Andamaina Manasulo

Rating: 2.00/5

Critic Rating: (2.00/5)

నీరసం మిగిల్చే ‘అందమైన మనసులో..’

తేజ దర్శకత్వం వహించిన ‘జయం’ సినిమాలో ‘అందమైన మనసులో ఇంత అలజడెందుకో..’ పాట బాగా పాపులర్. ఆ పాటకి బాణీలు కట్టిందీ, ఆ పాటని పాడిందీ ఆర్పీ పట్నాయక్. తను దర్శకుడి అవతారమెత్తి రూపొందించే తొలి సినిమాకి ఆ పాటలోని తొలి పదాల్నే ఎంచుకున్నాడు పట్నాయక్. అలా ‘అందమైన మనసులో..’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. టైటిల్‌ని బట్టే ఇది ప్రేమకథ అనే సంగతి తెలిసిపోతుంది. మరి టైటిల్ అంత అందంగా సినిమా కూడా వుంటుందా.. అంటే ‘ప్చ్’ అనే మాటే సమాధానంగా వస్తుంది. ‘ఎ మదర్‌లెస్ చైల్డ్ అండ్ ఎ చైల్డ్‌లెస్ మదర్’ గురించి గొప్ప థీసిస్‌ని రూపొందించి డాక్టరేట్ పొందిన ఓ యువకుడు తనే లోకంగా భావించిన ఓ అమ్మాయి ‘అందమైన మనసు’ని తెలుసుకోలేకపోవడం ఈ కథ. సంగీత దర్శకుడిగా చెప్పుకోతగ్గ సక్సెస్ రేటుని సాధించిన పట్నాయక్ నటుడిగా ‘శీను వాసంతి లక్ష్మి’తో ప్రయత్నించి భంగపడ్డాడు. ఇప్పుడు తనలోని సృజనాత్మకతని సంతృప్తి పరచుకోవడానికి దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా అతని తొలి యత్నం ఎలాగుందంటే..

కథ:

ఇది తుషార్ (రాజీవ్ మోహన్) అనే ఓ అనాథ యువకుడి కథ. ఎం.ఎ. సోషియాలజీ చేయడం కోసం యూనివర్శిటీలో చేరిన అతడికి తొలిరోజే సంధ్య (రమ్య) అనే అందమైన సహాధ్యాయి పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. సెలువుల్లో తమ వూరు వెళ్లిన సంధ్య తిరిగి కాంపస్‌కి రాదు. ఆమె బదులుగా ఒక ఉత్తరం వస్తుంది. తాను ఇంటికి వెళ్లేసరికే తన అమ్మానాన్న తనకు సంబంధం ఖాయం చేశారనీ, అందుకని 8 నెలల తమ ప్రేమబంధం కంటే 20 యేళ్లు తనని కని, పెంచి పెద్దచేసిన అమ్మానాన్నల మమకారబంధానికే విలువనిచ్చి పెళ్లి చేసుకున్నాననీ అందులో ఆమె రాస్తుంది. ఈ లోపునే అతడికి 8 వ తరగతి చదువుతున్న బిందు అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఒకసారి ఆమెకి యాక్సిడెంట్ అయితే తనే కాపాడతాడు. దాంతో బిందు అమ్మానాన్నలకు (బెనర్జీ, సన) సైతం తుషార్ సన్నిహితమవుతాడు. కాలక్రమంలో ఆరేళ్లు గడిచిపోతాయి. తుషార్ ‘ఎ మదర్‌లెస్ చైల్డ్ అండ్ ఎ చైల్డ్‌లెస్ మదర్’ అనే టాపిక్ మీద పిహెచ్‌డి థీసిస్ చేస్తుంటాడు. బిందు పెద్దదై కాలేజీలో చదువుకుంటూ వుంటుంది. 19 యేళ్ల ఆమె హృదయంనిండా తుషారే. ఆమె లోకమంతా అతడే. ఒకానొక సమయంలో తన ప్రేమని వ్యక్తం చేస్తుంది. తుషార్ దాన్ని ఖండిస్తాడు. ఆ సమయంలోనే సంధ్య తన భర్తతో బాటు ప్రత్యక్షమవుతుంది. ఆమె జీవితంలో చాలా సంతోషంగా వుంటుంది. తుషార్‌ని బిందు ప్రేమిస్తున్న సంగతి తెలిసిన సంధ్య, తుషార్ మిత్రుడు ఇమ్మాన్యుఏల్ (సునీల్) కలిసి బిందుని పెళ్ళి చేసుకోవాల్సిందిగా అతడి మీద ఒత్తిడి తీసుకువస్తారు. అప్పుడు తుషార్ ఏం చేశాడు? బిందు పట్ల అతడికి ఎలాంటి అభిప్రాయం ఉంది? వారి జీవితాలు సుఖాంతమయ్యాయా, లేదా.. అనేది ముగింపు. 

కథనం:

టైటిల్‌ని బట్టే ఇది సాఫ్ట్ ఫిల్మ్ అని తెలిసిపోతుంది. తనేమిటో ఆర్పీ పట్నాయక్ ఒక పాత్రద్వారా చెప్పించాడు కూడా. పట్నాయక్ పాటని ఆర్. నారాయణమూర్తి తరహాలో పాడితే ఎలా వుంటుందో, అలాగే నారాయణమూర్తి పాటని పట్నాయక్ పాడితే ఎలా వుంటుందో లక్ష్మీపతి పాడి వినిపిస్తాడు. తను మంచి భావుకుణ్ణనేది పట్నాయక్ నమ్మకంగా తోస్తుంది. మాటల్లోనూ, పాటల్లోనూ ఆ తాపత్రయం కనిపిస్తుంది. అయితే ఆ భావుకత ప్రేక్షకుడి హృదయాన్ని స్పృశిస్తేనే ప్రయోజనం. లేదంటే నిష్ఫలం. ‘అందమైన మనసులో’ ఈ రెండో కోవకి చెందడమే విషాదం. ఇది ఇంతవరకు తెరపైకి రాని ప్రేమకథని విడుదలకి ముందు పట్నాయక్ ప్రకటించాడు. నిజమే. ఎమ్యే చదువుతున్న ఓ అబ్బాయిని ఎనిమిదో క్లాసు చదువుతున్న అమ్మాయి అరాధించడం మొదలుపెట్టి 19 యేళ్ల వయసు వచ్చాక ఆ ప్రేమని బహిర్గతం చేస్తే, 28 యేళ్ల హీరో ‘నీ వయసేమిటి.. నా వయసేమిటి?’ అని గద్దించడం ఇంతదాకా ఏ సినిమాలోనూ మనం చూడలేదు. ఆ 28 యేళ్ల హీరోని పట్టుకుని ఆయన మాజీ ప్రేయసి ‘నా వల్లే ఇంతదాకా పెళ్లి చేసుకోలేదు’ అని 30 యేళ్ల వయసు వచ్చాకే ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతున్న ఈ కాలంలో దుఃఖించడం నిజంగానే ఏ సినిమాలోనూ కనిపించలేదు. ప్రేమ గురించి తన మాజీ ప్రేయసి వద్ద గొప్పగా చెప్పిన హీరో తనని ప్రేమించిన ‘నేరా’నికి బిందుని అందరిముందూ కొట్టడం, అవమానించడం నిజంగానే ఇదివరకు ఏ సినిమాలోనూ చూడలేదు. కాబట్టి ఇది కొత్త కాన్సెప్ట్ సినిమా. కొత్త కాన్సెప్ట్ అయితే తప్ప తను ఏ ప్రాజెక్టునీ ఒప్పుకోనని ఈ సినిమాలో ఒక సన్నివేశంలో సునీల్‌తో స్వయంగా పట్నాయక్ చెబుతాడు. అది చెప్పడం కోసమే ఒక సన్నివేశాన్ని తనకోసం అతను కల్పించుకున్నాడు. కానీ కాన్సెప్ట్ కొత్తదైనంత మాత్రాన సరిపోదనీ, అందులో కదిలించే ‘విషయం’ తప్పకుండా వుండాలనే సంగతిని అతను విస్మరించాడు. ఫలితంగా ‘అందమైన మనసులో’ పేరుగొప్ప సినిమాగా మాత్రమే నిలవనున్నది.
పట్నాయక్ ఒక చిన్న సంగతిని గుర్తించలేక పోయాడు. బిందు తనని ప్రేమిస్తున్నదని సంధ్య చెప్పినప్పుడు కూడా ‘తన వయసేమిటి.. నా వయసేమిటి?’ అని మాత్రమే అనగలిగాడు కానీ ‘నేను బిందుని ఆ భావనతో చూడలేదు. చూడను కూడా. తను నాకు చెల్లెలి వంటిది’ అని చెప్పేస్తే గొడవ వుండదు. అలా చెప్పలేక పోయిన అతను ఆవేశంతో ఊగిపోయి.. “మిమ్మల్ని మధ్యవర్తులుగా పంపించిందా?” అని వేగంగా పోయి, అందరిలోనూ ఆమె చెంప చెళ్లుమనిపించి, అవమానించి ‘ఇంక నీ ముఖం నాకు చూపించకు’ అనడం అతని స్వభావానికే విరుద్ధం. ఆ ఒక్క సీనుతో ఒక్కసారిగా తుషార్ పాత్ర ఔచిత్యం దెబ్బతిని పోయింది. క్లైమాక్స్ కూడా మింగుడు పడని వ్యవహారమే. అది ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. ప్రథమార్ధంలోనే సంధ్య పెళ్లి జరిగి ఆమె పాత్ర కథలోంచి తాత్కాలికంగా తప్పుకుంటుంది. ఆ తర్వాత 11 లేదా 12వ రీలు వచ్చేదాకా కథ ముందుకు సాగలేదు. హీరో పాత్ర లక్ష్యం థీసిస్ సమర్పించడమే. దాంతో కథ ‘డ్రై’ అయిపోయింది. 12వ రీలులో ఒక కూర మాడిపోయే సన్నివేశం వుంది. సింబాలిక్‌గా ఈ సినిమాకి దాన్ని అన్వయించవచ్చు. కథ మాడిపోయిన సంగతిని అప్పటికి గాని పట్నాయక్‌లోని దర్శకుడు గుర్తించలేక పోయాడు. అప్పటికే బాగా ఆలస్యమవడంతో చేసేదిలేక హడావుడిగా సినిమాని ముగించేశాడు. ఈ సినిమాలో కొంతైనా జీవముందంటే అది సునీల్, లక్ష్మీపతి జోడీ వల్లే. ఆ ఇద్దరి మధ్య సన్నివేశాలు వినోదాన్నిచ్చాయి. మ్యూజిక్ వినపడితే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయేవాడిగా లక్ష్మీపతి పాత్రని పట్నాయక్ బాగా మలిచాడు.

పాత్రధారుల అభినయం:

తుషార్ (చక్కని నీటి చుక్క)గా నూతన నటుడు రాజీవ్ మోహన్ బాగానే చేశాడు. కాకపోతే మనిషి బలహీనంగా, చూసేవాళ్లకి నీరసం వచ్చేలా ఉన్నాడు. మొదట్లో అతని నడక కాస్త ఇబ్బందిపెట్టింది. డాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా కనిపించినప్పటికీ అతనిలో డాన్స్ స్కిల్స్ వున్నట్లు కనిపించలేదు. సన్నివేశాల్లో బాగానే రాణించాడు. సంధ్యగా రమ్య బొద్దుగా వుంది. ప్రథమార్ధంలో కంటే ద్వితీయార్ధం సీన్లలో ప్రతిభ చూపింది. 19 యేళ్ల బిందు పాత్రలో నటించిన అర్చనా గుప్త కంటే 8వ క్లాసు బిందు పాత్రని చేసిన బాలనటి మెప్పించింది. సునీల్, లక్ష్మీపతి పోటీపడి వినోదాన్ని అందించారు. సినిమాకి కాస్త కళ తెచ్చారు. బిందు తల్లిదండ్రులుగా బెనర్జీ, సన పరిధులమేరకు నటించారు. ప్రొఫెసర్‌గా చాలా రోజులకి గొల్లపూడి మారుతీరావు తెరమీద కనిపించారు. వడ్డే నవీన్ అతిథి పాత్రలో అందంగా వున్నాడు.

 

టెక్నీషియన్ల పనితనం:

ఈ సినిమాకి దర్శకత్వంతో బాటు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం బాధ్యతల్ని కూడా నిర్వర్తించాడు ఆర్పీ పట్నాయక్. ఈ ‘కొత్త’కథని తెరమీదకు తీసుకు రావడంలో అతనిలోని స్క్రీన్‌ప్లే రచయిత మెరుగైన పనితనం చూపలేకపోయాడు. సన్నివేశాల కల్పనలోని లోపాలవల్ల కథనం బాగా నీరసపడింది. సినిమా చాలాచోట్ల బోరనిపించడానికి అదే కారణం. సంగీత బాణీలు ఆకట్టుకున్నాయి. 10 మంది సంగీత దర్శకులు పాడిన ‘అమ్మాయి నవ్వింది’ సహా కనీసం నాలుగు పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్ మాత్రం ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. మేడిశెట్టి అశ్వనీకుమార్ మాటలు సన్నివేశానుసారం సాగాయి. కొన్నిచోట్ల బాగా మెప్పించాయి. కులశేఖర్ రాసిన పాటల్లో సాహిత్యం వినిపించింది. సంతోష్‌రాయ్ పతాజీ సినిమాటోగ్రఫీలో ప్రత్యేకత కనిపించలేదు. స్పెషల్ ఎఫెక్ట్స్ సాయంతో మేఘాల్లో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన పాట కంటికి బాగా నచ్చింది.

బలాలు, లోపాలు:

సునీల్, లక్ష్మీపతి అందించిన వినోదం, పాటలు, మాటలు బలాలు. ‘కొత్త’గా వున్న కథాంశం, కథనం, సన్నివేశాల కల్పన, హీరో హీరోయిన్‌లకు ఎంచుకున్న తారలు, క్లైమాక్స్ ఈ సినిమాకి మైనస్ పాయింట్లు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు బహు స్వల్పం.

 

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: