చేశాడు రవితేజ. చిలిపితనం అతని బాడీ లాంగ్వేజ్‌లో ఓ భాగం కావడం వల్ల సరిగ్గా అలాంటి లక్షణాలే ఉండే కృష్ణ పాత్రలో అతను ఒదిగిపోయాడు. మాస్ హీరోగానూ ఉన్న ఇమేజ్ అతడికి ఈ పాత్ర పోషణలో ఉపకరించింది. కష్టపడి నటించాల్సిన భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడం అతని పనిని సులువు చేసింది. సరిగ్గా అతడికి సూటయ్యే పాత్రని కల్పించిన రచయిత, దాన్ని తెరమీద ఆవిష్కరించిన దర్శకుడు.. ఇద్దరూ అభినందనీయులే. సంధ్యగా త్రిష సరిగ్గా సరిపోయింది. రవితేజ పాత్ర డామినేషన్, పాత్ర తీరువల్ల అభినయాన్ని ప్రదర్శించేందుకు ఆమెకు అంతగా అవకాశం లభించలేదు. అయినప్పటికీ అందంగా కనిపించింది. ఒకటి రెండు పాటల్లో కురుచదుస్తుల్లో యువతని గిలిగింతలు పెట్టింది. త్రిష అన్నగా సాయాజీ షిండే యథాప్రకారం నటించాడు. తెలుగు వాళ్లకి ఇప్పటికే పరిచయమైన బాలీవుడ్ నటుడు రాహుల్‌దేవ్ తమ్ముడు ముకుల్‌దేవ్ విలనీని బాగానే పండించాడు. దీని తర్వాత అతనికి మరికొన్ని తెలుగు సినిమాల అవకాశాలు వచ్చే అవకాశముంది. సినిమాకి ఆకర్షణనీ, జీవాన్నీ తీసుకొచ్చీ పాత్రల్లో జయప్రకాశ్‌రెడ్డి, బ్రహ్మానందం అలవోకగా ఇమిడిపోయారు. నెగటివ్ నుంచి పాజిటివ్‌గా మారే పాత్రలో దండపాణి, హాస్యం కోసం ఉద్దేశించిన పాత్రల్లో సునీల్, వేణుమాధవ్, హీరో అన్నావదినలుగా చంద్రమోహన్, సుధ, విలన్ చేతిలో మరణించే పాత్రల్లో తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు రాణించారు.

టెక్నీషియన్ల పనితనం:
వినాయక్ మునుపటి హిట్ ఫిల్మ్ ‘లక్ష్మీ’కి కథని అందించిన ఆకుల శివ ఈ సినిమాకీ కథ అందించి మాటలు రాశాడు. కథ గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఏమీ లేదుకానీ పాత్రల్ని అతను రాసుకున్న విధానం మాత్రం మెచ్చతగినది. మాటల్ని కూడా సందర్భోచితంగా వాడాడు. ముఖ్యంగా రవితేజ, బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి పాత్రలకు సంభాషణలు బాగా నప్పాయి. అయితే దండపాణి పాత్రచేత ‘రౌడీయిజం పుట్టిందే బెజవాడలో’ అనిపించడం సరికాదు. ఆ డైలాగ్ బెజవాడ గొప్పతనాన్ని గాక, దానిలోని చెడుని బయటపెట్టింది. ఆ తరహా మాటల్ని వదిలేయడం మంచిది. ముందే చెప్పుకున్నట్లు కథనం సినిమాకి బాగా కుదిరింది. టైటిల్స్ ప్రకారం ఆ క్రెడిట్ వినాయక్‌దే. చక్రి సంగీతం డిజప్పాయింట్ చేసింది. అతని వాయిద్యాల హోరులో పాటలోని సాహిత్యం వినబడితే (ఉంటే గనుక) ఒట్టు. బీట్ సౌండ్ మాటల్ని మింగేసింది. పాటల ప్లేస్‌మెంట్ కూడా కనీసం రెండుచోట్ల కుదరలేదు. అవి సిగరెట్ పాటలు. సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ సినిమాకి అతనో ఎస్సెట్. సన్నివేశాల్లోని మూడ్‌ని అతని కెమెరా బాగా పట్టుకుంది. రామ్‌లక్ష్మణ్ ఫైట్స్ మాస్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి.

బలాలు, బలహీనతలు:
కథనం, రవితేజ సహా ప్రధాన పాత్రల చిత్రణ, రవితేజ నటన, వినోదం, సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్లు. కొత్తదనంలేని కథ, హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌లో ఫీల్ మిస్సవడం, సంగీతం, అనవసరంగా ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఉపయోగించడం, వాటిని ధ్వంసం చేయడం వంటి ఆర్భాటాలు బలహీనతలు.  
…యజ్ఞమూర్తి    

 

Give your rating:

We would like to hear your comments below: